Thursday, January 23, 2025

అభివృద్ధికి సవాలైన ద్రవ్యోల్బణం

- Advertisement -
- Advertisement -

Editorial about Corona Effect on Indian Economy

కరోనా దేశంలో ప్రవేశించటానికి ముందే మన దేశం ఆర్ధిక వ్యవస్థ ఆపసోపాలు పడుతున్న మాట వాస్తవం. దీనికి ప్రధాన కారణం జిఎస్‌టి అమలు, పెద్ద నోట్లు రద్దు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ రెండు నిర్ణయాలు సామాన్య మధ్య తరగతి ప్రజలు, చిన్న చిన్న పరిశ్రమలుపై తీవ్రమైన ప్రభావం చూపి, చాలా మంది జీవితాలను, ఆర్థిక మూలాలను అస్థిర పరిచింది. పర్యవసానంగా దేశ అభివృద్ధి, జిడిపి పతన మార్గాన పయనించే పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో గత నాలుగు దశాబ్దాలుగా చవిచూడని నిరుద్యోగం పడగవిప్పి విన్యాసాలు చేయడం ప్రారంభై నేటికీ కొనసాగుతోంది.
ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రైవేటీకరణకు, కార్పొరేట్‌లకు ఎంతో మేలు చేకూరుతూ వారి అభివృద్ధే దేశాభివృద్ధి అనే స్థాయికి తీసుకుని వెళ్ళింది. ప్రజల సొమ్మును లూటీ మార్గంలో ప్రభుత్వ బ్యాంకు లు నుంచి రుణాలు తీసుకున్న విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, ఎస్ బ్యాంక్ యాజమాన్యం, రకరకాల బడా పారిశ్రామిక సంస్థలు, వ్యక్తులు దేశ ఆర్థిక వ్యవస్థకు గండికొట్టి పరారయ్యారు. అధిక ధరలు పెరగడం వల్ల సామాన్య ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా మారి ప్రభుత్వాలకు పెనుసవాలుగా నిలిచిన తరుణంలో… మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు 2020 ప్రారంభంలో మన దేశంలో తొలి దశగా ఆరంభమైన కొవిడ్ మహమ్మారి దేశ భవిష్యత్తును నిస్సత్తువగా చేసి, లాక్‌డౌన్ / కర్ఫ్యూలు రూపంలో దేశంలో ఉన్న ఉత్పత్తి, ఉపాధి రంగాలను అధోగతి పాలు చేసింది. వలస కార్మికులు జీవితాలను దుర్భరం చేసింది. ఆ ప్రభావం నేటికీ వెంటాడుతూ ఉన్నది.
మొదటి దశలో కూనారిల్లిన భారత ఆర్థిక వ్యవస్థను, 2021 మార్చి నుంచి ప్రారంభమైన రెండవ దశ కొవిడ్ విజృంభణ సుమారు అధికార గణాంకాలు ప్రకారం ఐదు లక్షల మంది (అనధికారికంగా మరో పది లక్షల మంది) మరణాలుతో అల్లకల్లోలం సృష్టించింది. అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. ఉత్పత్తి రంగం పడకేసి, ఉద్యోగ ఉపాధి అవకాశాలను కూకటివేళ్లతో పెకలించింది. నేటికీ కొవిడ్ పూర్వపు పరిస్థితి నెలకొనలేదు. ముఖ్యంగా 84% శాతం కుటుంబాల తలసరి ఆదాయాలు క్షీణించి, మూడు పూటలా తిండిలేని పరిస్థితిలోకి అనేక లక్షల మంది నెట్టవేయబడ్డారు. యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలులేక ఖాళీగా ఉంటూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ఆసియా దేశాలైన వియత్నాం, తైవాన్ వంటి దేశాల కంటే మరింత తక్కువగా మన మహిళలు శ్రామిక శక్తి తగ్గి, అనగా మహిళా నిరుద్యోగం పెరుగుతుంది.
అనేక కుటుంబాలలో గృహ హింస రోజురోజుకూ పెరుగుతోంది. బాల్య వివాహాలు ఎక్కువయ్యాయి. సంపాదన లేక ముఖ్యంగా మహిళలు, బాలికల్లో పౌష్టికాహారం లేక, రక్తహీనత ఇతర అనారోగ్యాలకు గురవుతున్నారు. నేటికీ అందరికీ కొవిడ్ టీకా లు రెండు డోసులు (వ్యాక్సినేషన్) పడలేదు. కొవిడ్ భయాలు ప్రస్తుతం ‘ఒమిక్రాన్’ రూపం లో వెంటాడుతూ, ప్రతి రోజూ దేశ వ్యాప్తంగా లక్షలాది మంది, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో కొవిడ్ వైరస్ బారినపడుతూ మూడో దశ (థర్డ్ వేవ్) ముంగిట నిలిచి ఉన్నారు. భవిష్యత్తులో ఎంతటి ప్రమాదం ముంచుకొస్తుందో, ప్రస్తుతం అంచనా వేయలేని పరిస్థితి. భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యం, దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం….
మరో వైపు ధరలు పెరగడం. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిత్యావసర వస్తువులు కూరగాయల ధరలు సామాన్య ప్రజలకు పగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఒక్క కూరగాయలు ధరలే 34.59% పెరిగి సామాన్యులు జేబులకు చిల్లులు పడేలా చేసింది. నేటికీ ధరలు అందుబాటులో, అదుపులోకి రాలేదు. ఆ దిశగా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయడంలేదు. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం లేదు. కనీసం వలస కార్మికులు సంఖ్య, కరోనాతో మృతి చెందిన వారి వివరాలు కూడా మన ప్రభుత్వాలు వద్ద ఉండటం లేదు. ఎంత నిర్లక్ష్యం… పాలనలో పారదర్శకత ఎక్కడ…? ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు, రకరకాల నిర్బంధాలు, దాడు లు… ఇది నేటి మన ప్రజాస్వామ్య పాలకుల తీరు… నిజాలు, వాస్తవాలు ప్రజల ముంగిట ఉంచకపోవడం శోచనీయం.. అంతేకాదు ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు.
గత 6 నెలలుగా దేశ వ్యాప్తంగా అన్ని రంగాల్లో ఉత్పత్తులు ప్రారంభం అయ్యాయి. అమ్మకాలు – కొనుగోలు, ఎగుమతులు -దిగుమతులు జరుగుతూ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడుతూ, ప్రతి నెలా రూ. లక్ష కోట్ల పైబడి జిఎస్‌టి రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. (కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తరాదిలో చేసిన రైతుల ఉద్యమం చరిత్రాత్మక విజయం సాధించింది. మెజారిటీ అని విర్రవీగుతున్న కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేటట్లు చేసింది). ఇటువంటి పరిస్థితుల్లో కూడా వ్యవసాయ రంగంలో అభివృద్ధి, దిగుబడులు గణనీయంగా పెరిగాయి. దేశానికి కలిమి, బలిమి రైతులు, వ్యవసాయమే అనే వాస్తవాన్ని తెలిపింది. దేశ ఆర్ధికాభివృద్ధికి వెన్నుముక రైతులే, వ్యవసాయమే…. ఇదే సమయంలో ‘ఉత్పత్తి రంగాన్ని పక్కనపెడుతూ ‘వర్క్ ఫ్రమ్ హోం’ ద్వారా ‘సేవా రంగం’ దేశ ఆర్ధికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది.
అటు వ్యవసాయం ఇటు సేవారంగం దేశ ఆర్ధికాభివృద్ధి, భవిష్యత్తుకు బాటలు వేస్తూ దిశానిర్దేశం చేయుట ఆనందాయకం. అందుచేతనే ధరలు పెరిగినా, కొనుగోలు శక్తి పడిపోలేదు. బిలియనీర్ల సంఖ్య 142 వరకూ పెరుగుతూ వచ్చింది. వీరికి ప్రభుత్వ విధానాలు, రాయితీలు ప్రోత్సాహకాలు కలిసి వచ్చాయి కూడా…. అయితే ఇక్కడే పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా పేదలు మరింత పేదరికంలోకి జారుకున్నారు. నేటికీ 19 కోట్ల మందికి మూడు పూటలా తిండి లేదు. పౌష్టికాహారం లోపంతో మహిళలు, బాలలు అనారోగ్యాలకు గురవుతున్నారు. ధనికులకు, పెట్టుబడీదారులకు ఇచ్చే రాయితీలు కనీసం మూడోవంతు కూడా పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం కేటాయించడం లేదు.
ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటీకరణ, మానిటైజేషన్ వంటి చర్యలు చేపడుతూ, బలహీన వర్గాల ప్రజల రక్షణగా ఉన్న రిజర్వేషన్ గాలిలో దీపంలా చేస్తూ, వారి జీవితాలను దుర్భరం చేస్తూ పేదవారిని మరింత పేదరికం పాలు చేస్తున్నారు. ఉచితాలు పేరుతో ఓట్లు సీట్ల సంపాదిస్తూ, అధికారం చేజిక్కించుకుంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే యువతకు ఉద్యోగావకాశాలు కల్పించుట లేదు. అందరూ అసంఘటిత రంగంలోనే ఉపాధి వెతుక్కుంటూ జీవితాలు వెళ్ల్లదీస్తున్నారు. నేటికీ భారతదేశంలో 90% శాతం జనాభా అసంఘటిత రంగంలో పని చేస్తున్నారు. తాము చేసే ఉద్యోగాలకు, జీవితాలకు భరోసా లేకుండా జీవనయానం కొనసాగిస్తున్నారు. ఒక ప్రక్క చాలీచాలని జీతంతో, ద్రవ్యోల్బణంతో అధిక ధరలు పెరగడం వల్ల సామాన్య ప్రజలజీవితాలు అస్తవ్యస్తంగా మారి, దేశ ఆర్ధికాభివృద్ధికి ద్రవ్యోల్బణం పెను సవాలుగా పరిణమించింది.
ప్రస్తుతం రాబోయే రెండు నెలల్లో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున పెట్రోల్, డీజిల్ ధరలు పెంచకుండా తాత్కాలిక ఉపశమనం పాలకులు కలిగిస్తున్నారు. ఓట్లు తమ ఖాతాలో జమ చేసుకోవడానికి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. భవిష్యత్తులో మంచి పాలన అందించే వారినే ఎన్నుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరగడం ప్రారంభించాయి. ఇక ఏప్రిల్ నుంచి మన దేశంలో కూడా విపరీతంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, మనపై మోయలేని భారం పడుతుంది అని అనుటలో ఏమాత్రం సందేహం లేదు.
ఒక దేశం అభివృద్ధి ఆదేశ ప్రజల విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు పై ఆధారపడి ఉంటుంది అని నేటి ప్రభుత్వాలు గ్రహించాలి. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వాలే నిర్వహించాలి. ప్రజా సంక్షేమమే పరమావధి అని భావించాలి. పరిశ్రమలు స్థాపించాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఎగుమతులు ప్రోత్సహించాలి. విదేశీ మారక ద్రవ్యం ఆర్జించాలి. ‘మేధో వలస’ అరికట్టేందుకు చర్యలు చేపట్టాలి. నూతన ఆవిష్కరణలు చేసేట్లు మన దేశంలో విశ్వవిద్యాలయంలో మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తేవాలి. మూఢ నమ్మకాలు ఆచారాలు సంప్రదాయాలు తెరదించాలి.
శాస్త్రీయ దృక్పథాన్ని పెంచి పోషించాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించడానికి పునాదులు వేయాలి. మతాతీత, కులాతీత సమసమాజ స్థాపనకు, రాజ్యాంగ స్ఫూర్తితో ప్రభుత్వాలు పాలన చేయాలి. కునారిల్లుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థకు, నూతన జవసత్వాలు అందించాలి. స్వంతంత్ర సంస్థలను పారదర్శకంగా పని చేసేటట్లు చూడాలి. చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. ధరలు నియంత్రణ చేయాలి. పనికి తగ్గట్టు వేతనాలు ఇవ్వాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించుట ద్వారా, సామాజిక న్యాయం అందుబాటులోకి తేవడం ద్వారా, అందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించుట ద్వారా మాత్రమే మనదేశంలో అందరూ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ, మన దేశాభివృద్ధిలో వెన్నుముక వలే ఉంటారు అని ప్రభుత్వాలు గ్రహించాలి.

Editorial about Corona Effect on Indian Economy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News