Friday, December 20, 2024

మరో ఆప్ మంత్రిని ప్రశ్నించిన ఇడి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తాజా పరిణామం

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన మరో ఢిల్లీ మంత్రి శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) ఎదుట హాజరయ్యారు. మంత్రి కైలాష్ గెహ్లాట్(49) జాఫ్‌గఢ్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన అరివంద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో రవాణా, హోం, న్యాయ శాఖలను నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో ఆయన సెంట్రల్ ఢిల్లీలోని ఇడి కార్యాలయంలోకి ప్రవేశించడం కనిపించింది.

ఈ కేసులో ప్రశ్నించేందుకు గెహ్లాట్‌ను ఇడి పిలిపించినట్లు వర్గాలు తెలిపాయి. పిఎంఎల్‌ఎ చట్టం కింద గెహ్లాట్ వాంగ్మూలాన్ని ఇడి నమోదు చేసినట్లు వారు చెప్పారు. 2021-22 సంవత్సరానికి కొత్త లిక్కార్ పాలసీని రూపొందించి, అమలు చేయడానికి ఏర్పాటు చేసిన మంత్రుల బృందం(జిఓఎం)లో గెహ్లాట్ కూడా ఉన్నారు. జిఓఎంలో ఆయనతోపాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మాజీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా ఉన్నారు. ప్రస్తుతం వారిద్దరూ ఇదే కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్నారు. ఎకైజ్ పాలసీని సౌత్ గ్రూపుగా వ్యవహరించే లిక్కర్ లాబీకి లీక్ చేశారని, ఈ సౌత్ గ్రూపులో బిఆర్‌ఎస్ నాయకురాలు కె కవిత కూడా ఉన్నారని ఇడి ఆరోపించింది.

ఆప్‌కు, ఆ పార్టీ నాయకులకు సౌత్ గ్రూపు రూ. 100 కోట్ల ముడుపులు చెల్లించిందని ఇడి ఆరోపించింది. గెహ్లాట్ ఒకే సిమ్ నంబర్‌ను వాడినప్పటికీ ఆయన ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ(ఐఎంఇఎల్) మూడుసార్లు మారిందని ఇడి తన చార్జిషీట్‌లో ఆరోపించింది. ఇదే కేసులో ఇడి అరెస్టు చేసిన ఆప్ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ విజయ్ నాయర్‌కు సంబంధించిన చార్జిషీట్‌లో గెహ్లాట్ పేరును ఇడి ప్రస్తావించింది. గెహ్లాట్‌కు కేటాయించిన ప్రభుత్వ బంగళాలో నాయర్ నివసించాడని, కాగా గెహ్లాట్ మాత్రం విచిత్రంగా నజాఫ్‌గఢ్‌లోని ఇంట్లో నివసించేవారని ఇడి పేర్కొంది. ప్రభుత్వ నివాసాన్ని ఇతరుల వాడకానికి అనుమతించడం ఒక ప్రభుత్వ ఉద్యోగి చేయకూడని చర్యగా అభివర్ణించిన ఇడి దీనిపై సిబిఐ చర్యలు తీసుకోవాలని కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News