Friday, December 20, 2024

బిజెపి దుష్ట రాజకీయం

- Advertisement -
- Advertisement -

Indian Independence Day Diamond Celebrations

రాష్ట్రం పెంచి పోషించుకొంటున్న సఖ్యత, సామరస్యాల పూదోటపై విద్వేష విష మేఘాలు కమ్ముకొంటున్నాయి. ఎనిమిదేళ్లుగా పెరిగి పరిమళిస్తున్న సహజీవన వనాన్ని కబళించడానికి చీలు నాలుకల సర్పాలు ఢిల్లీ నుంచి కట్టగట్టుకు వస్తున్నాయి. ఇక్కడ గల తమ ఏజెంట్లను మంత్రించి రెచ్చగొట్టి ప్రజల మీదకు వదిలి పెడుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించి వెళ్లగానే హైదరాబాద్‌లో మత చిచ్చుఅంటుకొన్నది. సమాజ హితం బొత్తిగా గిట్టని శక్తులు ప్రజలను విడగొట్టి పడగొట్టడానికి పన్నాగాలు పన్నుతున్నారు. మంగళవారం నాటి పరిణామాలు తెలంగాణను మత కల్లోలాగ్నుల కాష్ఠంగా మార్చి అందులో రాజకీయ ప్రయోజనాల బొగ్గులు ఏరుకోవాలన్న బిజెపి కుటిల వ్యూహా న్ని సందేహాతీతంగా చాటి చెప్పాయి. నూపుర్ శర్మను తలపిస్తూ బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతను సృష్టించాయి. శాంతి భద్రతల రక్షణకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దింపవలసి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు సకాలంలో స్పందించి అప్రమత్తం కావడం వల్లనే అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. రాజాసింగ్ ఇలా హద్దు మీరి వ్యవహరించడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఆయన దళితులపై అభ్యంతరకరమైన, అమానవీయమైన వ్యాఖ్యలు చేశాడు. గుజరాత్ ఉన్నావ్‌లో వారిపై జరిగిన కుల దురహంకార దాడిని సమర్థించాడు. వారికి అలా జరగాల్సిందేనని అన్నాడు. ఇప్పుడు మునావర్ ఫారూఖీ షో ను నెపంగా తీసుకొని రాజాసింగ్ రూపొందించి యూ ట్యూబ్‌లో పెట్టిన 10 నిమిషాల 27 సెకన్ల విద్వేష వీడియో రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది. నూపుర్ శర్మ మాదిరిగానే రాజాసింగ్ ఈ వీడియోలో మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. వీడియో చూసిన తర్వాత వందలాది మంది ముస్లిం సోదరులు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు. రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో రాజాసింగ్‌పై కేసులు దాఖలయ్యాయి. హుటాహుటిన పోలీస్‌లు అతడిని అరెస్టు చేయడంతో పరిస్థితులు అదుపు తప్పలేదు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో సింగ్ విడుదలయ్యాడు. ఎన్నడూ లేనంత అభద్రతాభావం అలముకొన్నది. హైదరాబాద్‌లో గత ఎనిమిదేళ్లుగా ఒకటి, అరా సంఘటనలు మినహా ఎప్పుడూ మత ఘర్షణలు జరగలేదని మజ్లీస్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్య గమనించదగినది. తెలంగాణలో అధికారాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని బిజెపి సంకల్పించింది. ఇందుకోసం ఒక వైపు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రత్యర్థులను నైతికంగా దెబ్బతీసే నికృష్ట చర్యకు పాల్పడుతున్నది. ఇంకో వైపు మత కలహాలను భారీ ఎత్తున రెచ్చగొట్టడానికి పథకాన్ని సిద్ధం చేసుకొన్నది. అందుకు రిహార్సల్‌గానే రాజాసింగ్ వీడియో ఉదంతం చోటు చేసుకున్నది. బిజెపి జాతీయ నాయకత్వం రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం దాని కపట నాటకాన్నే రుజువు చేస్తున్నది. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, సాధ్వి నిరంజన్ జ్యోతిల విషయంలో ఏమి జరిగిందో రాజాసింగ్‌కూ అదే జరుగుతుంది. వారిపై ఈగ కూడా వాలదు. వారి వాచాలత్వమూ ఆగదు. నిరంజన్ జ్యోతి కేంద్ర మంత్రిగా ఉండి రాముడి కుమారులా, అక్రమ సంతానమా, ఎవరిని ఎన్నుకొంటారని ఢిల్లీ ఓటర్లను ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో క్షమాపణ చెప్పారు. అక్కడితో ఆ కథ ముగిసింది. నూపుర్ శర్మ విషయంలో ఏం జరిగింది? ఆమె చేసిన వ్యాఖ్యలకు జైలు ఊచలు లెక్కబెడుతూ వుండవలసింది. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ గాడ్సేను కీర్తిస్తూ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి బద్ధ విరోధి అయిన బిజెపి పచ్చగడ్డిలో పసిరికలా, పక్షిగూటిలో పాము మాదిరిగా దేశ సెక్యులర్ నీతిని కబళిస్తున్నది. సమాజ వైవిధ్యాన్ని, భిన్నత్వాన్ని బలి తీసుకొంటున్నది. ఆర్ధికంగా దేశాన్ని కార్పొరేట్ కరి మింగిన వెలగపండు చేస్తున్నది. పశ్చిమ బెంగాల్‌లో అధికారాన్ని చేజిక్కించుకోడానికి బిజెపి ఎన్ని కుతంత్రాలకు పాల్పడిందో చివరికి అక్కడి ప్రజల చేతుల్లో ఎలా భంగపడిందో తెలిసిందే. తెలంగాణలో ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకొని సోదరులుగా బతుకుతున్న హిందూ ముస్లింల మధ్య చిచ్చురగల్చడానికి, మెజారిటీ మత ఉన్మాదాన్ని రాజేయడానికి బిజెపి చేస్తున్న కుట్రను ఇక్కడి ప్రజానీకం తప్పనిసరిగా భగ్నం చేస్తారు. మతోన్మత్త సర్పానికి సరైన గుణ పాఠం నేర్పుతారు. విచ్ఛిన్న తంత్రాలతో ప్రజల మనసులు గెలవడం సాధ్యం కాదని చాటుతారు. ఎన్నికల్లో ముస్లింల ఓటు చీలకుండా బిజెపిని ఓడించగల సామర్థమున్న శక్తులకు పడేలా చూడాలి. అప్పుడే బిజెపి ముక్త్ భారతం అవతరిస్తుంది.

Editorial Against BJP Govt

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News