Thursday, January 23, 2025

ఇడి సమన్లు మరోసారి బేఖాతరు

- Advertisement -
- Advertisement -

ఇడి ఎదుట హాజరుకాని కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) జారీచేసిన తాజా సమన్లను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం మరోసారి బేఖాతరు చేశారు. తమ పార్టీ అధినేతను అరెస్టు చేసి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా అడ్డుకోవడమే ఇడి ఉద్దేశమని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆరోపించింది. తనకు జారీచేసిన నోటీసు చట్టవ్యతిరేకమైనందున తాను ఇడి ఎదుట హాజరుకావడం లేదంటూ ఇడికి కేజ్రీవాల్ లేఖ రాసినట్లు ఆప్ వర్గాలు తెలిపాయి. ఇదే కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఇడి గతంలో ఆయనకు నవంబర్ 2న, డిసెంబర్ 21న హాజరుకావాలని కోరుతూ రెండు సమన్లను జారీచేసింది.

ఈ రెండు సమన్లకు కేజ్రీవాల్ ఈ విధంగానే స్పందిస్తూ ఇడి ఎదుట హాజరుకాలేదు. కాగా..ఈ పరిణామంపై బిజెపి నాయకుడు, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్రంగా స్పందిస్తూ ఇడి సమన్లను కేజ్రీవాల్ వరుసగా తప్పించుకుంటూ ఏదో తప్పు జరిగిందని సూచిస్తున్నారని అన్నారు. దేశంలో ఇప్పటివరకు ఆప్ వంటి అతి పెద్ద అవినీతి పార్టీ లేదని, ఆ పార్టీకి చెందిన పలువురు మంత్రులు ఇప్పటికే జైలుకు వెళ్లారని ఠాకూర్ తెలిపారు. అయితే ఈ ఆరోపణలను ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఖండించారు. ఎన్నికల ముందే కేజ్రీవాల్‌కు ఇడి ఎందుకు నోటీసు పంపించిందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలలో ప్రచారం చేయకుండా అడ్డుకోవడానికే కేజ్రీవాల్‌కు నోటీసు పంపించారని ఆయన ఆరోపించారు. ఏ హోదాలో కేజ్రీవాల్‌కు సమన్లు జారీచేశారో ఇడి ఇప్పటివరకు జవాబు చెప్పలేదని ఆయన అన్నారు.

ఆయనను సాక్షిగానా లేక నిందితుడిగా పిలుస్తున్నారా అని భరద్వాజ్ ప్రశ్నించారు. ఎక్సైజ్ పాలసీ కేసు యావత్తు రాజకీయపరమైందని, లోక్‌సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ పాల్గొనకుండా అడ్డుకోవడమే దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశమని ఆయన చెప్పారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు బిజెపి పన్నిన కుట్రగా ఈ కేసును ఆయన అభివర్ణించారు. ఇడికి కేజ్రీవాల్ మరో లేఖ రాశారని, కాని ఆయన వేసిన ప్రశ్నలకు ఇడి నుంచి ఇప్పటివరకు సమాధానం లేదని మరో ఢిల్లీ మంత్రి ఆతిషి తెలిపారు.

సమన్లు చట్టవిరుద్ధమని ఇడి అధికారులకు కూడా తెలుసునని, బిజెపి కార్యాలయం నుంచి తమకు ఆదేశాలు వచ్చాయన్న వాస్తవాన్ని వారు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని ఆతిషి ఆరోపించారు. కేవంల ఇండియా కూటమికి చెందిన నాయకులకే ఇడి నుంచి సమన్లు జారీ అవుతున్నాయని ఆమె తెలిపారు. ఏడాదిన్నర నుంచి దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఒక్క రూపాయి అవినీతికి చెందిన సాక్ష్యాన్ని కూడా సంపాదించలేకపోయారని ఆమె తెలిపారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే సమన్లు జారీచేశారని, లోక్‌సభ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సమైక్యమవుతున్నాయి కాబట్టే ఇడి ద్వారా ప్రతిపక్షాన్ని అందం చేయాలని బిజెపి భావిస్తోందని ఆమె ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News