Sunday, January 19, 2025

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌కు ఈడీ సమన్లు

- Advertisement -
- Advertisement -

ED summons to Jharkhand Chief Minister Hemant Soren

రాంచి : మైనింగ్ లీజులకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో తాజాగా ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. నవంబర్ 3 న రాంచీ లోని కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటివరకు ముఖ్యమంత్రి రాజకీయ ప్రతినిధి పంకజ్ మిశ్రా, మరో ఇద్దరు అరెస్టయ్యారు. ఈడీ జులై నెలలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహించి మిశ్రాకు చెందిన రూ. 11.88 కోట్లు స్వాధీనం చేసుకుంది. అలాగే ఆయన ఇంట్లో లెక్కల్లోకి రాని రూ. 5.34 కోట్లను గుర్తించింది. అలాగే ముఖ్యమంత్రి పాస్‌బుక్స్, ఆయన సంతకం చేసిన చెక్స్‌ను స్వాధీనం చేసుకుంది. సోరెన్ నియోజకవర్గమైన బర్హైత్‌లో మైనింగ్ వ్యాపారాన్ని మిశ్రా నియంత్రిస్తున్నారని అభియోగాలు మోపింది.

మైనింగ్ లీజుల వ్యవహారంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అక్రమాలకు పాల్పడ్డారని, సీఎంవో కార్యాలయాన్ని దుర్వినియోగపరిచారని ఇటీవల అభియోగాలు వచ్చాయి. ముఖ్యమంత్రిపై అనర్హత వేటు వేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ కొద్ది నెలల క్రితమే ఫిర్యాదు చేసింది. దీనిపై ఈసీ తన నిర్ణయాన్ని ఆగస్టు 25 న గవర్నర్‌కు పంపించింది. దాంతో సోరెన్ సభ్యత్వంపై వేటు పడుతుందని కొద్ది నెలలుగా వార్తలు వస్తున్నాయి. అయితే దానిపై ఇంతవరకు నిర్ణయం వెలువడలేదు. గవర్నర్ రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారంటూ రాష్ట్ర మంత్రులు చేస్తున్న ఆరోపణలపై రమేశ్ స్పందిస్తూ .. “ నాకు రాజకీయ ఉద్దేశాలుంటే ఈసీ సిఫార్సు మేరకు ఈపాటికే నిర్ణయం తీసుకునేవాడిని. అలా కాకుండా రెండో అభిప్రాయం కోరాను’ అని వివరించారు. రెండో అభిప్రాయం వచ్చాక ఎలాంటి నిర్ణయం ఉండొచ్చని విలేకరులు ప్రశ్నించగా, ‘ఢిల్లీలో టపాసులపై నిషేధం ఉంది. కాని ఝార్ఖండ్‌లో లేదుగా ..బహుశా ఓ అణుబాంబు పేలొచ్చు ’ అని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News