Wednesday, January 22, 2025

జార్ఖండ్‌లో పట్టుబడిన నోట్ల గుట్టలు ఆ ఎంపీవే..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మనీ లాండరింగ్ కేసులో అరెస్టయి జైలుపాలైన హేమంత్ సోరెన్‌కు చెందిన ఢిల్లీ నివాసంలో స్వాధీనం చేసుకున్న బిఎండబ్లు కారు ఆయనదు కాదని, గత ఏడాది ఆదాయం పన్ను శాఖ జరిపిన దాడులలో భారీగా నగదు పట్టుబడిన కాంగ్రెస్ ఎంపికి చెందినదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) వర్గాలు గురువారం వెల్లడించాయి. జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ ప్రసాద్ సాహుకు చెందిన కంపెనీ పేరిట ఆ కారు రిజిస్టర్ అయిందని వర్గాలు తెలిపాయి. సాహుకు చెందిన కార్యాలయాలు, నివాసాలపై గత ఏడాది డిసెంబర్‌లో దాడులు జరిపిన ఐటి అధికారులు రూ. 351 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ స్థాయిలో లెక్కల్లో చూపని నగదు పట్టుబడడం ఇదే మొదటిసారి.

అల్లారాలలో గుట్టలుగా పేర్చిన నగదును కౌంటింగ్ యంత్రాల సాయంతో ఐటి అధికారులు లెక్కిస్తున్న దృశ్యాలు టీవీలలో దర్శనమివ్వడంతో కాంగ్రెస్‌పై బిజెపి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. అయితే స్వాధీనం చేసుకున్న నగదుతో తమకు ఎటువంటి సంబంధం లేదని ప్రతిపక్ష కాంగ్రెస్ స్పష్టం చేసింది. సాహు కూడా ఈ నగదు తమ లిక్కర్ వ్యాపారానికి చెందినదని, దీనికి కాంగ్రెస్‌తో ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. నగదును స్వాధీనం చేసుకోవడానికి 10 రోజులు పట్టగా నగదును లెక్కించడానికి 40 కౌంటింగ్ యంత్రాలను ఐటి అధికారులు ఉపయోగించవలసి వచ్చింది. జనవరి 29న హేమంత్ సోరెన్‌కు చెందిన ఢిల్లీ నివాసంలో ఈ బిఎండబ్లు కారును ఇడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నీలం రంగు ఎస్‌యువికి హర్యానా నంబర్ ప్లేట్ ఉంది. ఈ కారుకు సంబంధించి శనివారం ప్రశ్నించడానికి సోరెన్‌కు ఇడి అధికారులు సమన్లు జారీ చేశారు. జార్ఖండ్‌లో చట్టవిరుద్ధంగా భూ యాజమాన్యమార్పిడికి పాల్పడిన మాఫియాతో హేమంత్ సోరెన్‌కు సంబంధం ఉందన్న ఆరోపణలతో ఆయనను ఇడి అరెస్టు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News