జలంధర్ : పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీని అక్రమ ఇసుక తవ్వకాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం దాదాపు ఆరు గంటల పాటు ప్రశ్నించింది. ఈ విషయాన్ని ఆయన ఓ ట్వీట్ ద్వారా గురువారం తెలిపారు. ఆయన మేనల్లుడు భూపీందర్ సింగ్ హనీ ఈ కేసులో ప్రధాన నిందితుడు. మైనింగ్ కేసులో తనను ఈడీ బుధవారం పిలిచిందని, వారు అడిగిన ప్రశ్నలకు తనకు తెలిసినంతవరకు సమాధానాలు చెప్పానని చన్నీ ట్వీట్‌లో వివరించారు. ఈ కేసులో ఇప్పటికే ఓ చలానాను కోర్టుకు ఈడీ సమర్పించిందన్నారు.
మరోసారి రావాలని తనను అధికారులు కోరలేదని చెప్పారు. హనీ నుంచి స్వాధీనం చేసుకున్న రూ.10 కోట్ల నగదు గురించి ప్రధానంగా ప్రశ్నించారని తెలుస్తోంది. చన్నీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అధికారులు, ఉద్యోగులను బదిలీ చేయించినట్టు వచ్చిన ఆరోపణలపై కూడా ప్రశ్నించినట్టు సమాచారం. హనీ సన్నిహితుడు కుద్రత్ దీప్ సింగ్, తదితరులపై రహోన్ పోలీస్ స్టేషన్‌లో 2018 మార్చిలో కేసు నమోదైంది. దీని ఆధారంగా ఈడీ 2021 నవంబరు 30 న ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టును నమోదు చేసింది. గనుల యజమానులు, వారి సహచరులపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఏప్రిల్ 1 న ఈడీ ఛార్జిషీటును దాఖలు చేసింది.