ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌పై కేంద్ర ప్రభుత్వం ఉచ్చు బిగుస్తోంది. ఈసారి ఎలాగైనా ఆమ్‌ఆద్మీ పార్టీకి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు దక్కకూడదన్న గట్టిపట్టుదలతో బిజెపి పావులు కదుపుతోంది. ఢిల్లీ మద్యం పాలసీలో రూ.2026 కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం కలిగించే విధంగా స్కామ్ జరిగిందని కాగ్ నివేదిక ఇటీవల బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కుంభకోణం కేసులో విచారించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు కేంద్రం అనుమతులివ్వడం అసెంబ్లీ ఎన్నికల ముందు మరిన్ని చిక్కులు కల్పించడమే. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలను సాధించుకోడానికి బిజెపి, ఆప్, కాంగ్రెస్ పార్టీలు పోరు సాగిస్తున్నా ఇది కేజ్రీవాల్, మోడీ మధ్య ప్రత్యక్షపోరుగా సాగుతోంది. స్థానికంగా కేజ్రీవాల్‌ను ఎదుర్కొనే సరైన స్థానిక నేత ఎవరూ బిజెపికి కనిపించడం లేదు. ఇది మోడీకి చాలా ఇబ్బందిగా తయారైంది. ఢిల్లీ చాలా చిన్న రాష్ట్రమైనప్పటికీ, అసెంబ్లీ ఎన్నికలను డూ ఆర్ డై ప్రాజెక్టుగా బిజెపి చేపడుతోంది. ఇప్పటివరకు ఢిల్లీని 30 మంది ముఖ్యమంత్రులు పాలించారు. వారిలో కేజ్రీవాల్ ఒకరు. ఢిల్లీ రాష్ట్ర జిడిపి దాదాపు 130 బిలియన్ డాలర్లవరకు ఉంటోంది. ఢిల్లీ పాలనా విధానాలు దేశ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో ఏదెలాగైనా ఢిల్లీని కొల్లగొట్టాలని మోడీ, ఆయన నాయకుల ఆకాంక్ష. పార్టీలను కొత్తగా ఫిరాయించిన వారందరికీ ఎంపీలతో సహా బిజెపి ఈ ఎన్నికలకు టికెట్లు ఇచ్చింది. అయితే సిఎం అభ్యర్థి ఎవరో తెలియకపోయినా, మోడీ ముఖచిత్రంతో గోడలపై పోస్టర్లు ప్రత్యక్షమవుతున్నాయి. ఢిల్లీలో కూడా డబుల్ ఇంజిన్ పాలన అవసరమని బిజెపి ప్రచారం చేస్తోంది. ఇప్పటికే లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రం ఆప్ ప్రభుత్వ అధికారాలన్నీ హస్తగతం చేసుకుంది. అంతేకాదు ముఖ్యమంత్రి ఆతిశీకి అధికారిక కారు, ఆఫీస్ ఉన్నా, చాలావరకు లెఫ్టినెంట్ గవర్నర్ పర్యవేక్షణలో ఉంటున్నాయి. మరి అలాంటప్పుడు సమస్య ఎక్కడ? బిజెపి రైసినా హిల్స్‌ను పాలించినప్పుడు అదే సమయంలో సివిల్ లైన్స్ సెక్రటేరియట్‌కు 26 ఏళ్లపాటు బిజెపి దూరంగా ఉండవలసి వచ్చింది. దీనికి తోడు 2014 నుంచి మోడీకి కంట్లో నలుసులా కేజ్రీవాల్ తయారయ్యాడు. రానురాను ఢిల్లీ పీఠంపై బలీయమైన నాయకుడుగా కేజ్రీవాల్ తయారవుతారన్న భయం బిజెపికి పట్టుకుంది. కానీ వాస్తవానికి జాతీయస్థాయి ప్రజామోదం, విశ్వసనీయతలో మోడీ ముందు కేజ్రీవాల్ చిన్నవాడే. దశాబ్దం కన్నా ఎక్కువ కాలం మోడీ ప్రధానిగా ఉండడంతో కేజ్రీవాల్ లోయర్ డబుల్ డిజిట్స్‌కు వ్యతిరేకంగా మోడీ వ్యక్తిగత ఇమేజి రేటింగ్ 60% అధిగమించింది. జాతీయ ఎన్నికల్లో ఆ ఇమేజిని మోడీ పదేపదే నిలబెట్టుకుంటున్నారు. 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాషాయం పార్టీ ఢిల్లీ రాష్ట్రంలోని మొత్తం ఏడు స్థానాలను తుడిచిపెట్టేసింది. స్థానిక ఎన్నికల్లో మాత్రం మోడీ భారీ ఎత్తున ప్రచారం సాగించినప్పటికీ, బిజెపిని కేజ్రీవాల్ మట్టి కరిపించారు. ఢిల్లీ మోడల్ పరిపాలన విధానం ఉపయోగించి కేజ్రీవాల్ పెంచుకుంటున్న సామర్ధం కమలనాథుల దళాన్ని కలవరం కలిగిస్తోంది. 2012లో అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే చేపట్టిన ఉద్యమం ద్వారా కేజ్రీవాల్ వెలుగులోకి వచ్చారు. బిజెపి ప్రధానిగా మొదట మోడీ 2013లో రంగప్రవేశం చేశారు. మోడీ దేశప్రధానిగా పరిపాలన ప్రారంబిస్తున్న సమయంలో కేజ్రీవాల్ తన పార్టీతో 2013లోనే ఢిల్లీలోని మొత్తం 70 సీట్లలో 28ని గెలవగలిగారు. కాంగ్రెస్ పొత్తుతో కేజ్రీవాల్ స్వల్పకాల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. లోక్‌సభ ఎన్నికల్లో మోడీ ప్రభంజనానికి కేజ్రీవాల్ ప్రభుత్వం నిలబడలేకపోయినాసరే అప్పటి నుంచి కేజ్రీవాల్ ఎదురులేని ముఖ్యమంత్రిగానే కాకుండా జాతీయస్థాయి పోటీ నాయకునిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలిగారు. గుజరాత్‌తో సహా మిగతా రాష్ట్రాల్లో తన ముద్ర విస్తరించుకోగలిగారు. పంజాబ్‌లో మొత్తం 117 స్థానాలకు 92 స్థానాలను గెల్చుకుని ఆప్ చరిత్రను సృష్టించింది. 12 ఏళ్లలో జాతీయ హోదా కలిగిన ఐదు పార్టీల్లో ఒకటిగా ఆప్ స్థానం సంపాదించగలిగింది. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ స్థానాలను ఆప్ స్వాధీనం చేసుకోవడంతో కాంగ్రెస్, రాహుల్ కన్నా ఆప్‌తోనే పొత్తుగా ఉండడానికి ప్రాంతీయపార్టీలు మొగ్గుచూపుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మమతా బెనర్జీ, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, అఖిలేష్ యాదవ్, తదితరనేతలు లిక్కర్ స్కాం సంగతి పక్కనపెట్టి కేజ్రీవాల్‌కు తమ మద్దతును ప్రకటించడం విశేషం. ఈ విధంగా కేజ్రీవాల్‌కు పెరుగుతున్న పాప్యులారిటీని బిజెపి జీర్ణించుకోలేకపోతోంది. ఇదివరకటి ఢిల్లీ ముఖ్యమంత్రులెవరూ ఇప్పటిలా ప్రధానితో నేరుగా సంఘర్షించే పరిస్థితి ఉండేది కాదు. 1967లో ఢిల్లీ మొదటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ విజయ్‌కుమార్ మల్హోత్రా ఇండిపెండెంట్ అధికారాలు లేకపోయినా ఢిల్లీని సిటీ ఆఫ్ ఫౌంటేన్లుగా మార్చడానికి లెఫ్టినెంట్ గవర్నర్‌తో సన్నిహితంగా మసలి పనిచేశారు. యమునా నదిని కూడా పాక్షికంగా ప్రక్షాళన చేయగలిగారు. తరువాత వచ్చిన బిజెపి సిఎంలు కూడా కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలతో సర్దుకుపోయేవారు. మూడు సార్లు ఢిల్లీ సిఎంగా పని చేసిన షీలాదీక్షిత్ కేంద్రంలోని వాజ్‌పాయ్‌తో సన్నిహితంగానే ఉండేవారు. కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్, ఆయన విలాసవంతమైన జీవనశైలిని ఎత్తిచూపుతూ బిజెపి ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నివారించలేకపోవడం, మరిన్ని కనీస సౌకర్యాలు సమకూరకపోవడం ఇవన్నీ కేజ్రీవాల్ అంటే ప్రజల్లో ఆమోదం రానురాను క్షీణిస్తోందని బిజెపి భావిస్తోంది.
కేంద్రం ఉచ్చులో కేజ్రీవాల్..
- Advertisement -
- Advertisement -
- Advertisement -