రూ.2.82 కోట్ల నగదు, 1.8 కిలోల బంగారం స్వాధీనం
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీపార్టీ నేత, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ నివాసంతో పాటు ఆయన సహచరుల ఇళ్లు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్( ఇడి) జరిపిన దాడుల్లో భారీగా నగదు, బంగారం లభ్యమయ్యాయి. మొత్తం రూ.2.82 కోట్ల నగదు,1.8 కిలోల బరువుండే 133 బంగారం బిస్కట్లు సాధీనం చేసుకున్నట్లు ఇడి మంగళవారం తెలిపింది. సోమవారం దాడులు చేసిన వారు మనీ లాండరింగ్‌ప్రక్రియలో మంత్రికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరించిన వారని ఇడి అధికారులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా సోమవారం, ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఒక నగల వ్యాపారి నివాసంతో పాటు ఏడు చోట్ల సోదాలు జరిపింది. స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం వివరాలు తెలపనిదని, రహస్య ప్రదేశంలో దాచి ఉంచినట్లు ఇడి ఒక ప్రకటనలో తెలిపింది.
రూ.2.23 కోట్ల నగదును రాంప్రకాశ్ జ్యువెల్లరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో స్వాధీనం చేసుకున్నట్లు,ఈ సంస్థ డైరెక్టర్లు అంకుశ్ జైన్, వైభవ్ జైన్. సిద్ధార్‌జైన్‌లు మంత్రి అనుయాయులని ఇడి తెలిపింది. వీరితో పాటుగా సత్యేంద్ర జైన్ భార్య పూనమ్ జైన్, ్రప్రుడెన్షిల్ గ్రూపు విద్యాసంస్థలను నడుపుతున్న విజ్ఞాన్ ట్రస్టుకు చెందిన షేర్ సింగ్ జీవన్,అంకుశ్ జైన్ మామ తదితరుల నివాసాలు, కార్యాలయాలపై దాడులు చేసినట్లు ఇడి తెలిసింది. హవాలా లావాదేవీల కేసులోగత నెల 30న అరెస్టయిన సత్యేంద్ర జైన్ ప్రస్తుతం ఇడి కస్టడీలో ఉన్నారు. ఇదే కేసులో సత్యేంద్ర జైన్, ఆయనబంధువులకు సంబంధాలున్నాయని భావిస్తున్న కంపెనీలకు చెందిన రూ.4.81 కోట్ల విలువైన స్థిర చరాస్తులను ఇడి ఇంతకు ముందే జప్తు చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద సిబిఐ 2017లో నమోదు చేసినఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఇడి ఈ కేసు దర్యాప్తు చేస్తోంది. కాగా ఈ సోదాలపై ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రివాల్ తీవ్రంగా మండిపడుతూ ప్రధాని మోడీ ఢిల్లీ, పంజాబ్‌లలోని ఆప్ ప్రభుత్వాలపై కక్ష కట్టారని దుయ్యబట్టారు. మీకు దర్యాప్తు ఏజన్సీల శక్తి ఉంటే దేవుడు మా పక్షాన ఉన్నారని ఆయన అన్నారు.