Monday, December 23, 2024

అభ్యాస వాతావరణమే కీలకం

- Advertisement -
- Advertisement -

Editorial about Learning environment

‘Given a rech environment, learning becomes like the air it’s in and round us’ Sandra Adamas Dodd, ‘Life is a self-renewing process through action upon the environment’ అంటాడు జాన్ డ్యూయీ. అందుకనే విద్యలో అభ్యాసాల ప్రధాన్యత మీద చర్చ జరిగినట్టే అభ్యాస వాతావరణం గురించి కూడా నిరంతరం చర్చ జరగాల్సి వుంది. ఎందుకంటారా? అభ్యాసం కంటే ముందు అభ్యాస వాతావరణమే విద్యార్థిపై తీవ్ర ప్రభావం కనబరుస్తుందని విద్యావేత్తలంతా చెబుతున్నారు. ‘నేర్చుకునే పరిసరాలు, నేర్పించే పరిసరాలు, నేర్పే పరిసరాలు’ అంటూ అభ్యాస వాతావరణానికి మూడు అర్థాలున్నాయి. ఇంగ్లీషులో సింపుల్ గా ‘లెర్నింగ్ ఎన్విరాన్‌మెంట్’ అంటారు. ఇక్కడ మనం పరిసరం లేదా పరిసరాలు అనగానే స్థలం లేదా స్థలాలు అనే అవగాహనకు వస్తాం. కానీ, ‘Learning environment refers to the diverse physical locations, contexts, and cultures in which students learn’ అనే the GLOSSARY OF EDUCATION REFORM ఆన్‌లైన్ వనరు ఇస్తున్న నిర్వచనాన్ని గమనిస్తే ‘విద్యార్థి నేర్చుకునే స్థలాలతో పాటు, నేర్చుకునే వివిధ సందర్భాలు, సంస్కృతులు’ కూడా అభ్యాస వాతావరణంలో భాగమవుతున్నాయని అర్థం చేసుకోవాల్సి వుంది. అందుకే నేర్పే స్థలం, నేర్పే సమయం, నేర్పే పద్ధతి మూడూ అభ్యాసనంలో అత్యంత విలువైనవి. ఇవి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఇటు అభ్యాసకుడితో పాటు అధ్యాపకుడి మీదా ముద్ర వేస్తాయి.
పాజిటివ్ లెర్నింగ్ ఎన్విరాన్‌మెంట్, నెగెటివ్ లెర్నింగ్ ఎన్విరాన్‌మెంట్ అనేవి రెండు రకాల అభ్యాస వాతావరణాలు. సాధారణంగా అభ్యాస వాతావరణంలో సామాజిక, శారీరక, మానసిక లేదా సాంస్కృతిక కారకాలు అభ్యాసకుల అభ్యాస సామర్థ్యాలను లోతుగా ప్రభావితం చేస్తాయి. అభ్యాస వాతావరణం కొత్త జ్ఞానం లేదా నైపుణ్యాలు పొందేందుకు అనుకూలంగా లేకున్నట్లైతే విద్యార్థులు నిమగ్నతనూ లేదా ఆసక్తిని శిక్షణలో కనబరచలేరు. అభ్యాసనానుకూలంగా లేని (నెగెటివ్ లెర్నింగ్ ఎన్విరాన్‌మెంట్ ) వాతావరణంలో విద్యార్థి గడిపిన గంటలూ రోజులూ వారాలూ నెలలూ సంవత్సరాలూ’ అభ్యసన శూన్య కాలం’ కిందే లెక్క. ప్రభావ పూరిత లేదా సానుకూల అభ్యాస వాతావరణ (ఎఫెక్టివ్/ పాజిటివ్ లెర్నింగ్ ఎన్విరాన్‌మెంట్) కల్పన మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత పాఠశాలకు సంబంధించి మొదట యాజమాన్యాలది, ఆ తర్వాత టీచర్లది.
అభ్యాస వాతావరణ కల్పన విషయంలో ఉపాధ్యాయులు పోషించాల్సిన క్రియాశీలక పాత్ర ను గురించి ప్రముఖ అభ్యసన నిపుణులు ఆంథోని విలియం బేట్స్ తన ‘టీచింగ్ ఇన్ డిజిటల్ ఏజ్’ గ్రంథంలో ఇట్లా ‘I have deliberately suggested a learning environmet from the perspective of a teacher, as the teacher has the main responsibility for creating an appropriate learning environment, but it is also important to consider learning environments from the learners’ perspectives. Indeed, adult or mature learners are capable of creating their own, personal, relatively autonomous learning environments. అంటారు.
పాఠశాల వెలుపల సానుకూల వాతావరణాన్ని ఏర్పరచాల్సిన కర్తవ్యం తల్లిదండ్రులది. పిల్లలు కేవలం యూజర్స్ మాత్రమే. అయితే ఉన్నత విద్యకు వచ్చే సరికి సానుకూల అభ్యాస వాతావరణం ఏర్పరచుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపైన కూడా ఉంటుంది. ముఖ్యంగా భౌతిక వసతులు, పరికరాల కంటే అభ్యాస వాతావరణంలో అధ్యాపకుడూ అభ్యాసకుడూ ఇద్దరికీ ఉండి తీరవలసిన ఈ లక్షణాలు ‘నేర్చుకోవడం, బోధించడానికి సంబంధించిన లక్ష్యాలు; అభ్యాసానికి మద్దతు ఇచ్చే కార్యకలాపాలు; అభ్యాసాన్ని నడిపించే, కొలిచే మూల్యాంకన వ్యూహాలు; నేర్చుకునే వాతావరణాన్ని నేరుగా సారవంతం చేసే సంస్కృతి’ కూడా అత్యంత కీలకమైనవిగా కనిపిస్తున్నాయి. పిల్లలు ఏయే చోట్ల, ఏయే సందర్భాల్లో, సంస్కృతి (విధానం) లో నేర్చుకుంటారనే విషయంలో యాజమాన్యాలకు, టీచర్లకు, తల్లిదండ్రులకు అవగాహన తప్పక ఉండి తీరాలి.
ఇల్లు, విద్యాలయం, సమాజం ఈ మూడు చోట్లూ నిత్య అభ్యాస స్థలాలే. తాను పెరుగుతున్న క్రమంలో ప్రతి సంఘటన, సన్నివేశం అభ్యాస సందర్భమే. స్థానీయ పద్ధతులు మొదలు ఇరుగు పొరుగు (conservative, progressive) విధానాలు అభ్యాసంలో తొంగి చూచేది సంస్కృతి రూపంలోనే. స్థలం, సందర్భం, సంస్కృతుల్లో ఇంటికి సంబంధించి బాధ్యత తల్లిదండ్రులది. పాఠశాలకు సంబంధించి అధ్యాపకులూ యాజమాన్యాలది. సమాజానికి సంబంధించి కమ్యూనిటీ సమన్వయకులదీ పెద్దలదీనూ. విద్యా విధాన ప్రక్రియలో అభ్యాస వాతావరణం ముఖ్యంగా విద్యార్థి కేంద్రకం (learn centered), జ్ఞాన కేంద్రకం (knowledge centered), మదిం పు కేంద్రకం (assessment centered), సమాజ కేంద్రకం (community centered) అని నాలుగు రకాలు. ఇవి పూర్వ ప్రాథమిక, ప్రాథమిక, సెకండరీ, పూర్వస్నాతక, స్నాతక, స్నాతకోత్తర, పరిశోధనా దశల్లో స్థాయిని బట్టి ఒక్కోటి ఒక్కో ప్రాథమ్యాలను కలిగుంటాయి. అది ఏ కేంద్రకాన్ని ప్రాతినిధ్యం వహించినా నిమగ్నమైన అభ్యాస వాతావరణం విద్యార్థుల సావధానాన్ని, దృష్టిని పెంచుతుందని, అర్థవంతమైన అభ్యాస అనుభవాలను ప్రోత్సహిస్తుందని, ఉత్కృష్ట స్థాయిలో విద్యార్థుల అభ్యాసన వైఖరులను ప్రోత్సహిస్తుందని, ప్రామాణిక విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలను అభ్యసించడానికి విద్యార్థులను ప్రేరేపిస్తుందని విద్యా పరిశోధనలు తెలుపుతున్నాయి.
అత్యంత ప్రభావపూరిత అభ్యాస వాతావరణం (Highly Effective Learning Environ ment) ఎట్లా ఉంటుంది? ఏయే విషయాలకు దీనిలో ప్రాముఖ్యత ఉంటుందనే ప్రశ్న మనందరిలో తలెత్తేదే. ఇందుకు జవాబు మనకు ‘టీచ్ థాట్’ వ్యవస్థాపకులు టెర్రీ హెయిక్ రచనల్లో దొరుకుతుంది. ఈయన ప్రభావవంత అభ్యాస వాతావరణానికి ఈ క్రింది పది లక్షణాలను ప్రతిపాదించారు. అవి 1. విద్యార్థులు వీలైన్ని ఎక్కువ గుణాత్మక ప్రశ్నలు సంధించేది ( The students ask the questions -good questions ) గా, 2. సమాధానాల కంటే ప్రశ్నలు విలువైనవిగా కనిపించేది ( Questions are valued over answers) గా, 3. ఆలోచనలు విభిన్న మూలాల నుండి అవకాశం కల్పించేది ( Ideas come from a divergent sources)గా, 4. వివిధ రకాల అభ్యాస నమూనాలు ఉపయోగించుకునేది (A variety of learning models are used) గా, 5.క్లాస్‌రూమ్ లెర్నింగ్‌లో ఏర్పడిన ఖాళీని కమ్యూనిటీతో భర్తీ చేసేది (Classroom learning ‘empties’ into a connected community) గా, 6. వివిధ ప్రమాణాల ద్వారా నేర్చుకోవడంలో వ్యక్తిగత ఆసక్తికి అవకాశం కల్పించేది (Learning is personalized by a variety of criteria) గా, 7.మూల్యాంకనం నిరంతరంగా, ప్రామాణికంగా, పారదర్శకంగా ఉంచేది, దండనకు ఎంతమాత్రం ఆస్కారం లేనిది (Assessment is persistent, authentic, transparent, and never punitive)గా, 8.కృతకృత్యతకు ప్రమాణాలు సమతుల్యంగా, పారదర్శకంగా ఉండేలా చూసేది (Criteria for success is balanced and transparent) గా, 9. అభ్యాస అలవాట్లను నిరంతరం నమూనాగా ఉంచుకునేది (Learning habits are constantly modeled) గా, 10. సాధన కోసం నిరంతరంగా అవకాశాలను ప్రోది చేసేది (There are constant oppor tunities for practice) గా అభ్యాస వాతావరణం ఉండాలన్నది ‘టీచ్ థాట్’ మనోగతం.
అది స్థలమైనా, సందర్భమైనా, సంస్కృతి అయినా మూడింట్లో ప్రస్ఫుటంగా పై పది లక్షణాలు ప్రతిబింబించిన అభ్యాస వాతావరణంలోనే విద్యార్థికి సంపూర్ణ విద్య అందగలదని టెర్రీ హెయిక్ భావన. సంపూర్ణ విద్య అందకుండా విద్యార్థి అభ్యాసనం సమగ్రం అనిపించుకోదు. అభ్యాసనం, అభ్యాసం విద్యా లక్ష్యాల సాధనకు సంబంధించిందినవైతే, అభ్యాస వాతారవణం విద్యా లక్ష్య లక్షణాల ఉభయ సాధనకు పాదులు వేసేది. పండితుల సూచనలను గమనంలో ఉంచుకొని, విద్యార్థి ఎదుగుదలకూ అభివృద్ధికీ అతికీలకమైన అభ్యాస వాతావరణ కల్పనకు మన వంతుగా మనం వేటిని నెరవేర్చగలమో వాటిని నిజాయితీగా, బాధ్యతాయుతంగా చేసిచూపుదాం. ‘విద్యా ధనయశోధర్మాన్ యతమాన ఉపార్జయేత్ (సర్వ యత్నముల ద్వారా విద్యను ధనమును కీర్తిని ధర్మాన్ని ఆర్జించుము) అని కదా ఆర్యోక్తి. ధన కీర్తి ధర్మాల సాధనకు మూలమైంది ఇవాళ విద్యే కదా.
యునెస్కో విద్య-పరిసరాలకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన ‘ఫ్యాక్ట్ షీట్’ లో పేర్కొన్నట్టు ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులందరూ బడుల మూసివేత మూలం గా చదువులకు దూరమైన నేపథ్యంలో ప్రత్యామ్నాయ బోధనా పద్ధతులను ఎంచుకుంటూనే, ఉత్తమ అభ్యాస వాతావరణ రూపశిల్పులుగా, వనరులుగా విద్యావరణంలో భావి పౌరులకు గురువులు సదా తోడుండాల్సుంది. గాలి, వెలుతురే కాదు, సకల అధునాతన సౌకర్యాల ప్రాంగణంతో పాటు భావనల సొబగుకూ ఆచరణల సఫలతకూ ఆలవాలమైన అభ్యాస వాతావరణంలో పిల్లల్ని ఉంచగలిగితే వాళ్ల భావోద్దీపనలకూ నవ కల్పనలకూ కళ్లెం వేయడం ఎవరితరమూ కాదు. ఇవాళ్టి నుండి బడులూ కాలేజీలు తెరస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, పిల్లలకు రిచ్ లెర్నింగ్ ఎన్విరానెమెంట్ ఇద్దాం పదండి.

డా. బెల్లియాదయ్య, 9848392690

Editorial about Learning environment

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News