కోల్‌కతా : బొగ్గు స్మగ్లింగ్ కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారం నాడు సమన్లు పంపింది. వచ్చే శుక్రవారం నాడు కోల్‌కతా లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కోరింది. అభిషేక్‌ను విచారించడానికి తమ అధికారులు కోల్‌కతా వెళ్తున్నట్టు ఈడీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అభిషేక్ బెనర్జీకి కేంద్ర దర్యాప్తు సంస్థలు నోటీసులు పంపే అవకాశం ఉందని టీఎంసీ సుప్రీం మమతాబెనర్జీ సోమవారం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. సీబీఐ ఇప్పటికే అభిషేక్ బెనర్జీ భార్య రుజిర నరుల బెనర్జీని ఈ కేసులో విచారించింది. ఇదిలా ఉండగా సోమవారం ఉదయమే అభిషేక్ బెనర్జీ ఇండియా పాకిస్థాన్ గేమ్‌లో అమిత్‌షా తనయుడు జైషా కనిపిస్తున్న ఓ వీడియోను ట్వీట్ చేశారు. భారత్ గెలిచాక జాతీయ జెండాను పట్టుకునేందుకు జై నిరాకరించినట్టు ఇందులో కనిపిస్తోంది. “వాళ్లు చాలా నాటకాలాడతారు. విలువలు ఉండవు. అబద్ధాలు ఆడటంలో నిపుణులు. దేశభక్తి లోపించింది.” అని అభిషేక్ ఆ ట్వీట్‌లో విమర్శించారు.