Friday, December 20, 2024

కేజ్రీవాల్‌కు ఇడి పదే పదే సమన్లు పంపుతోంది: ఆప్ మంత్రి ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎక్సైస్ విధానం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ సవాల్ పిటిషన్‌పై కోర్టు నిర్ణయం కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) నిరీక్షించకుండా ఆయనకు సమన్లు పంపుతోందని ఢిల్లీ మంత్రి ఆతిషి బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టబడ్ధ ప్రక్రియను మన్నించవలసిందిగా దర్యాప్తు సంస్థను మంత్రి కోరారు. ఎక్సైజ్ విధానంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో తనకు జారీ అయిన సమన్లను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇడి వైఖరి తెలియజేయాలని ఢిల్లీ హైకోర్టు బుధవారం కోరింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ)లోని కొన్ని నిబంధనలను కూడా సవాల్ చేస్తున్న ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ పిటిషన్ చెల్లుబాటు కాదని ఇడి వాదించింది. ఆతిషి ‘పిటిఐ వీడియోస్’తో మాట్లాడుతూ, ‘ఇడి పదే పదే సమన్లు పంపుతోంది. సమన్ల చట్టబద్ధతను ప్రశ్నిస్తూ కేజ్రీవాల్ పంపిన సమాధానలకు స్పందన ఏదీ లేదు.

హైకోర్టులో కేజ్రీవాల్ అర్జీని ఇడి వ్యతిరేకించింది. వారు అర్జీని తిరస్కరించాలని డిమాండ్ చేశారు. కానీ, హైకోర్టు వారి స్పందన కోరింది’ అని వివరించారు. తాజా సమన్ల దృష్టా కేజ్రీవాల్ కోర్టును ఆశ్రయించారు. ‘ఆ సమన్ల చట్టబద్ధత గురించి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటి వరకు ఇడి జవాబు ఇవ్వలేదు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా రౌజ్ అవెన్యూ కోర్టుకు ఇడి వెళ్లింది. కానీ కోర్టు నిర్ణయం కోసం ఇది నిరీక్షించడం లేదు. దయచేసి చట్టబద్ధ ప్రక్రియను మన్నించవలసిందని ఇడికి చెప్పాలని అనుకుంటున్నాం’ అని ఆతిషి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News