ఏజెంట్లు చీకోటి ప్రవీణ్,
మాధవరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో
సోదాలు కీలక పత్రాలతో పాటు
కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు
స్వాధీనం ఫెమా నిబంధనలు
ఉల్లంఘించి మనీ ల్యాండరింగ్
సంపన్నుల పిల్లలే వీరి టార్గెట్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఫెమా నిబంధనలు ఉల్లంఘించి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై క్యాసినో ఏజెంట్లు చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లతో పాటు వారి కార్యాలయాల్లో ఇడి అధికారులు బుధవారం నాడు సోదాలు నిర్వహించారు. ఈక్రమంలో నగరంలోని ఐఎస్ సదన్‌కు చెందిన చీకోటి ప్రవీణ్, బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్న మాధవ రెడ్డితో పాటు పలువురు ఏజెం ట్ల ఇళ్లతో పాటు కార్యాలయాల్లో ఇడి అధికారులు ఏకకాలంలో ఎ నిమిది ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి కీలక పత్రాలతో పాటు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్ , సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో మొత్తం 8 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన ఇడి అధికారులు నిందితుల బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. ఏజెంట్లు చీకోటి ప్రవీణ్, మాధవ రెడ్డిలు శ్రీలంక క్యాసినో ఎజెంట్లుగా వ్యవహరిస్తూ ఫెమా నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు విదేశాలకు నిధులు మళ్లించి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఇడి కేసు నమోదు చేసింది. ముఖ్యంగా శ్రీలంకకు చెందిన క్యాసినో సంస్ధలకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న ప్రవీణ్, మాధవ రెడ్డి తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సంపన్నులను క్యాసినో ఆడేందుకు తీసుకెళ్తున్నట్లు ఇడి విచారణలో తేలింది.
కాగా ఇటీవల కాలంలో శ్రీలంకలో సంక్షోభం నెలకొనడంతో ఎజెంట్లు చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డిలు నేపాల్‌తో పాటు భారత్ సరిహద్దుల్లోనూ క్యాసినో నిర్వహిన్నట్లు ఇడి అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో జూన్ 10 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించిన క్యాసినోకు హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, గుంటూర్‌లకు చెందిన వ్యాపార వేత్తలను, సంపన్నుల పిల్లలను శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేపాల్‌కు తీసుకెళ్లి అక్కడ క్యాసినో ఆడించారని ఇడి అధికారుల విచారణలో వెలుగుచూసింది.
ఒక్కొక్కరి నుంచి రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు వసూలు చేసినట్లు ఇడి అధికారులు భావిస్తున్నారు. ఈ డబ్బంతా కూడా శ్రీలంక క్యాసినో సంస్థలకు మళ్లించి అక్కడి నుంచి కమీషన్ తీసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించిన ఇడి ప్రవీణ్,మాధవరెడ్డిలు ఫెమా నిబంధనలు ఉల్లంఘించి క్యాసినో నిర్వహించినట్లు తేల్చారు. విదేశాలలో క్యాసినో ఆడిస్తూ ఫెమా నిబంధనలు ఉల్లఘించడంతో పాటు మనీలాండరింగ్‌కు పాల్పడిన నిందితుల బ్యాంక్ ఖాతాలను పరిశీలించిన అధికారులు కీలక ఆధారాలను సేకరించారు. ఇదిలావుండగా క్యాసినో ఎజెంట్ చీకోటి ప్రవీణ్‌పై గతంలోనూ సిఐడి కేసులున్నట్లు ఇడి అధికారుల దర్యాప్తులో తేలింది. గతంలో ఎపిలోని గుడివాడ, హైదరాబాద్ నగరంలో క్యాసినో ఆడించిన కేసులపై ఇడి విచారణ చేపడుతోంది.
రూటు మార్చిన ఎజెంట్లు
గతం కొంతకాలంగా శ్రీలంకలో సంక్షోభం ఏర్పడటంతో క్యాసినో ఎజెంట్లు చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డిలు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖ నుంచి నుంచి పేకాట రాయుళ్లను ప్రత్యేక విమానాలలో నేపాల్‌కు తరలించి అక్కడ క్యాసినో ఆడిస్తున్నట్లు ఇడి అధికారులు గుర్తించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా వెస్ట్ బెంగాల్ లోని బాగ్ డోగ్ర ఎయిర్‌పోర్ట్‌కు కస్టమర్లను తరలించిఅటునుంచి నేపాల్‌లోని హోటల్ మెచి క్రౌన్‌లో ఆల్ ఇన్ క్యాసినో పేరుతో ఈవెంట్ నిర్వహించినట్లు ఇడి గుర్తించింది. ఈ ఈవెంట్‌లో టాలీవుడ్, బాలీవుడ్, నేపాలీ డ్యాన్సర్లతో కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేయించినట్లు విచారణలో తేలింది. అలాగే ఉత్తరప్రదేశ్, నేపాల్‌లలో క్యాసినో నిర్వహించిన నిందితులు ప్రైజ్ మనీని హవాలా రూపంలో చెల్లించినట్లు తేలింది. వారంపాటు అక్కడే ఉండి క్యాసినో ఆడేందుకు ఒక్కో కస్టమర్ నుంచి రూ.3 నుంచి రూ. 4 లక్షల రూపాయలు వసూలు చేశారని, నాలుగు రోజుల ప్యాకేజీలో భాగంగా ప్లాన్ టారిప్‌లు సైతం అందించారని ఇడి అధికారుల విచారణలో తేలింది. అలాగే నేపాల్‌తో పాటు ఇండోనేషియాలోనూ క్యాసినో ఈవెంట్లు నిర్వహించినట్లు తేలింది.
సంపన్నులే టార్గెట్
తెలుగు రాష్ట్రాలోని సంపన్నులు, పారిశ్రమిక వేత్తల పిల్లలను క్యాసినో ఆడించేందుకు ఎజెంట్లు చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డిలు ఎర వేసినట్లు విచారణలో తేలింది. క్యాసినో ఆడేందుకు వచ్చిన వారికి ఖరీదైన హోటల్స్‌లలో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి వారిని రెగ్యులర్ కస్టమర్లుగా మార్చుకుంటున్నట్లు తేలింది. ఈక్రమంలో క్యాసినో ఎజెంట్లు ప్రవీణ్,మాధవరెడ్డిల ఫోన్ డేటా ఆధారంగా ఇడి విచారణ సాగిస్తోంది. నిందితుల కాల్ డేటాలో సినీ నటుల పిల్లలు, పారిశ్రామిక వేత్తలు, సంపన్నుల పిల్లల ఫోన్ నంబర్లు ఉన్నట్లు తేలడంతో ఇడి అధికారులు ఆదిశగా విచారణ సాగిస్తున్నారు. అదేవిధంగా గత ఆరు నెలలుగా నిందితుల బ్యాంక్ ఖాతాలలో నిధుల జమ, ఫోన్ పే, గూగుల్ పేలపై విచారణ చేపడుతున్నారు. నిందితులకు నగదు బదిలీ చేసిన వారి వివరాలపై ఇడి అధికారులు ఆరా తీస్తున్నారు.