Sunday, December 22, 2024

మాజీ సిఎం కెసిఆర్‌పై ఇడి కేసు?

- Advertisement -
- Advertisement -

గొర్రెల కొనుగోలు వ్యవహారంలో మాజీ సిఎం కెసిఆర్‌పై ఇడి కేసు నమోదైందని మెదక్ ఎంపి రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్‌లోని అత్యంత పవిత్రమైన శ్రీ పంచముఖి ఆంజనేయస్వామిని గురువారం దర్శించుకుని స్థానిక సాయిబాలాజీ గార్డెన్ వరకు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ….కెసిఆర్‌ను విచారణ చేసేందుకు ఇడి అధికారులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారని వ్యాఖ్యానించారు. మాజీ సిఎంతో పాటు మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీష్‌రావుకు, లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ నుంచి బిఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన వెంకట్రామిరెడ్డి ఈ ముగ్గురికి ముందుంది మొసళ్ల పండగ అని అన్నారు. సిద్దిపేటలో హరీష్‌రావు తనను కాదని ఎవరూ ఎస్కార్ట్‌లో వెళ్లారని అహంకారంతో గంతులు వేశాడని గుర్తుకు చేశారు. కానీ యుద్ధం మొదలు పెట్టాక గెలిచేవరకు వదిలేది లేదని, లక్షాన్ని నిర్దేశించుకుని క్యాడర్‌తో ముందుకు సాగి జనం గుండెల్లో నిలిచిపోయామని అన్నారు. తన గెలుపు తర్వాత మొదటిసారి మెతుకుసీమకు చేరుకున్నందుకు ఎంతో గర్వంగా ఉందని, జీవితకాలం ఈ ప్రాంత ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు.

రఘునందన్ అంటే మాటల మనిషి కాదని.. చేతల మనిషి అని, డబ్బులు, మందు విచ్చలవిడిగా పంచిన కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు చిత్తుగా ఓడిపోయాయని ఎద్దేవా చేశారు. వెంకట్రామిరెడ్డి వెయ్యి కోట్లు ఎన్నికల్లో ఖర్చు పెట్టినా వాటిని లెక్కచేయకుండా గెలిచి చూపించానని ధీమా వ్యక్తం చేశారు. తన పదవీకాలంలో మెదక్ రైల్వే లైన్‌ను అభివృద్ధి చేయడంతోపాటు కేంద్రం నుంచి వచ్చే నిధులతో పార్లమెంట్ పరిధిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపడతానని హామీ నిచ్చారు. విజయోత్సవ ర్యాలీకి వచ్చే ముందు హవేళిఘనపూర్ మండలం, ముత్తాయికోటలో గల సిద్దిరామేశ్వర ఆలయంతోపాటు కూచన్‌పల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో రఘునందన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎంఎల్‌ఎన్ రెడ్డి, శ్రీనివాస్, మెదక్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పంజా విజయ్, మెదక్ అసెంబ్లీ కన్వీనర్ ఎక్కలదేవి మధు, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు నాయిని ప్రసాద్, ఆకుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News