Monday, December 23, 2024

అందరిలో ఒకడుగా, అందరి వాడుగా

- Advertisement -
- Advertisement -

KCR emergency meeting with minister in yerravalli farmhouse

‘రైతే రాజు’ ఒకప్పటి మాట. “రైతే నిరు పేద” నేటి గీత… ప్రపంచంలో మోసపోవటంతప్ప… మోసం చేయటం తెలియని ఒకే వ్యక్తి రైతు. ప్రజలకి తినటానికి అన్నం దొరకని రోజు వస్తే తప్ప కేంద్రానికి రైతు విలువ తెలియదా? గత పది సంవత్సరాలుగా అభివృద్ధి లక్ష్యంగా, ప్రజలే దైవంగా అహర్నిశం కృషి చేసి ఒక గ్రామాన్నే కాదు, ఒక జిల్లానే కాదు, మొత్తంగా రాష్ట్రాన్నే భారతావనిలో ముందు వరుసలో నిలిచి, అందరికీ ఆదర్శంగా నిలిచేలా చేసి స్ఫూర్తి నింపిన వ్యక్తి ముఖ్యమంత్రి. ఉద్యమ సందర్భంగా చేసిన ప్రతి వాగ్దానాన్ని సాకారం చేస్తూ, ప్రజల పురోగతి అనే బాధ్యతను భుజాలకెత్తుకుని ముందుకు సాగుతున్న మహా నాయకుడు కె.సి.ఆర్. తన రాష్ట్రంలో రైతులకు అండగా నిలబడటానికి పూనుకుని సాగునీటి అందుబాటు నుంచి రైతు బంధు పథకం వరకూ రకరకాల పనులను చేపట్టి వ్యవసాయ రంగంలో ఊపిరులూది, రైతులకే కాదు ప్రజలకు కూడా ఆహార లోటు లేకుండా రాష్ట్రాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలో రాష్ట్ర హితాన్ని కోరే ప్రతి ఒక్కరూ కలిసి అడుగులు వేయవలసిన అవసరం ఉంది.
ఈ నేపథ్యంలో వరి కొనుగోలు విషయంలో బిజెపి నేతలు వ్యవహరిస్తున్న వైఖరిని పర్యావలోకనం చేసుకోవలసిన అవసరం ఉందని అనిపిస్తుంది. వారు చేస్తున్న వ్యాఖ్యలు అత్యంత బాధాకరంగా అనిపించక మానవు. ఎంతో వెనుకబడిన రాష్ట్రాన్ని, సాగునీటి రంగాన్ని పురోభివృద్ధి మార్గంలో పెట్టిన వైనాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వారు వ్యాఖ్యలు, విమర్శలు చేయడం కేవలం రాజకీయమే తప్ప మరొకటి కాదు. వారిలోనూ వ్యవసాయదారులు ఉన్నారన్న వాస్తవాన్ని వారు విస్మరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో వరిని పండించ వద్దంటే ఆ రైతు ఏమైపోతాడు? వరి పంటలేకపోతే, కేవలం ఒక్క రైతు కుటుంబమే కాదు మొత్తం రాష్ట్రమే సమస్యల్లో పడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న విషయాన్ని వారు గుర్తించాల్సిన అవసరం ఉంది.
తెలంగాణ నీరు అందని ప్రాంతాల్లో కూడా నీరు పారుతోంది. నేడు రైతు నీటి కోసం ఆకాశం వైపు చూడకుండా చేసే పరిస్థితి నేడు రాష్ట్రంలో ఉంది. ఈ కారణంగా తెలంగాణ సస్యశ్యామలంగా మారడమే కాదు, రైతు బంధు వంటి పథకాల కారణంగా ఏ వడ్డీ వ్యాపారి బారిన పడకుండా రైతులు సుఖంగా సాగు చేసుకునే అవకాశం లభించేలా చేయడంలో రాష్ట్ర రైతుల సుఖ సంతోషాలు మినహా ముఖ్యమంత్రికి స్వార్ధం ఏముంటుంది? రైతాం గం తమ శ్రమను ధారపోసి పండించిన పంటను తాము కొనమంటూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటన్నది మన ముందుకు వచ్చే ప్రశ్న. ఎన్నడూ లేని విధంగా అందుబాటులోకి నీరు రావడంతో భూమిలానే ఆవురావురుమని ఉన్న రైతులు రెట్టించిన ఉత్సాహంతో పండించిన పంటల మాట ఏమిటి? ఇప్పుడు వారు దానితో ఏమి చేయాలి? పిడుగులాంటి ఈ నిర్ణయం విన్న రైతులు హతాశులయ్యారు, అయోమయానికి గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పరిస్థితిని సమీక్షించి, రైతులను ఆదుకునేందుకు పత్తి, మొక్కజొన్న వంటి పంటలను పండించవలసిందిగా రైతులకు నచ్చచెప్పిన వైనం శ్లాఘనీయం. దీని ద్వారా వారు అదనపు ఆదాయాన్ని ఆర్జించేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే, వరి సాగు చేస్తున్న అనేక లక్షల ఎకరాల నుంచి వరి సాగు విస్తీర్ణాన్ని 25 లక్షల ఎకరాలకు పరిమితం చేశారు. వరి మాత్రమే పండే భూములలో వరిని పండిస్తే తప్ప రైతు బతకలేని స్థితి! యాసంగి పంట ధాన్యం కేంద్రం కొనక వివక్ష ధోరణి అవలంబిస్తున్న తీరు చూస్తే… సాధింపు చర్యలాగా వుంది. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయం రాష్ట్ర ప్రజలపట్ల వ్యతిరేకత కనిపిస్తుంది.. తెలంగాణలో రైతుకి వ్యతిరేకంగా వ్యాఖ్యానించి బియ్యం మాత్రమే తీసుకుంటామని..నూకలు తినమని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడటం దేశ ప్రధానికి దేశ ప్రజల పట్ల వున్న బాధ్యత తెలియచేస్తుంది. ఒక దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వానికి రైతులను ఆదుకునే బాధ్యత లేదా? తెలంగాణ ఈ దేశంలో భాగం కాదా? అన్న అనుమానాలు తలెత్తడం సహజం. ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించడంలో కేంద్రానికి ఎటువంటి భాగస్వామ్యం లేదా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేంద్రానికి పట్టరా?
రైతులు పండించిన వరిని కొనుగోలు చేసి, నిల్వ చేసుకోవలసిన అవసరం కేంద్రానికి లేదా? అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పంటలు సరిగా పంటలు పండని సమయంలో ప్రజలను ఆదుకునేందుకు ధాన్యాన్ని నిల్వ చేసుకోవలసిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. పంజాబ్ రాష్ట్ర రైతులు ఏడాది పాటు తాను రూపొందించిన రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తే దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం, వారి నుంచి మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. కొత్తగా విభజించిన రాష్ట్రానికి కేంద్ర సహకరించకపోయినా, ఎన్నో కష్టనష్టాలకోర్చి ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రాన్ని, రాష్ట్ర రైతాంగాన్ని అన్ని రకాలుగా ఆదుకుని రాష్ట్రాన్ని పురోగతి పరంగా దేశంలోనే ముందు వరుసలో నిలబెట్టారు. రాష్ట్రంలోని ప్రతి సామాజిక వర్గానికీ అండగా నిలిచి, ప్రతి ఒక్కరినీ కలుపుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు చేయమంటూ రైతుకి కాలు అడ్డం పెట్టి, వారిని ఇబ్బందుల పాలు చేస్తూ, వారికి రక్షణ లేకుండా కేంద్రం చేయడం వెనుక ఉద్దేశమేమిటి? సరైన సమయంలో వానలు లేకుండా ప్రకృతి కల్పించే ఇబ్బందులు, సకాలంలో వర్షాలు లేక పంటకు సంక్రమించే చీడపీడలతో, అందీ అందని నీటితో డక్కా మొక్కీలు తింటూ బతుకుబండి సాగించే రైతాంగ జీవితాలను ఇంకా కాలరాయాలని కేంద్రం చూడటం ఎంతవరకూ న్యాయం?
ఎటువంటి రక్షణ, హామీ లేని జీవితం రైతుది కాకూడదనే రైతుల హక్కుని రాజ్యాంగంలో చేర్చాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తే, రాష్ట్ర నాయకులు అండగా నిలవడానికి బదులుగా వ్యాఖ్యలు, విమర్శలు చేయడం ఎంతవరకూ సమంజసం? ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలకు అతీతంగా రాష్ట్ర నాయకులు ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. కనీస మద్దతు ధర ద్వారా ధాన్య సేకరణ జరగాలని పట్టుబట్టవలసిన అవసరం ఉంది. భూమిని నమ్ముకుని ఉత్పత్తి చేసే రైతులకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒకే చట్టానికి కేంద్రం కట్టుబడి ఉండాలి. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం సాకులు చెప్పి ధాన్యం కొనుగోలును తప్పించుకోవాలని చూడటం తెలంగాణ రాష్ట్ర సమస్య మాత్రమే కాదు రేపు యావత్ దేశ ప్రజల సమస్యగా మారుతుంది. రాజ్యాంగబద్ధమైన నిర్ణయాన్ని రైతులకు తెలియచేయడం ద్వారా రైతుకి ధైర్యాన్ని ఇచ్చి, వారి సామర్ధ్యాన్ని పెంచి, వారిని పరిరక్షించాలని డిమాండ్‌తో మన ముఖ్యమంత్రి రైతు పక్షాన కోరుతున్నారు.. కేంద్రం ఈ డిమాండ్లకు సానుకూలంగా స్పందించకపోతే, జరుగబోయే పోరాటానికి కేంద్రమే బాధ్యత వహించవలసి ఉంటుంది. తమ ప్రాణాలను ఒడ్డి రాష్ట్రాన్ని సాధించుకున్న ప్రజలు, తమ డిమాండ్ పై ఉద్యమిస్తే కేంద్రం దిగిరాక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుందన్నది వాస్తవం.. ప్రజలంతా ఒకటై రైతన్న కోసం రాష్ట్ర ముఖ్య మంత్రితో కలిసి ఉద్యమించవలసిన సమయం ఇది.. ఉద్యమిద్దాం!! సాధిద్దాం!

                                                                                    అట్లూరి రమాదేవి, 8790602121

Editorial about CM KCR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News