ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన రెండు దేశాలు ఇరుగు పొరుగున వుండడం విశ్వశాంతికి, పురోభివృద్ధికి దోహదం కావాలి. ఆ రెండు మహా జనశక్తుల ప్రభావంవల్ల మొత్తం ప్రపంచం ఎంతో బాగుపడడానికి అవకాశముంది. అందుకు విరుద్ధంగా భారత్, చైనాలు నిరంతరం ఒక దాని పట్ల ఒకటి అనుమానంతో, ఈర్షతో కాలం గడపడం మానవాళికి మంచి చేయదు. ఈ ధోరణి ఇటీవల ప్రబలిపోయింది. ఈ విషయంలో చైనా వైఖరి రానురాను అత్యంత ఖండనీయంగా మారుతున్నది. ఇండియాను ఏదో ఒక విధంగా రెచ్చగొట్టి, మనస్తాపానికి గురి చేసి ఆనందించే వికృత, పైశాచిక వినోద తత్వం దానిలో పెరిగిపోతున్నది. ఒకవైపు వాస్తవాధీన రేఖ వద్ద చొరబాట్లకు ప్రయత్నించడం, మరోవైపు 2020నాటి ఘర్షణల అనంతర సమస్యల పరిష్కారానికి జరుగుతున్న సైనికాధికారుల స్థాయి సంభాషణలకు తూట్లు పొడవడం, అవి ఒక కొలిక్కి రాకుండా చేయడం ధ్యేయంగా చైనా పావులు కదుపుతున్న తీరు అత్యంత జుగుప్సాకరంగా వుంది. అదెంతగా తుళ్లిపడుతున్నా మనం మాత్రం ఎంతో సంయమనంతో వ్యవహరిస్తూ పొరుగు సాటి అతి పెద్ద దేశాన్ని గౌరవిస్తూ పోతున్నాము. అయినా చైనా తన రెచ్చగొట్టే ధోరణిని విడనాడకోలేదు. శుక్రవారం నాటి బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ఆటల ప్రారంభోత్సవ ‘టార్చ్ బేరర్స్’లో గాల్వాన్ లోయ ఘర్షణలలో గాయపడి బతికి బయటపడ్డ ఒక సైనిక కమాండర్‌ను చేర్చడం ద్వారా చైనా మన పట్ల తన ద్వేషభావాన్ని మరోసారి చాటుకున్నది. వాస్తవానికి ఈ ఆటలను బహిష్కరిస్తున్నట్టు అమెరికా నాయకత్వంలోని 12కు పైగా దేశాలు ప్రకటించాయి. అయినా వీటికి ఇండియా మద్దతు తెలిపింది. మన మంచితనాన్ని, మైత్రీ తత్వాన్ని అపహాస్యం చేసే రీతిలో గాల్వాన్ ఘర్షణల యోధుడిని టార్చ్ బేరర్‌గా ఎంపిక చేయడం బాధాకరం. ఒలింపిక్స్ ఆటలు ప్రారంభానికి ముందు 1200 మంది ‘దీపధారులు’ పాల్గొంటారు. గాల్వాన్ ఘర్షణల్లో విజేతనని ప్రపంచానికి చాటింపు వేసేలా ఒయి ఫబావో అనే పిఎల్‌ఎ (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) కమాండర్‌ను అందులో ఒకరుగా చేర్చడం తీవ్రమైన విషయం. ఇందుకు నిరసనగా ఈ ఆటలను బహిష్కరించడానికి ఇండియా నిర్ణయించుకున్నది. అక్కడి భారతీయ దౌత్యవేత్తలెవరూ ఇందులో పాల్గొనరాదని నిర్ణయం తీసుకున్నారు. దీనితో భారత్, చైనాల మధ్య ఇప్పటికే క్షీణించిపోయిన సంబంధాలు మరింత దిగజారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2020లో లడఖ్ వద్ద గల గాల్వాన్ లోయ సమీపంలో చైనా సేనలు అక్కడి వాస్తవాధీన రేఖను దాటి మన భూభాగంలోకి చొచ్చుకు రావడం వారిని మన సేనలు ధీరోదాత్తంగా ఎదుర్కొని నిలువరించడం తెలిసిందే. ఆ సందర్భం రెండు దేశాల మధ్య సంబంధాలను వున్నట్టుండి పతనం చేసింది. 1962 యుద్ధం తర్వాత దశాబ్దాల పాటు ప్రశాంతంగా వున్న భారత్, చైనా సరిహద్దులు ఉద్రిక్తంగా మారాయి. ఆ పరిణామం వల్ల తలెత్తిన సమస్యల పరిష్కారానికి సాగుతున్న చర్చలను కూడా ఒక కొలిక్కి రానీయకుండా చైనా తొండి మనస్తత్వాన్ని ప్రదర్శిస్తున్నది. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెట్టి అవి తన భూభాగాలని ఇటీవల చైనా ప్రకటించింది. ఇవన్నీ గిల్లి, కజ్జాలు పెట్టుకొనే అపరిణత మనస్తత్వాన్నే చాటుతున్నాయి. సాటి అతి పెద్ద దేశం పట్ల ప్రదర్శించాల్సిన మర్యాదపూర్వకమైన ప్రవర్తన చైనా ధోరణిలో బొత్తిగా కనిపించడం లేదు. తాను తలపెట్టిన ‘బెల్ట్ అండ్ రోడ్’ అనే ప్రపంచ మౌలిక సదుపాయాల అభివృద్ధి వ్యూహంలో మనం చేరకపోడం కూడా చైనా కన్నెర్ర అయింది. పాకిస్తాన్‌తో కలిసి మనకు చీకాకు కలిగించే చర్యలకు బీజింగ్ వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలో మనం ఒక వైపు సంయమనాన్ని కోల్పోకుండా వుండడం, అదే సమయంలో మన సైనిక బలాన్ని చైనాకు దీటుగా పటిష్ఠపరుచుకోడం అవసరం. ఇరుగు పొరుగు దేశాలు సఖ్యతతో మెలిగితే వాటి మధ్య వాణిజ్యం విశేషంగా పెరిగి రెండు దేశాలు అపరిమితమైన ప్రయోజనం పొందుతాయి. అందుకు విరుద్ధంగా శత్రుభావంతో మెలిగి పరస్పరం అనుమానించుకుంటూ, ఒకరికి మించిన బలాన్ని మరొకరు సమకూర్చుకునే కృషిలో తలమునకలు కావడం రెండు దేశాలకూ మంచి చేయదు. ఇండియా బలపడడం, బాగుపడడం, పట్టించుకోకుండా వుండడానికి వీలు లేని ప్రపంచ శక్తిగా స్థిరపడడం చైనాకు బొత్తిగా ఇష్టం లేదు. సాంకేతికంగా, సైనికంగా తనకు సాటిగా ఎదగడం దానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. ముఖ్యంగా ప్రధాని మోడీ ప్రభుత్వం అమెరికాతో సన్నిహితంగా మెలగడం చైనాకు ప్రధానమైన కోప కారణమైనట్టు బోధపడుతున్నది. దీని వల్ల ముందు ముందు ఏమి జరుగుతుంది అనేది కీలకమైన ప్రశ్న. చైనా ఎంతగా విర్రవీగుతూ మన పట్ల విషం చిమ్మినప్పటికీ ఓర్పుతో, నేర్పుతో మెసులుకొని దానికి దీటైన ప్రపంచ శక్తిగా దేశాన్ని తీర్చిదిద్దుకోడమే మన పాలకులపై వున్న ప్రధాన బాధ్యత.
Editorial about India-China dispute