Sunday, January 19, 2025

పెగాసస్ కేసు తేలేదెప్పుడు?

- Advertisement -
- Advertisement -

Editorial About Pegasus Issue

మొండివాడు రాజు కంటే బలమైనవాడు అంటారు. రాజే మొండివాడైతే ఇక చేసేది ఏముంటుంది? దేశాన్ని పరిపాలిస్తున్న బిజెపి పాలకులు రాజ్యాంగానికి గాని, ప్రజాస్వామిక సత్సంప్రదాయాలకు గాని అణుమాత్రం విలువకూడా ఇవ్వరని ఎప్పుడో తేలిపోయింది. సమాజంలోనే కాదు రాజకీయాల్లో కూడా బహుళత్వాన్ని బతకనివ్వరు. తమపై వచ్చే ఎటువంటి బలమైన ఆరోపణలలోని నిజానిజాలనైనా నిగ్గు తేలనివ్వరు. ఈ విషయాలు తరచూ రుజువు అవుతూనే వున్నాయి. రాజకీయ ప్రత్యర్థులను అప్రతిష్ఠపాలు జేసి అడ్డుతొలగించుకోడానికి ఇడిని, సిబిఐని, ఇన్‌కంటాక్స్ దాడులను విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడంలో ఆరితేరిపోయిన దేశాధినాధులు తమ మీద ఈగ వాలనివ్వకుండా చేసుకోడానికి పాషాణ మౌనాన్ని కూడా ఆశ్రయిస్తారని పెగాసస్ దొంగ చెవుల కుంభకోణం కేసు చాటుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఇజ్రాయెలీ సెల్ ఫోన్ స్పైవేర్‌ను ప్రధాని మోడీ ప్రభుత్వం రాహుల్ గాంధీ తదితర రాజకీయ ప్రత్యర్థులు, జర్నలిస్టులు మున్నగువారిపై ప్రయోగించినట్టు ఆరోపణ వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై దాఖలైన 12 పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జాతీయ భద్రత అవసరాల రీత్యా దీనికి సంబంధించి వివరాలు చెప్పలేనని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఇటువంటి విషయాల్లో వాస్తవాలు రాబట్టడానికి జాతీయ భద్రత అనేది కోర్టులకు అడ్డంకి కాబోదని సుప్రీంకోర్టు చెప్పడమూ జరిగిపోయింది. విచక్షణలేని గూఢచర్యాన్ని, నిఘాను అనుమతించబోమని కూడా అది స్పష్టం చేసింది. ఆధునిక సాంకేతికతను వినియోగించి ప్రైవేటు సంస్థలే ప్రజల సమాచారాన్ని దొంగలిస్తున్నాయి. ప్రభుత్వం ఇటువంటి దొంగ నిఘాకి పాల్పడడం అత్యంత ఆందోళనకరం. ఇజ్రాయెలీ సంస్థ ఎన్‌ఎస్‌ఒ తయారు చేసిన పెగాసస్ గూఢశ్రవణ పరికరాన్ని ఎవరి స్మార్ట్ ఫోన్‌లోనైనా జీరో క్లిక్ పద్ధతి ద్వారా వారికి తెలియకుండానే అమర్చవచ్చు. దీనిని టెర్రరిస్టుల సమాచారం తెలుసుకోడానికి ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతామని ఎన్‌ఎస్‌ఒ తెలియజేసింది. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో, ఐఫోన్‌లలో చోర చొరబాటుకు అనువైన ఈ పరికరాన్ని ప్రపంచ వ్యాప్తంగా 50,000 ఫోన్‌లలో ప్రయోగించినట్టు ఒక అంతర్జాతీయ పరిశోధనలో బయటపడింది.ప్రధాని మోడీ ప్రభుత్వం ఇజ్రాయెల్ నుంచి దీనిని కొనుగోలు చేసి వినియోగించినట్టు ఈ నివేదిక ఎత్తి చూపింది. పౌర స్వేచ్ఛలకు, గోప్యతకు, వాక్ స్వేచ్ఛకు తీవ్ర హాని చేసే ఈ పరికరాన్ని ప్రజాస్వామిక ప్రభుత్వాలు వినియోగించడమంటే నియంతృత్వాన్ని అమలు పరచడమే. ఇంత అతి తీవ్ర ఆరోపణపై మోడీ ప్రభుత్వం పెదవి విప్పకపోడం, దాని చేత నిజాలను కక్కించడం సుప్రీంకోర్టుకు సైతం ఇంతవరకు సాధ్యం కాకపోడం బాధాకరం. సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యుల సాంకేతిక కమిటీ కూడా ఏమీ తేల్చలేకపోడం గమనించవలసిన విషయం. మాజీ సిజెఐ ఎన్‌వి రమణ సారధ్యంలోని ఆరు విభిన్న సుప్రీం ధర్మాసనాలు తొమ్మిదిసార్లు ఈ కేసు విచారణ జరిపాయి. సీలు వేసిన కవర్‌లో కమిటీ అందజేసిన నివేదికను ధర్మాసనం తెరిచి చూసి మళ్ళీ మూసేసి భద్ర పరచినట్టు తెలుస్తున్నది. జస్టిస్ రమణ దిగిపోయారు గాని పెగాసస్ కేసు తేలలేదు. కొద్ది రోజుల్లోనే మళ్ళీ విచారణ జరుగుతుందంటున్నారు. కొత్త సిజెఐ జస్టిస్ యు యు లలిత్ భుజస్కంధాల మీద ఈ బాధ్యత పడింది. ఆయన పదవీకాలం పరిమితమే కాబట్టి ఆయన హయాంలో తేలుతుందో లేదో చెప్పలేము. సాంకేతిక కమిటీ నివేదిక మూడు భాగాల్లో ఉందని, మొత్తం 29 ఫోన్‌లను అది తనిఖీ చేసిందని, ఐదింటిలో మాత్రమే దొంగ చెవులుగా పరిగణించగల మాల్ వేర్ కనిపించినట్టు అందులో ఉందని, అయితే అది పెగాసస్ కాదని నివేదిక స్పష్టం చేసిందని జస్టిస్ రమణ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు కమిటీకి సహకరించలేదని, సుప్రీంకోర్టు ఎదుట వ్యవహరించినట్టే దానికి సైతం సహాయ నిరాకరణ చిత్తగించిందని తెలియజేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యతను ప్రధాని మోడీ ప్రభుత్వం బొత్తిగా పట్టించుకోడం లేదు. సుప్రీంకోర్టు ఈ విషయంలో చివరికి ఏమి చేయగలుగుతుందనేది అనుమానాస్పదమే. అంతేకాదు ప్రధాని మోడీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా తీసుకు వచ్చినట్టు విమర్శలకు గురై జనజీవనంలో అశాంతికి దారి తీసిన కశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు, పౌరసత్వ సవరణ వంటి కీలక అంశాలపై దాఖలైన పిటిషన్‌లను విచారణ చేపట్టకుండా సుప్రీంకోర్టు పక్కన పడేయడంలోని ఔచిత్యం ప్రశ్నించదగినది. ప్రభుత్వ చర్యలు న్యాయ అభిశంసనకు గురి అయ్యే అవకాశాలున్న కేసులకు ఎప్పటికీ మోక్షం కలగకపోడం ఏ మంచికోసమో, ఎవరి మేలు కోసమో వివరించి చెప్పనక్కరలేదు.

Editorial About Pegasus Issue

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News