Wednesday, January 22, 2025

ప్రైవేటీకరణ తాత్విక మూలాలు

- Advertisement -
- Advertisement -

Editorial on Centre Govt privatisation Process

పబ్లిక్, ప్రైవేట్ సంస్థలు రెండింటిలో ప్రజాధనమే. పబ్లిక్‌లో ప్రభుత్వ యాజమాన్యం, ప్రైవేట్లలో కార్పొరేట్ల యాజమాన్యం ఉంటాయి. సంపద, యాజమాన్యం, వాణిజ్యాలను ప్రభుత్వం నుండి ప్రైవేటు సంస్థలకు బదిలీ చేయడం, ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేటు వాటాను, విదేశీ ప్రత్యక్ష పెట్టుబళ్లను, మూలధనాన్ని అనుమతించటం, ప్రజల ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అమ్మటం ప్రైవేటీకరణ. ప్రజలను వదిలేసి, కార్పొరేట్ల కొమ్ముకాసే నేటి పాలనలో అంతా ప్రైవేటీకరణే. 1933-37ల మధ్య జర్మనీలో హిట్లర్ నాజీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను అమ్మింది. నేటి పాలకులు నేర్చుకున్న ఇటలీ ఫాసిజంలో, జర్మనీ నాజీయిజంలో జాతీయీకరణ ఉండదు. ప్రైవేటీకరణలే. 1980లలో బ్రిటిష్ ప్రధాని మార్గరెట్ థాచర్, అమెరికా అధ్యక్షుడు రొనాల్ రీగన్ భారీగా ప్రైవేటీకరించారు. వస్తూత్పత్తి, ప్రజా పంపిణి, సేవల కల్పన, ప్రజా వాణిజ్యం ప్రభుత్వ బాధ్యత కాదన్న నినాదం థాచరిజంగా మార్మోగింది. దీన్నే మోడీయిజం స్వీకరించింది. జ్ఞాన సమ్మేళనం, హీరాకుడ్ యజ్ఞం పేర్లతో అప్పుల అమ్మకం, బ్యాడ్ బ్యాంకుల స్థాపన వంటి వినాశకాలను స్థాపించింది. ప్రైవేటీకరణకు, సంప్రదాయ పద్ధతులేకాకపెద్ద నోట్ల ప్రవేశం, వస్తుసేవల పన్నుల కేంద్రీకరణ, జాతీయ ద్రవ్యీకరణ సొరంగమార్గం వంటి మోసపూరిత పద్ధతులను అమలు చేసింది. ప్రభుత్వరంగ ఉత్పత్తులు, సేవలనే కాక ప్రజల సంపదను, ఆస్తులను, సేవలనూ అమ్మేస్తోంది. ఫాసిజం, నాజీయిజం, థాచరిజం బిజెపి తాత్వికతలు.
1917 సోవియట్ విప్లవ ప్రేరణతో అనేక దేశాలు స్వతంత్రం పొందాయి. పలు దేశాల్లోసామ్యవాద భావాలు, చర్యలు పెరిగాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సామ్రాజ్యవాద ఆధిపత్యం బ్రిటన్ నుండి అమెరికాకు దఖలు పడింది. సామ్రాజ్యవాద రూపం మారింది. ఆర్థిక, వాణిజ్య యుద్ధాలు మొదలయ్యాయి. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ఆర్థిక నిధి, అంతర్జాతీయ వాణిజ్య సంస్థ (ఇది తర్వాత గాట్ గా మారింది) స్థాపించబడ్డాయి. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, ప్రజా సంస్థల పతనం వీటి లక్ష్యం. రెండవ ప్రపంచ యుద్ధంలో ఫాసిజానికి వ్యతిరేకంగా సామ్రాజ్యవాద దేశాలు,సామ్యవాద సోవియట్ రష్యా ఏకమయ్యాయి. పరస్పర విరుద్ధ పార్టీలు మోడీయానికి మద్దతు ఇస్తున్నాయి. నేటి భారత ఫాసిజాన్ని నిలువరించడానికి మన పెట్టుబడిదారీ ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలు కలవలేక పోతున్నాయి.
మన ప్రథమ ప్రధాని నెహ్రూ పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. రహదారులు, విద్యుత్తు, నీటి వసతి మొదలగు మౌలిక సదుపాయాలు లేవని పారిశ్రామికవేత్తలు ఆ బాధ్యతను తిరస్కరించారు. 1966 లో ఇందిరా గాంధీ ప్రైవేటీకరణ ప్రయత్నాలు చేశారు. కార్మిక సంఘాలు, వామ పక్షాలు తీవ్రంగా అడ్డుకున్నాయి. మూడేళ్ళు ప్రభుత్వీకరణకు కృషి చేశాయి. దీనికి ఆమె రాజకీయ అవసరం తోడైంది. 1969 లో బ్యాంకుల జాతీయకరణ చేశారు. రాజభరణాలు రద్దు చేశారు. బిజెపి పూర్వావతారం జనసంఘ్ కోర్టులో దావా వేసి బ్యాంకుల జాతీయీకరణను రద్దుచేయించింది. ఇందిర రాజ్యాంగ సవరణతో జాతీయీకరణను ధ్రువీకరించారు. 1980ల లో రాజీవ్ గాంధీ, 1990 లలో చంద్రశేఖర్ లు కూడా ప్రైవేటీకరణకు విఫల ప్రయత్నాలు చేశారు.
సోవియట్ ప్రతిఘటనతో అమెరికా పాశ్చాత్య దేశాల ఆర్థిక సరళీకరణ విధానాల ప్రయత్నా లు ఫలించలేదు. ప్రపంచ సోషలిస్టు శిబిరం పతనం కాగానే అమెరికా పాశ్చాత్య దేశాలు ప్రతిపాదించిన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) ప్రపంచ ఆమోదం పొందింది. భారత్ లో డబ్ల్యుటిఒ ప్రపంచీకరణను ప్రధాని నరసింహారావు, ఆర్థికమంత్రి మన్ మోహన్ సింగ్ 1991లో ఆమోదించారు. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, సబ్సిడీల ఎత్తివేతదాని లక్ష్యం. ఫలితంగా వాణిజ్య ఉత్పత్తులే గాక, సేవలూ ప్రైవేటీకరించబడ్డాయి. 5 ఏళ్ళప్రాసెస్ పేటెంట్ 20 ఏళ్ల ప్రాడక్ట్ పేటెంట్ గా మారింది. రెండు దఫాల పొడిగింపుతో కార్పొరేట్లు వస్తూత్పత్తిలో ఏకంగా 60 ఏళ్ళ హక్కు పొందారు. ఇది అతి భయంకర ప్రైవేటీకరణ పద్దతి. సంఘ్ తాత్వికత్రయం ప్రధాని వాజపేయి, ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా, అమ్మకాల మంత్రి అరుణ్ శౌరి కలిసి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను కూటికీ నీళ్ళకూ అమ్మేశారు.పరిశ్రమల స్థాపనకు అనుకూలతలు ఏర్పడ్డ నేటి నేపథ్యంలో ప్రైవేటు సంస్థలు సొంత పరిశ్రమలు, వాణిజ్య కేంద్రాలు, సేవా సంస్థలను స్థాపించాయి. ప్రభుత్వ రంగాన్నీ మింగాలని చూస్తున్నాయి. అందుకు గత ప్రభుత్వాల కంటే మోడీ ప్రభుత్వం బాగా సహకరిస్తోంది. ‘నీకిది నాకది సూత్రం (క్విడ్ ప్రొ కొ) తో అదానీ, అంబానీల రుణం తీర్చుకుంటోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబళ్లకు తలుపులు తెరిచింది. పెట్టుబళ్ళు బీమా రంగంలో అక్కరలేదని, రక్షణరంగంలో అపాయకరమని మోడీకి తెలియదా? రైల్వేలు, రవాణా, బ్యాంకులు, బీమా సంస్థలు, పరిశ్రమలు, గనులు, ప్రకృతిసంపద, ఖనిజ వనరులు, చమురు, సహజ వాయువు, రేవులు, విమానాశ్రయాలు, విద్యుత్తు వంటి సంపద్వంత రంగాలను ప్రైవేట్లకు కారుచౌకగా అమ్మడమే మోడీ ప్రభుత్వ ప్రత్యేకత. ప్రైవేటీకరణ మోడీయ రాజకీయ నిర్బంధం. రాఫెల్ బేరంలో ప్రభుత్వ హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌ను ముంచి, అనిల్ అంబానీని తేల్చడం ఇందులో భాగమే. చట్టసభల్లో వామపక్షాల క్షీణత కలిసొచ్చిన అదృష్టం. కరోన ఒక కుట్రపూరిత అవకాశం. మోడీ అదానీ కార్మికేల్ కంపెనీకి ఆస్ట్రేలియాలో బొగ్గు గనుల కాంట్రా క్ట్, బ్యాంకు అప్పు ఇప్పించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ నష్టదాయక అసెట్స్ రియలైజేషన్ ఇనిషియేటివ్ పథకాన్ని, అదానీ, ప్రధాని కార్యాలయానికి ఇచ్చారు. అదే మొత్తం దేశాన్నే కార్పొరేట్లకు అమ్మే మోడీ జాతీయ ద్రవ్యీకరణ సొరంగ మార్గం. రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్యాల పతన సూత్రం. కార్పొరేట్ నియంతృత్వం. నేడు అమలవుతున్న స్వల్ప సామాజిక న్యాయ సమాధి. ఫాసిజం స్థాపన.
మనం మన దాకా వస్తే గాని కదలం. విద్య, వైద్యాల ప్రైవేటీకరణనుపట్టించుకోలేదు. ఇతరాలను ప్రైవేటీకరించినా పరవాలేదు. మనం ప్రభుత్వీకరణలో ఉండాలి. ఈ ధోరణి మారాలి. మన శ్రమ సంస్కృతి మెరుగుపడాలి. మల్హోత్రా కమిటీ నివేదిక నేపథ్యంలో ఎల్.ఐ.సి. సిబ్బంది, నిర్బంధ పదవీ విరమణ తర్వాత బ్యాంకు సిబ్బంది, ప్రైవేట్ల పోటీలో ఆర్‌టిసి సిబ్బంది పనితీరు ఆదర్శం. యాజమాన్యాల శల్య సారథ్యాన్ని ఎదిరించాలి. బి.ఎస్. ఎన్.ఎల్.లో సంస్థకు సంబంధం లేని ఐటిఎస్ ల, ఇతర సంస్థల్లో ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్.ల ప్రభుత్వ పక్షపాత యాజమాన్యాన్ని సహిం చాం. పరిశ్రమల్లో కార్మికవర్గ భాగస్వామ్యానికి, వాటాకు పట్టుబట్టాలి. ఒక సంస్థలో అన్ని సంఘాలు కలిసి పని చేయాలి. ఒక సంస్థ ప్రైవేటీకరణ ప్రతిపాదనలు వచ్చినపుడు ఇతర సంస్థలన్నీ నిరసన ఉద్యమాల్లో పాల్గొనాలి. ప్రభుత్వరంగ సంస్థల ఉత్పత్తులను, సేవలనే వాడాలి. కార్మిక సంఘాలను బలోపేతం చేయాలి. పోరాట పటిమను, బేరశక్తిని పెంచాలి. అసంఘటిత శ్రామికుల, తాత్కాలిక, ఒప్పంద సిబ్బంది శ్రేయస్సుకు ఉద్యమించాలి. నిరుద్యోగ సైన్యం తగ్గింపుకి పని చేయాలి. నల్ల చట్టాల వ్యతిరేక రైతాంగ ఉద్యమం ఆదర్శం కావాలి. ఎన్నికలలో ప్రజా పక్షపాత పార్టీలను, వ్యక్తులను ఎన్నుకోవాలి.

                                                                          సంగిరెడ్డి హనుమంత రెడ్డి, 9490204545

Editorial on Centre Govt privatisation Process

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News