న్యూఢిల్లీ : సంచలనాత్మక ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం సమన్లు వెలువరించింది. గురువారం (నవంబర్ 2 వ తేదీ) విచారణకు రావాల్సిందని తెలిపింది. లిక్కర్ పాలసీకి సంబంధించి ఇప్పటికే ఇటు ఇడి, అటు సిబిఐలు వేర్వేరుగా ఆప్ నేతలు పలువురిపై కేసులు నమోదు చేస్తూ , వారిని విచారిస్తూ వస్తోంది. కొందరు ప్రముఖ నేతలు జైలు పాలయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో ఈ ఏడాది ఎప్రిల్‌లో కేజ్రీవాల్‌ను సిబిఐ విచారించింది. పలు విధాలుగా ప్రశ్నించింది. ఇప్పుడు ఇడి నుంచి సమన్లు రావడం కీలక అంశం అయింది.
ఇటీవలే కేంద్రీయ దర్యాప్తు సంస్థలు సుప్రీంకోర్టు ముందు ఈ కేసుకు సంబంధించి మొత్తం ఆమ్ ఆద్మీపార్టీని (ఆప్‌ను) ముద్దాయిల జాబితాలో చేర్చి విచారించాల్సి ఉందని వాదించాయి. కేసు పూర్వాపరాలు ఆప్ అధికార హయాంలో కేంద్రీకృతం అయి ఉన్నందున ఆప్‌ను నిందితుల జాబితాలో చేర్చాల్సి ఉందని తెలిపాయి. ఈ క్రమంలో ఆప్ అధినేతకు సమన్లు రావడం రాజకీయ వర్గాలలో ప్రకంపనలకు దారితీసింది. లిక్కర్ కేసులో నిందితుడుగా ఉన్న ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సోమవారం బెయిల్ నిరాకరించారు. దాదాపుగా పది నెలలుగా ఆయన జైలులో ఉంటున్నారు.