Monday, December 23, 2024

నేషనల్ హెరాల్డ్ ఆఫీస్‌తోపాటు మరో 11 చోట్ల ఈడీ సోదాలు

- Advertisement -
- Advertisement -

ED searches at National Herald Office and 11 other places

న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్‌అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ( ఎజెఎల్) ఆస్తులకు సంబంధించిన మనీల్యాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం మరింత దూకుడు పెంచింది. ఢిల్లీ లోని నేషనల్ హెరాల్డ్ పత్రిక కార్యాలయంతోపాటు మరో 11 ప్రాంతాల్లో మంగళవారం సోదాలు చేపట్టింది. కేసు విచారణలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని మూడు రోజుల పాటు ప్రశ్నించిన వారం లోపే ఈ దాడులు చేపట్టడం గమనార్హం. గత నెల జులైలో సోనియా గాంధీని ఈడీ దాదాపు 12 గంటల పాటు ప్రశ్నించింది. 100 కు పైగా ప్రశ్నలు సంధించింది. అంతకు ముందు రాహుల్ గాంధీని కూడా ఐదు రోజులకు పైగా 150 కి పైగా ప్రశ్నలు సంధించింది. నిధుల వినియోగం, లావాదేవీల్లో కీలకంగా వ్యవహరించిన వారి వివరాల సేకరణ కోసం సోదాలు చేపట్టినట్టు ఈడీ అధికార వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా కొంతమందిని ప్రశ్నించిన తరువాత లభించిన ఆధారాల మేరకు సోదాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సాల్, వంటి వారిని ఏప్రిల్‌లో ఈడీ ప్రశ్నించింది. ఏఐసిసి ఆధ్వర్యం లోని నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రస్తుతం యంగ్ ఇండియన్ అనే ప్రైవేట్ సంస్థ అధీనంలో ఉంది.

అసోసియేటెట్ జర్నల్స్ లిమిటెడ్ ఈ పత్రికను ప్రచురిస్తోంది. సోనియా, రాహుల్ గాంధీలు యంగ్ ఇండియన్ కంపెనీ ప్రొమోటర్లుగా ఉన్నారు. సెంట్రల్ ఢిల్లీ లోని షా జాఫర్ మార్గ్‌లో ఐటిఒ సమీపాన హెరాల్డ్ హౌస్ భవనం ఉంది. ఎజెఎల్ పేరున ఈ కార్యాలయం రిజిస్టర్ అయింది. ఈ కేసులో కొల్‌కతాకు చెందిన డమ్మీ కంపెనీ ప్రమేయం కూడా ఉందని , అక్కడ కూడా సోదాలు జరుగుతున్నాయని ఈడీ అధికారులు చెప్పారు. యంగ్ ఇండియా కంపెనీలో సోనియా, రాహుల్‌కు చెరో 38 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ కేవలం రూ. 50 లక్షలే చెల్లించి, ఏజెఎల్‌కు కాంగ్రెస్ ఇచ్చిన రూ. 90.25 కోట్ల రుణాన్ని రికవరీ చేసే హక్కు పొందిందని ఆరోపిస్తూ బిజెపి ఎంపీ సుబ్రమణ్యం స్వామి 2013లో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. స్వామి ఫిర్యాదుపై స్పందించాలని కోరుతూ గత ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ హైకోర్టు సోనియా, రాహుల్ గాంధీలకు నోటీసులు జారీ చేసింది.

అయితే ఇందులో ఎలాంటి అవకతవకలు లేవని, యంగ్ ఇండియన్ కంపెనీ లాభదాయక సంస్థ కాదని కాంగ్రెస్ చెబుతోంది. ఏజేఎల్‌కు రూ. 800 కోట్ల ఆస్తులు ఉన్నాయని, యంగ్ ఇండియన్ లాభదాయక సంస్థ కాకపోతే దాని భూములు, భవనాలను అద్దెకివ్వడం తదితర వాణిజ్య కార్యకలాపాలు ఎలా చేపడుతోందని ఈడీ సందేహిస్తోంది. ఆదాయపన్ను విభాగం ఎజేఎల్ ఆస్తుల విలువ దాదాపు రూ. 350 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసినట్టు కాంగ్రెస్ పేర్కొంది. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా భారతీయుల వాణిని వినిపించడానికి 1938లో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రారంభించారు. ఎజేఎల్ ఆధ్వర్యంలో పత్రిక నిర్వహణ కొన్నాళ్లు సాగినా ప్రస్తుతం యంగ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో 2016 లో ఈ వార్తా సంస్థ సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News