కోల్‌కత: మనీ లాండరింగ్ కేసులో అక్టోబర్ 3న న్యూఢిల్లీలోని తమ కార్యాలయంలో హాజరుకావాలంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక బెనర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆదేశించింది. ఈ విషయాన్ని అభిషేక బెనర్జీ తన సోషల్ మీడియా వేదికలో వెల్లడిస్తూ ఇడి తీరుపై మండిపడ్డారు. అదే రోజున తమ పార్టీ న్యూఢిల్లీలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ముండుగానే నిర్ణయించిందని తెలిపారు.
ఈ నెల మొదట్లో న్యూఢిల్లీలో ప్రతిపక్ష ఇండియా కూటమి సమన్వయ సమావేశం జరగనున్న రోజే హాజరుకావాలంటే తనకు ఇడి సమన్లు జారీ చేసిందని, తాను బాధ్యతగా ఇడి ఎదుట హాజరయ్యానని ఆయన తెలిపారు. ఇప్పుడు మళ్లీ తమ పార్టీ ఢిల్లీలో నిరసనలు తలపెట్టిన రోజే తనను ఇడి ఎదుట హాజరుకాలంటూ సమన్లు జారీచేయడాన్ని ఆయన ప్రశ్నించారు. దీన్ని బట్టి తామంటే ఎంతలా భయంతో వణుకుతన్నారో అర్థమవుతోందని ఆయన పరోక్షంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.