Monday, December 23, 2024

భటిండా భద్రత రాహిత్యం!

- Advertisement -
- Advertisement -

Modi was adamant, unwilling to change anything in farm laws

బుధవారం నాడు పంజాబ్‌లోని భటిండా-ఫిరోజ్ పూర్ రోడ్డు ఫ్లై ఓవర్ మీద 15-20 నిమిషాల పాటు ప్రధాని నరేంద్ర మోడీ వాహన శ్రేణి నిలిచిపోయిన ఘటన దిగ్భ్రాంతి కలిగించింది. దేశాధినేత అంతసేపు నిస్సహాయ స్థితిలో నడిరోడ్డుపై నిలిచిపోవలసి రావడం ఆందోళనకరమైన పరిణామం. ఎన్నో ప్రజా సమస్యలను పరిష్కరించే క్రమంలో ప్రధాని పీఠంలోని వ్యక్తిపై అసమ్మతి, అసంతృప్తి పెంచుకొన్నవారుంటారు. వారిలో ఉగ్రవాదులు కూడా వుండే అవకాశముంది. ఆ పావు గంట వ్యవధిలో ఆయనకు వారి నుంచి ఎటువంటి ముప్పు అయినా వాటిల్లే ప్రమాదం పొంచి ఉంటుంది. నూట ముప్ఫై కోట్ల ప్రజానీకం జీవితాలను ప్రభావితం చేసే అత్యంత ప్రముఖుడి భద్రతకు ఇంత పెద్ద లోటు కలగడం బహుశా ఇదే మొదటిసారి. పాకిస్థాన్ సరిహద్దుల్లోని ఫిరోజ్ పూర్‌లో బిజెపి ఎన్నికల సభలో మాట్లాడడానికి, ఇతర అధికారిక కార్యక్రమాల్లో పాల్గోడానికి భటిండాకు విమానంలో చేరుకొన్న తర్వాత ప్రధాని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఫిరోజ్‌పూర్ వెళ్లాలని ప్రయాణ మార్గాన్ని ముందుగా నిర్ణయించారు. అయితే ఇటీవల తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ దుర్మరణం పాలైన సంఘటనను దృష్టిలో పెట్టుకొని వాతావరణం బాగులేనందున ప్రధాని హెలికాప్టర్‌లో వెళ్లాలన్న నిర్ణయాన్ని చివరి నిమిషంలో రద్దు చేశారు. భటిండా నుంచి ప్రధాని రోడ్డుపై ప్రయాణం సాగించాలని నిర్ణయించారు. ఇది తెలుసుకొన్న రైతు ఉద్యమకారులు ప్రధాని వాహనశ్రేణికి అడ్డు నిలబడి నిరసన ప్రదర్శన నిర్వహించాలనుకున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు ఉద్యమించి మూడు కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌ను సాధించుకొన్న చరిత్రాత్మక రైతు పోరాట యోధులు మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం తదితర ముఖ్యమైన ఇతర డిమాండ్లపై ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరిలో కారును దూసుకుపోనిచ్చి నలుగురు రైతు ఉద్యమకారులను బలి తీసుకొన్న ఘటనకు బాధ్యుడైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేనీ ని తొలగించాలని కూడా ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. లఖింపూర్ ఖేరి ఘటనలో మంత్రి కారును ఆయన కుమారుడు ఆశీష్ మిశ్రాయే రైతులపైకి దూకుడుగా తోలించాడని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో తేలింది. పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రంలో ప్రధాని భద్రతకు అమిత ప్రాధాన్యం ఇవ్వవలసి ఉంటుంది. డ్రోన్‌ల ద్వారా మరణాయుధాలు ప్రయోగించే పద్ధతులను ఉగ్రవాదులు అనుసరిస్తున్నారు. సరిహద్దులకు ఆవలి నుంచి వారు వీటిని సునాయాసంగా ప్రయోగించగలుగుతున్నట్టు సమాచారం. ఇటువంటి ఆందోళనకరమైన నేపథ్యం లో పాక్ సరిహద్దు సమీప భటిండా -ఫిరోజ్ పూర్ రోడ్డుపై ప్రధాని చిక్కుబడిపోవడానికి దారితీసిన పరిస్థితులపై దృష్టి సారించడం తప్పనిసరి. ఇందులో పంజాబ్ ప్రభుత్వం బాధ్యత ఎంత అనేది తేలవలసి వుంది. అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కావడంతో, అసెంబ్లీ ఎన్నికలు సమీపంలోనే జరగనుండడంతో యీ ఘటనకు రాజకీయ రంగు పులుముకొన్నది. ఈ భద్రత లోపానికి పంజాబ్ ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని కేంద్ర హోం శాఖ ప్రకటించింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని ఆరోపించింది. తమ వైపు నుంచి ఎటువంటి లోపం లేదని, ప్రధాని రాక సందర్భంలో నిరసన ప్రదర్శన చేపట్టకుండా రైతు ఆందోళనకారులను ముందురోజే ఒప్పించామని, కొత్త బృందమేదో ఆకస్మాత్తుగా నిరసనకు దిగిందని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ చన్ని ప్రకటించారు. ఆందోళనకారులను తొలగించి దారిని సుగమం చేసిన తర్వాత కూడా ప్రధాని మోడీ తన పర్యటనను రద్దు చేసుకొని వెనక్కు వెళ్లారని, ప్రధాని భద్రత కోసం తన ప్రాణాన్నైనా ఇవ్వడానికి సిద్ధమని, ఆయనకు ఏ ముప్పు కలగలేదని చన్ని అన్నారు. ప్రధాని మోడీ హాజరు కావలసి ఉన్న ఫిరోజ్‌పూర్ బిజెపి సభకు 70,000 కుర్చీలు ఏర్పాటు చేయగా 700 మందే హాజరయ్యారని, ఈ సంగతి తెలుసుకొన్న ప్రధాని కావాలనే నిరసన ప్రదర్శన సాకు చూపి వెనుదిరిగారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని భద్రతను ప్రధానంగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌జిపి) చూసుకోవాలి. ఇటువంటి ప్రయాణాల్లో వివిధ భద్రత దళాలతో బాటు రాష్ట్ర పోలీసులు కూడా ప్రధాని రక్షక బృందంలో ఉండాలి. భటిండా ఫిరోజ్ పూర్ మార్గంలో ప్రధాని ముందుకు వెళ్లలేక తన కార్యక్రమాన్నే రద్దు చేసుకొని వెనుదిరగవలసి వచ్చిన పరిస్థితిపై కూలంకషమైన దర్యాప్తు జరిపించి ఇటువంటి ఘటనలు మళ్ళీ తారస పడకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

Editorial on PM Modi Security breach

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News