న్యూస్‌డెస్క్: నిర్మాత ఎడిటర్ మోహన్ ఎన్నో సక్సెస్ చిత్రాలు నిర్మించారు. మామగారు, బావ బావమరిది, హనుమాన్ జంక్షన్ లాంటి సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించిన చరిత్ర ఆయనది. చిరంజీవి హీరోగా తాను నిర్మించిన హిట్లర్ చిత్రం తెర వెనుక కబుర్లను ఆయన ఇటీవల ఒక తమిళ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో పంచుకున్నారు. మలయాళంలో మమ్ముటి హీరోగా నిర్మించిన హిట్లర్ చిత్రం ప్రీమియర్ షోను ఇతర భాషలకు చెందిన నిర్మాతల కోసం ప్రత్యేకంగా మద్రాసులో వేశారు. ఆ షోకు ఎడిటర్ మోహన్ కూడా వెళ్లారు.
తెలుగు, తమిళం, కన్నడ చిత్ర నిర్మాతల కూడా చాలా మందే వచ్చారు. ప్రొజెక్షన్ పూర్తయింది. సినిమాపై ఎవరికీ జడ్జ్‌మెంట్ రావడం లేదు. హీరోకి ఐదుగురు చెల్లెళ్లు, వారి బాధ్యతలు, బాధ్యతలు వదిలి పారిపోయిన తండ్రి అనే కాన్సెప్ట్ కమర్షియల్‌గా సక్సెస్ అవుతుందా అన్న అనుమానం చాలామందిలో ఏర్పడింది. మళ్లీ కబురు చేస్తామంటూ వారంతా అక్కడ నుంచి జారుకున్నారు. అయితే ఎడిటర్ మోహన్ మాత్రం ఆ చిత్ర దర్శకుడు సిద్దిక్ లాల్‌ను కలిసి తెలుగులో ఆ చిత్రనిర్మాణ హక్కులను తాను కొంటానని చెప్పారు.
ఆయన చెప్పిన రేటు మలయాళ నిర్మాతకు నచ్చలేదు. ఆయన ఇంకో రేటు చెప్పాడు. అయితే మోహన్ మాత్రం తాను తెలుగులో ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేస్తానని, వచ్చే లాభంలో కొంత భాగాన్ని ఇస్తానని చెప్పి ఆ నిర్మాతలను తాను చెప్పిన రేటుకే ఒప్పించారు. అప్పటికి ఆయన తెలుగు వెర్షన్‌కు ఎవరు హీరో అన్నది ఇంకా నిర్ణయించుకోలేదు. దాదాపు నెలరోజుల పాటు ఆలోచించిన తర్వాత మమ్ముటి ధరించిన పాత్రకు చిరంజీవి అయితే కరెక్ట్‌గా సరిపోతాడని ఆయనకు అనిపించింది. కాని 1996 సంత్సరంలో చిరంజీవి మార్కెట్ డల్‌గా ఉంది. వరుస పరాజయాల కారణంగా చిరంజీవి మేకప్ వేసుకుని ఏడాది అయింది. ఈ పరిస్థితిలో చిరంజీవిని హీరోగా పెట్టుకుని సినిమా నిర్మించడమంటే పెద్ద రిస్క్ అనే చెప్పాలి. పైగా సబ్జెక్ట్ కూడా చిరంజీవి ఇమేజ్‌కు పూర్తి భిన్నమైనది. రిస్క్ అయినా ఫర్వాలేదు..చిరంజీవితోనే సినిమా తీయాలని మోహన్ నిర్ణయించుకున్నారు.
చిరంజీవి బావమరిది, నిర్మాత అల్లు అరవింద్‌ను సంప్రదించారు. చిరంజీవి కథ వినేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో మోహన్ ఆయనకు హిట్లర్ కథ వినిపించారు. కథను పూర్తిగా విన్న చిరంజీవి ఇది తాను చేయతగ్గ సినిమాకాదని భావించారు. ఐదుగురు చెల్లెళ్లకు అన్నయ్యగా తనను తన అభిమానులు ఒప్పుకోరని ఆయన మోహన్‌కు చెప్పారు. తనను యాక్షన్ హీరోగా, మంచి డ్యాన్సర్‌గా మాత్రమే తన అభిమానులు చూస్తారే తప్ప ఇలాంటి సెంటిమెంటల్ పాత్రలలో చూడలేరన్నది చిరంజీవి వాదన. దీంతో ఆయనను కన్విన్స్ చేయడానికి మోహన్ ప్రయత్నించారు. 1981లో మీరు నటించిన చిత్రాన్ని తమిళంలో డబ్బింగ్ చేసి విడుదల చేశానని, అప్పటికి, ఇప్పటికి 15 ఏళ్లు తాడా ఉందని, మీ అభిమానులు కూడా ఈ 15 ఏళ్లలో పెద్దవారై ఉంటారని, వారికి కూడా పెళ్లిళ్లై ఆడ పిల్లలు పుట్టి ఉంటారని, వారిలో కూడా ఇప్పుడు సెంటిమెంట్ ఏర్పడి ఉంటుందని మోహన్ చెప్పడంతో చిరంజీవి కూడా కన్విన్స్ అయ్యారు.
ఇక ఈ చిత్రంలో చింరంజీవి తండ్రి పాత్రలో నటించడానికి ఎవరన్న విషయంలో కూడా చాలా తర్జనభర్జన జరిగింది. అప్పటికే ఎడిటర్ మోహన్ నిర్మించిన మామగారు చిత్రంలో నటించిన దాసరి నారాయణరావు చేతనే మలయాళంలో తిలకన్ పోషించిన చిరంజీవి తండ్రి పాత్రను నటింపచేయాలని మోహన్ భావించడంతో చిరంజీవి కూడా సంతోషంగా ఒప్పుకున్నారట.తెలుగు వెర్షన్‌లో ఎడిటర్ మోహన్ చాలామార్పులు చేశారు. కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ చేయడమేకాకుండా పాటల చిత్రీకరణకు బాగా ఖర్చుపెట్టారు. అబీబీ పాటను కర్నాటక లొకేషన్స్‌లో చిచ్‌గా తీయడం, అది ఆ సినిమాకే హైలైట్ అయింది.
1997 జనవరి 4న విడుదలైన హిట్లర్ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలుసు. చిరంజీవికి సరికొత్త ఇమేజ్‌ను తెచ్చిపెట్టిన చిత్రంగా హిట్లర్‌ను చెప్పవచ్చు. ఈ చిత్రానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. లారెన్స్‌కు ఇది కొరియోగ్రాఫర్‌గా మొదటి చిత్రం. లారెన్స్ పేరును నిర్మాతకు పరిచయం చేసింది కూడా చింజీవే కావడం విశేషం. అదేవిధంగా రాఘవేంద్ర స్వామి భక్తుడైన లారెన్స్ పేరు ముందు రాఘవేంద్ర అని చేర్చి టైటిల్స్ కార్డులో వేసిన ఘనత ఎడిటర్ మోహన్‌కు దక్కుతుంది. అదే విధంగా స్టంట్ మాస్టర్‌గా కనల్ కన్నన్‌కు కూడా ఈ చిత్రంతోనే తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన క్రెడిట్ ఎడిటర్ మోహన్‌దే.. ఎడిటర్ మోహన్ పెద్ద కుమారుడు రాజా దర్శకత్వం వహించిన గాడ్ ఫాదర్ లో కూడా చిరంజీవి తన ఇమేజీకి పూర్తి భిన్నమైన పాత్రలో నటించడం మరో విశేషం.