దీపావళి నెపం చెప్పి గత నవంబర్ 4న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై 5, డీజిల్ పై 10 రూపాయలు ఎక్సయిజ్ సుంకం తగ్గించడం ఆశ్చర్యం కలిగించింది. ఆ తగ్గింపుకి అసలు కారణం అప్పుడే వెలువడిన వివిధ రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలేనన్నది వాస్తవం. ఆ ఉప ఎన్నికల్లో బిజెపి ఘోర పరాజయాలను చవిచూసింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బలపడింది. గత ఏడాది అక్టోబర్ 30న 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 29 శాసనసభ, 3 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో 8 శాసనసభ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగా, బిజెపి 7 సీట్లతో సరిపుచ్చుకోవలసి వచ్చింది. తాను అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లోనైతే బిజెపి ఘోర పరాజయం పాలైంది. అక్కడ ఉప ఎన్నికలు జరిగిన మూడు శాసనసభ, ఒక లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకోడం దానికి తీవ్ర పరాభవ కారణమైంది. నెలల తరబడిగా అదే పనిగా పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా పెంచేయడం, అది అన్ని సరకులనూ ప్రియం చేసేయడం వల్ల తన పాలనపై ప్రజల్లో ఏవగింపు మొదలైందని తెలుసుకొన్న బిజెపి ఆ వెంటనే దీపావళి నెపం చెప్పి పెట్రోల్, డీజిల్ పై ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించింది. ఫిబ్రవరిలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నందున ఇప్పట్లో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచవద్దని బిజెపి పాలకులు నిర్ణయించుకొన్నట్టున్నది. అయినా వాటి ధరలు ఇంకా లీటరు రూ. వంద వద్దనే కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు లీటరు రూ. 95.41, డీజిలు రూ. 86.67కి లభిస్తున్నాయి. కేంద్రం ఎక్సయిజ్ సుంకం తగ్గించడంతో బాటు ఢిల్లీ ప్రభుత్వం తన పన్నును కూడా గణనీయంగా తగ్గించుకున్నందు వల్ల అక్కడ ఇంధన రేట్లు ఈ మాత్రం పరిమితంగా ఉన్నాయి. ముంబైలో పెట్రోల్ రూ.109.98, డీజిల్ రూ. 94.14, కోల్‌కతాలో డీజిల్ రూ. 89.79 పెట్రోల్ రూ.104.6 అమ్ముతున్నాయి. హైదరాబాద్‌లో కూడా డీజిల్ రూ. 94.62, పెట్రోల్ రూ. 108.20 కేంద్రం ఎక్సయిజ్ సుంకం తగ్గించిన తర్వాత ఇప్పటికీ 78 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా ఉన్నాయంటే ఎన్నికలు తమకు ఎదురు తిరుగుతాయని బిజెపి పాలకుల్లో గూడుకట్టుకొన్న భయమే అందుకు కారణం. ఎన్నికలు ప్రతి రోజూ ఉంటే ధరలు అదుపులో ఉంటాయి కదా అని ప్రజలు అనుకొంటే ఆశ్చర్యపోవలసిన పని లేదు. ప్రజలెన్నుకొనే ప్రభుత్వాలు వారితో నిజాయితీగా ఉండాలి. వారిని భ్రమల్లో ముంచి, ప్రసన్నం చేసుకోడానికి ఎన్నికల్లో బలవంతంగా పెట్రోల్, డీజిల్ ధరలను తొక్కిపెట్టి ఉంచడం, అవి అయిపోగానే తిరిగి వాటిని పెంచేయడం అనేది చెప్పనలవికానంత కపటనాటకం. ఇప్పుడు ప్రజలు గతంలో మాదిరిగా విషయాల పట్ల అవగాహన లేనివారు కాదు. సమాచారం అందుబాటు బాగా పెరిగింది. మహిళలు, పిల్లలు కూడా అన్నీ క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతున్నారు. తాత్కాలికంగా తగ్గించి తిరిగి పెంచివేయడంలోని మోసకారితనాన్ని వారు సులభంగా గ్రహించగలరు. నిజమే, పెట్రోల్, డీజిల్ కు మూలాధారమైన క్రూడాయిల్ కొరత మనకు తీవ్రంగా ఉంది. మన క్రూడ్ అవసరాల్లో 80 శాతం మేరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొంటున్నాము. అందుచేత అంతర్జాతీయ మార్కెట్‌లోని ధరలను చెల్లించి దానిని తెచ్చుకోవలసి వస్తున్నది. ఆ ధరలను బట్టి దేశంలో అమ్మినా పెట్రోల్, డీజిల్ ధరలు ఇంతగా ఉండేవి కావు. కేంద్రం, రాష్ట్రాలు తమ ఆదాయ వనరుగా ఈ రెండు ఇంధనాలను పరిగణిస్తున్నాయి. కేంద్రం ఎక్సయిజ్ సుంకాన్ని, రాష్ట్రాలు తమ పన్నులను వీటి మీద విధిస్తున్నాయి. అయితే గతంలో ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలను వీలైనంత తక్కువ వద్ద నిలకడగా ఉంచి అంతర్జాతీయ క్రూడ్ ధరలతో పోల్చినప్పుడు కనబడే తేడాను సబ్సిడీ రూపంలో తామే భరిస్తూ వచ్చేవి. ఆ తేడా ధరను ఇతర మార్గల్లో వచ్చే ఆదాయంతో భరించేవి. లేదా చమురు కంపెనీలకు భారీగా బకాయి పడవలసి వచ్చేది. దానికి బదులు అంతర్జాతీయ ధరను నేరుగా ప్రజల నుంచే వసూలు చేయదలచి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 2017 జూన్‌లో వీటికి ధరల నియంత్రణ విధానాన్ని రద్దు చేసి కళ్ళేలను వదిలేసింది. అయితే ప్రధాని మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలు భారీగా పడిపోయినప్పుడు కూడా దేశీయంగా ఆ మేరకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకుండా అదే పనిగా పెంచేస్తూ వచ్చింది. ఆ విధంగా ప్రజలను చీకట్లో ఉంచి వారి జేబులు కొల్లగొట్టే కళలో సిద్ధహస్తురాలైంది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ బ్యారెల్ 85 డాలర్ల వద్ద ఆకాశ విహారం చేస్తున్నది. అలాగే గత 78 రోజులుగా ప్రజలకు బదలాయించనందున పేరుకుపోయింది చాలా ఉంటుంది. అయిదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిపోయిన తర్వాత ఈ మొత్తాన్ని అంతటినీ ప్రజల నుంచి గుంజుకోడానికి మోడీ ప్రభుత్వం వెనకాడదు.
Editorial on Fuel Prices in India