Saturday, December 21, 2024

రాజస్థాన్ సిఎం కుమారుడికి ఈడీ సమన్లు

- Advertisement -
- Advertisement -

జైపూర్ : మరో నెల రోజుల్లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ డోటాస్రా , మహువా నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. ఫెమా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో వైభవ్‌కు ఈ సమన్లు అందినట్టు తెలిసింది. ఈ కేసులో వైభవ్‌ను ప్రశ్నించేందుకు అక్టోబర్ 27 న దర్యాప్తు సంస్థ ఎదుట హాజరు కావాలని ఈడీ పేర్కొన్నట్టు అధికారులు వెల్లడించారు.

ఇక పరీక్షా పత్రం లీక్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో ఈడీ గురువారం సోదాలు చేపట్టింది. సీకర్, జైపుర్‌లో గోవింద్ సింగ్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాలు, మహువా కాంగ్రెస్ అభ్యర్థి ఓం ప్రకాశ్ హుడ్లా నివాసంతో సహా పలు ప్రాంతాల్లో ఈ తెల్లవారు జాము నుంచి ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తం ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు చేపట్టినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే , ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈడీ ఇలా సోదాలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.

దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ కేంద్రంపై ధ్వజమెత్తారు. “ అక్టోబర్ 25న, రాజస్థాన్ మహిళల కోసం కాంగ్రెస్ హామీలు ప్రకటించింది. ఆ మరుసటి రోజు అక్టోబరు 26న రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్‌పై ఈడీ దాడులకు దిగింది. నా కుమారుడు వైభవ్‌కు సమన్లు జారీ చేసింది. రాష్ట్రంలో మహిళలు, రైతులు, పేదలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీల ప్రయోజనాలను పొందాలని బీజేపీ కోరుకోవడం లేదు. అందుకే ఇలా ఈడీతో ‘ఎర్ర గులాబీలు’ పంపిస్తోందని నేను చాలాసార్లు చెప్పాను. నా మాటలు ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటాయి” అని గెహ్లాట్ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. 200 శాసనసభ స్థానాలున్న రాజస్థాన్‌లో నవంబరు 25 న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలను ప్రకటించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News