ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య సోమవారం నాడు న్యూఢిల్లీలో జరిగిన 21వ భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం ఫలవంతం కావడం ఒక మంచి పరిణామం. చైనాతో, పాకిస్తాన్‌తో ముఖ్యంగా లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన పరిస్థితుల్లో చిరకాల మిత్రుడు రష్యా మనకు మరింత చేరువకావడం మన భద్రతకు, ప్రగతికి హామీ ఇస్తుంది. తన నుంచి భారీ ఎత్తున ఆయుధాలు కోనుగోలు చేస్తున్న నేపథ్యంలో రష్యా మనతో బంధాన్ని గట్టిపరచుకోడం పట్ల ఆసక్తి చూపడం సహజమే. కాని సోవియట్ల కాలంలో దానితో మన బంధానికి గల ఘనమైన చరిత్రను దృష్టిలో వుంచుకొని చూసినప్పుడు ఈ మైత్రి ఇలా వర్ధిల్లడం మన రెండు దేశాల శ్రేయస్సుకే కాకుండా ప్రపంచ శాంతికి కూడా దోహదపడుతుందని ఆశించవచ్చు. ఆంక్షల అస్త్రాన్ని మనపై ప్రయోగిస్తానంటూ అమెరికా అభ్యంతరం చెబుతున్నప్పటికీ దానిని ఖాతరు చేయకుండా రష్యా నుంచి ఎస్ 400 క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు మనం సిద్ధం కావడం ప్రధాని మోడీ ప్రభుత్వ ఆచరణాత్మక వైఖరిని ప్రతిబింబిస్తున్నది. పుతిన్ న్యూఢిల్లీ యాత్ర సందర్భంగా మొదటి సారిగా జరిగిన భారత, రష్యా రక్షణ, విదేశాంగ మంత్రుల సమావేశంలో ఎస్ 400ల విక్రయానికి మనం చొరవచూపడం పట్ల రష్యా విదేశాంగ మంత్రి సిర్గిలావ్రోవ్ హర్షం ప్రకటించారు. భూతలం నుంచి ఆకాశానికి ప్రయోగించే రష్యన్ ఎస్ 400 క్షిపణులు దారిలో వున్నాయని 10 రోజుల్లో ఇక్కడికి చేరుకుంటాయని తెలుస్తున్నది. వీటిని రష్యా నుంచి కొనుగోలు చేస్తే ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరించి వున్నది. ఈ క్షిపణులు భారత వైమానిక దళం శక్తిని పెంచే ‘బూస్టర్ డోస్’ల వంటివని భారత వైమానికదళ మాజీ చీఫ్ బిఎస్ ధనోవా గతంలో అభివర్ణించారు. ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్న భారత్ రష్యా నుంచి ఎస్ 400 క్షిపణులను సంపాదించుకోడాన్ని తప్పు పట్టవలసిందేముంది? అలాగే అమెరికా నుంచి 2020లో గరిష్ఠ స్థాయిలో ఆయుధాలు కొనుగోలు చేసిన దేశాల్లో ఇండియా అగ్ర భాగాన వుంది. దాని నుంచి మనం కొనుగోలు చేసిన ఆయుధాల విలువ 2019లో కేవలం 6.2 మిలియన్ల డాలర్లు కాగా అది 2020లో 3.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. సౌదీ అరేబియా, ఇరాక్, దక్షిణ కొరియా వంటి దేశాలు అమెరిక్ ఆయుధాల కొనుగోలును భారీగా తగ్గించి వేసిన సమయంలో ఆ లోటును పూరించడంలో ఇండియా, మొరాకో, పోలండ్ వంటి దేశాలు తోడ్పడ్డాయి.
అందుచేత తనకు ప్రయోజనకరమనిపించినప్పుడు ఏ దేశం నుంచైనా రక్షణ, తదితర కొనుగోళ్లు చేసే స్వాతంత్య్రాన్ని భారత్ కాపాడుకోగలగడాన్ని మెచ్చుకోవాలి. అయితే ఇరుగుపొరుగులతో మెరుగైన సఖ్యతను సాధించుకోలేకపోడం వల్లనే సరిహద్దుల భద్రతపైనా, ఆయుధాల కొనుగోళ్ల పైనా మనం అమితంగా ఖర్చు పెట్టవలసి వస్తున్నది. ఇది దేశ ప్రజల ముందడుగును, దేశ ప్రగతిని హరించి వేస్తున్నది. 2020 వేసవి నాటి నుంచి మనతో గల సరిహద్దుల్లో చైనా సేనల మోహరింపును భారీ స్థాయిలో పెంచివేయడం వల్ల మనకు ఎదురవుతున్న సవాలును రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యాతో మంత్రుల స్థాయి సమావేశంలో వివరంగా ప్రస్తావించినట్టు వార్తలు చెబుతున్నాయి. అందుచేత ప్రత్యక్ష యుద్ధాల్లో ఉపకరించే సాంకేతికతల కోసం రష్యాతో సన్నిహిత సహకారాన్ని భారత్ కోరుకుంటున్నట్టు ఆయన వెల్లడించినట్టు సమాచారం. రూ. 5000 కోట్ల విలువైన 6 లక్షల 10 వేల ఎకె 203 రైఫిళ్లను కూడా రష్యా నుంచి మనం కొంటున్నాము. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ వద్ద కోర్వాలో ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో వీటిని తయారు చేయదలిచారు. దీనికి సంబంధించిన ఒప్పందం పైనా, పదేళ్ల సైనిక సాంకేతిక సహకార అంగీకారం మీద సంతకాలు జరిగాయి. ఉగ్రవాదులు లేని, టెర్రరిజానికి మద్దతు ఇవ్వని,స్త్రీల హక్కులను కాలరాయని దేశంగా అఫ్ఘానిస్తాన్ రూపొందాలనడంలో భారత్, రష్యాలు ఏకీభావాన్ని ప్రకటించాయి. అదే సమయంలో అమెరికాతో కలిసి దక్షిణ చైనా సముద్రంలో చైనా ప్రాబల్యాన్ని నిరోధించడానికి ఉద్దేశించిన ఇండో పసిఫిక్ ఒప్పందం (క్వాడ్) లో భారత్ భాగస్వామ్యం కావడాన్ని, అలాగే చైనాకు వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో అణుజలాంతర్గాముల తయారీకి అమెరికా కుదుర్చుకున్న ‘ఆకస్’ విషయంలోనూ రష్యా అసంతృప్తి వెల్లడించినట్టు బోధపడుతున్నది. క్వాడ్‌లో భారత్ పాత్రను రష్యా హర్షించేలా చూడడానికి చర్చల్లో మన మంత్రులు విఫలయత్నం చేసినట్టు వార్తలు చెబుతున్నాయి. మన సరిహద్దుల్లో చైనా దురహంకార సైనిక విస్తరణ పట్ల మన ఆందోళనను రష్యా అర్థం చేసుకొని వుండవచ్చు. కాని అది కూడా చైనాతో చెట్టపట్టాలు వేసుకొని వున్న మాట వాస్తవం. కేవలం ఆయుధ విక్రయాలను పెంచుకోడం కోసం ఇతర దేశాలతో మైత్రిని పెంపొందించుకునే వైఖరిని అధిగమించి చైనాతో ఢీ సమయంలో రష్యా మనకు ఎంత వరకు తోడ్పడుతుందనేది అనుమానమే.
Editorial on PM Modi-Putin Summit meeting