Saturday, November 23, 2024

నందకుమార్‌తో నాపై కుట్ర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి పన్నిన కుట్రలను భగ్నం చేసినందుకే తనకు ఇడి నోటీసులు జారీ చేసిందని బిఆర్‌ఎస్ శాసనసభ్యుడు పైలట్ రోహిత్‌రెడ్డి ఆరోపించారు. ఎంఎల్‌ఎల కొనుగోలులో నిందితుడిగా ఉన్న నందకుమార్ స్టేట్‌మెంట్ ద్వారా తనను కేసులో ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపిస్తోందన్నారు. తనను ఎలాగైనా దోషిగా చూపించే దిశగా ఇడి అధికారులు కేసును ముందుకు తీసుకెళ్తున్నారని రోహిత్‌రెడ్డి ఆరోపించారు. అయితే తనను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా వారికి లొంగను…..బెదరను అని ఆయన స్పష్టం చేశారు.

పూర్తి స్థాయిలో మెజార్టీతో కొనసాగుతున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కేంద్రం కూల్చివేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. దీనిని ఒక శాసనసభ్యుడిగా తాను ఎంతో సమయస్పూర్తితో కేంద్రం కుట్రలను బయటపెట్టానని అన్నారు. ఇది బిజెపి పెద్దలకు కంటకింపుగా మారిందన్నారు. అందుకే తనపై లేనిపోని కేసులను పెట్టి అక్రమంగా ఇరికించాలని చూస్తోందని మండిపడ్డారు. ఇలాంటి నీచ, నికృష్ట రాజకీయాలకు తాను తలొగ్గేదే లేదని స్పష్టం చేశారు. అరెస్టు చేసినా వెనకడుగు వేసిది లేదన్నారు.
ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ, దేశంలోని అనేక బిజెపియేతర ప్రభుత్వాలను అక్రమంగా కూల్చుతూ దేశంలో హై స్పీడ్‌లో వెలుతున్న బిజెపి అధికార దాహానికి తాను బ్రేక్ వేశానని అన్నారు. అందుకే తనపై లేనిపోని కేసులు పెట్టి ఇరికేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విమర్శించారు. ఈ కేసులో తననే కాకుండా, తనకుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టే రీతిలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అయితే ఇలాంటి అక్రమ కేసులకు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేదే లేదని స్పష్టం చేశారు. దేశంలోని న్యాయవ్యవస్థపై తనకు సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉందన్నారు.

తన కేసుపై సోమవారం హై కోర్టులో రిట్ పిటిషన్ వేయబోతున్నట్లు రోహిత్‌రెడ్డి వెల్లడించారు. కేసుతో సంబంధం లేని తనను ఇడి ఎందుకు విచారణ చేస్తున్నారని కోర్టుకు వెలుతున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కోనుగోలుపై ఫిర్యాదు చేసిన తనను విచారణ చేస్తుండడంపై కోర్టులో కేసు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎంఎల్‌ఎల కొనుగోలు వ్యవహారంలో నందకుమార్‌తో పాటు మిగతా వారిని కూడా విచారణ చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ నెల 27వ తేదీన యథావిధిగా ఇడి విచారణకు హాజరవుతానని వెల్లడించారు. ఇది పార్టీ (బిఆర్‌ఎస్) సమస్య కాదు..తెలంగాణ ప్రజల సమస్య అని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటి వరకు కేసు వివరాలు చెప్పకుండా ఇడి తనను బయోడేటా ఇవ్వమందన్నారు. మొదటి రోజు విచారణ సందర్భంగా 6 గంటలు కూర్చోబెట్టి అసలు కేసు వివరాలు చెప్పలేదని రోహిత్‌రెడ్డి తెలిపారు.

ఇక రెండో రోజు కేసు వివరాలు చెప్పాలని తాను డిమాండ్ చేస్తే ఎంఎల్‌ఎల కొనుగోళ్ల కేసులో అని చెప్పారన్నారు. ఈ కేసుతో సంబంధం లేకున్నా అభిషేక్‌ను విచారణకు పిలిచారని ఆయన తెలిపారు. శాసనసభ్యుల కొనుగోళ్ల అంశంలో మనీ లాండరింగ్ జరగలేదన్నారు. తన పరిధిలోకి రాని కేసును ఇడి ఎందుకు టేకాఫ్ చేసిందని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో బిజెపి జాతీయ నాయకులైన బిఎస్ సంతోష్, తుషార్‌లకు సిట్ నుంచి నోటీసులు వెళ్లడంతో తనను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారన్నారు. పైగా టిఆర్‌ఎస్ పార్టీ బిఆర్‌ఎస్‌గా మారడాన్ని భరించలేక తమపై దర్యాప్తు సంస్థలను బిజెపి ప్రయోగిస్తోందని రోహిత్‌రెడ్డి విమర్శించారు.
తనతో పాటు అభిషేక్‌ను విచారిస్తే ఇడికి కావాల్సింది దొరకలేదన్నారు. తాజాగా నందకుమార్‌ను విచారిస్తున్నారన్నారు. ఆయన ద్వారా బిజెపికి అనుకూలంగా వాంగ్మూలం తీసుకోవాలని ఇడి ప్రయత్నిస్తుందన్నారు. ఈ మేరకు తనకు పక్కా సమాచారం ఉందని రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇక న్యాయపరంగానే కేంద్రం పెట్టిన కేసులను ఎదుర్కొంటానని ఆయన తెలిపారు. కేసులు పెట్టినంత మాత్రాన బిఆర్‌ఎస్ శాసనసభ్యులు భయంతో లొంగిపోతారని బిజెపి పెద్దలు అనుకోవడం కేవలం భ్రమేనని రోహత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పైగా మరింత రెట్టింపు ఉత్సాహంతో పోరాటం చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News