కాళ్లకు చుట్టుకొన్న పాము వదిలిపెట్టనట్టు ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని పెగాసస్ స్పైవేర్ ఉదంతం విడిచిపెట్టడం లేదు. అందులోని మానవ హక్కుల హరణం, వ్యక్తిగత గోప్యత హక్కు ఖననం దేశ ప్రజాస్వామ్యాన్ని కళంకితం చేస్తూ పోడం ఆగదు. దేశంలోని పార్లమెంటరీ వ్యవస్థ, న్యాయ వ్యవస్థల పరువు ప్రతిష్ఠలను బలి తీసుకోడానికి తెరపడదు. పెగాసస్‌తో తనకు ఏ మాత్రం సంబంధం లేదని ఇంత వరకు బుకాయిస్తూ వచ్చిన ప్రభుత్వం ముఖం మీద గుద్దినట్టు న్యూయార్క్ టైమ్స్ కథనం తాజాగా వెలువడింది. 2017లో కుదిరిన రక్షణ ఒప్పందంలో భాగంగా భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ నుంచి పెగాసస్‌ను కొనుగోలు చేసినట్టు గత శుక్రవారం నాడు న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనం తెలియజేసింది. గత ఏడాది ఈ విషయం బయటికి పొక్కినప్పుడు ప్రభుత్వం బండరాతి మౌనాన్ని పాటించింది. పార్లమెంటులోను, సుప్రీంకోర్టులో కూడా అబద్ధం చెప్పింది. దానితో పార్లమెంట్ గత శీతాకాల సమావేశాలు స్తంభించిపోయాయి. పెగాసస్ స్పైవేర్ గూఢచర్యంలో అనితర సామర్థం గల సాధనం, దాని సాయంతో ఎవరి స్మార్ట్ దూరి సంభాషణలను, మెసేజ్‌లను, అందులోని ఇతర సమాచారాన్ని గ్రహించవచ్చు. నేరస్థులు, టెర్రరిస్టుల ఉనికిని తెలుసుకోడానికి ఉపయోగించే షరతు మీద, మంచి మానవ హక్కుల రికార్డు గల దేశాల సైన్యాలకు, పోలీసు వ్యవస్థలకు మాత్రమే ఈ పరికరాన్ని అమ్ముతామని పెగాసస్ మాతృసంస్థ (ఎన్‌ఎస్‌ఒ గ్రూపు) అంటున్నది. అందుకు విరుద్ధంగా మన ప్రభుత్వం పెగాసస్‌ను ప్రయోగించి రాహుల్ గాంధీ, అభిషేక్ బెనర్జీ, గౌతమ్ నవ్‌లఖ, ప్రవీణ్ తొగాడియా తదితర అనేక మంది ప్రముఖుల స్మార్ట్ ఫోన్‌లలోకి ప్రవేశించిందని, రాహుల్ గాంధీకి చెందిన రెండు ఫోన్‌లను లక్షంగా చేసుకొన్నదని సిద్ధార్థ వరదరాజన్, సుశాంత్ సింగ్, ఎంకె వేణు వంటి ప్రముఖ భారతీయ జర్నలిస్టుల ఫోన్‌లనూ వదల్లేదని, దేశంలో అసమ్మతిని అణచివేసేందుకు ఈ అతి రహస్య గూఢచార సాధనాన్ని ఉపయోగించిందని ఫ్రాన్స్‌కు చెందిన ఫర్బిడెన్ స్టోరీస్ అనే సంస్థ మొట్టమొదటిసారి వెల్లడించినప్పుడు సంచలనం రేగింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల అధినేతలు సహా 50,000 మంది ఫోన్లలోకి ఈ సాధనం దూరిందని ఈ సంస్థ వెల్లడించింది. దేశంలోని అనేక మంది ప్రముఖుల ఫోన్ సంభాషణలను, సందేశాలను ప్రభుత్వం పెగాసస్ సాధనం ద్వారా తెలుసుకోడమనేది అత్యంత దారుణమైన అంశం. తాము లక్ష్యంగా చేసుకొన్న వ్యక్తి స్మార్ట్ ఫోన్‌కి మిస్డ్ కాల్ చేయడం ద్వారా పెగాసస్ అందులో దూరి ఫోటోలు సహా దానిలోని సకల సమాచారాన్ని రాబట్టుకొంటుంది. అంటే ఆ వ్యక్తి వ్యక్తిగత గోప్యత వలయంలోకి దూరి ఆ హక్కును హరించివేస్తుంది. రాజ్యాంగం 12వ అధికరణం వ్యక్తుల గోప్యతకు అమిత విలువను ఇస్తున్నది. మౌలిక మానవ హక్కుగా దాన్ని గుర్తించింది. ఎవరి వ్యక్తిగత విషయాల్లోనైనా అక్రమ జోక్యం చేసుకోడం ఆ వ్యక్తుల గౌరవ ప్రతిష్ఠలకు భంగకరమని 1948 మానవ హక్కుల చట్ట ప్రకటన స్పష్టం చేసింది. అతి పెద్ద ప్రజాస్వామిక దేశంలో ప్రభుత్వమే పౌరుల గోప్యతా హక్కుల, మానవ హక్కుల హరణానికి, ఉల్లంఘనకు పాల్పడినట్టు ఆరోపణ రావడం, దానిపై ప్రధాని మోడీ పల్లెత్తు మాట్లాడకపోడం, దర్యాప్తుకి కూడా అంగీకరించకపోడం దారుణం. ప్రభుత్వ మౌనాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దీనిపై మోడీ మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై విచారణ సందర్భంగా ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలు వేసింది. జాతీయ భద్రతకు భంగం వాటిల్లుతుందని, టెర్రరిస్టులకు సందు ఏర్పడుతుందని చెప్పి ఒక్క దానికీ ప్రభుత్వం సమాధానం లేదు. దానితో పెగాసస్ ఉదంతంపై సుప్రీం ఒక ప్రత్యేక కమిటీని వేసింది. తన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పకపోడమంటే పిటిషనర్ల కేసుకు ప్రాథమిక సాక్ష్యాలున్నట్టుగా భావించవలసి ఉంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2017లో ప్రధాని మోడీ మొదటిసారిగా ఇజ్రాయెల్ సందర్శించినప్పుడు దానితో రెండు బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పం దం కుదిరిందని, క్షిపణి వ్యవస్థతో బాటుగా పెగాసస్ పరికరం కొనుగోలు కూడా అందులో జరిగిందని న్యూయార్క్ టైమ్స్ కథనం చెబుతున్నది. దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రధాని మోడీపై ఉంది. చెప్పనని మంకు పట్టుదల పడితే కీలకమైన అయిదు రాష్ట్రాల ఎన్నికలలో అధికార పార్టీకి హాని కలిగే అవకాశాలున్నాయి. తాము ఎంతగా కప్పి పెట్టాలనుకొన్నా నిప్పు లాంటి నిజం తరచూ ఏదో విధంగా గుప్పుమంటూనే వుంటుంది. అతిపెద్ద ప్రజాస్వామిక దేశం పరువు ఇలాగే మంట గలుస్తూ వుంటుంది.
Editorial about Pegasus Issue in India