19న హాజరుకావాలని ఆదేశం
న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కుంభకోణంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) తాజాగా బుధవారం ఆరవ సమన్లను జారీచేసింది. ఫిబ్రవరి 19న తమ ఎదుట హాజరుకావాలని 55 ఏళ్ల ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌ను ఇడి ఆదేశించింది. ఈ కేసులో తాము జారీచేసిన సమన్లను ధిక్కరించారని ఆరోపిస్తూ ఇడి దాఖలు చేసిన పిటిషన్‌పై గత వారం విచరణ జరిపిన ఢిల్లీ కోర్టు ఫిబ్రవరి 17న కోర్టులో హాజరుకావాలని కేజ్రీవాల్‌ను ఆదేశించింది.
ప్రాథమిక సాక్ష్యాధారాల ప్రకారం ఆప్ అధినేత ఇడి ఆదేశాలను న్యాయపరంగా పాటించాల్సి ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. గతంలో ఐఆర్‌ఎస్ అధికారిగా పనిచేసిన కేజ్రీవాల్‌కు ఎక్సైజ్ పాలసీ కేసులో ఇడి సమన్లు జారీచేయడం ఇది ఆరవసారి. గతంలో ఫిబ్రవరి 2, జనవరి 18, జనవరి 3, గత ఏడాది డిసెంబర్ 21, నవంబర్ 2 తేదీలలో ఇడి సమన్లు జారీచేసింది. ఈ నోటీసులను చట్టవిరుద్ధమని పేర్కొంటూ కేజ్రీవాల్ ఇడి ఎదుట హాజరుకావడం లేదు.