ఝార్ఖండ్ మంత్రి అలంగీర్ ఆలమ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన పర్సనల్ సెక్రటరీ సంజీవ్‌లాల్ సహాయకుడి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు పట్టుపడడంతో మంత్రి అలంగీర్‌కు ఈడీ నోటీసులు పంపింది. ఈనెల 14న తమ ముందు హాజరు కావాలని ఈడీ ఆయనను కోరింది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మనీలాండరింగ్ చట్టం కింద మే 6న రాంచీలో ఈడీ దాడులు నిర్వహించింది. సంజీవ్‌లాల్ డొమిస్టిక్ హెల్ప్ జహంగీర్ ఇంట్లో లెక్కల్లో చూపించని రూ. 35 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది.
అనంతరం ఈ ఇద్దరినీ పిఎంఎల్‌ఎ కింద అరెస్టు చేయడంతో కోర్టు వారిని ఆరు రోజుల కస్టడీకి పంపింది. కాగా, కాంగ్రెస్ కోటా నుంచి ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అలంగీర్ ఆలమ్ ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలంటూ మంత్రి అలంగీర్‌కు ఈడీ నోటీసులు పంపడం ప్రాధాన్యతను సంతరించుకుంది.