Friday, December 20, 2024

మద్దతు ధర మాయ!

- Advertisement -
- Advertisement -

BJP declared assets worth Rs 4847 cr in 2019-20

దేశ రాజకీయాల్లో వాగ్దానాలకున్న ప్రాధాన్యం మరి దేనికీ లేదు. లెక్కబెడితే ఆధునిక ప్రజాస్వామిక భారతంలో వాగ్దాన కర్ణులు లేదా వాగ్దాన భంగ కర్ణులు లెక్కకు మించినంత మంది దొరకుతారు. మంచినీళ్ల ప్రాయంగా ప్రజలకు దేనినైనా వాగ్దానం చేసి తక్షణమే మరిచిపోడంలో దిట్టలకు దేశంలో కొదువ లేదు. మన ప్రజాస్వామ్య చరిత్ర అంతా ప్రజలకు పాలకులు ఇచ్చి మరిచిపోయిన వాగ్దానాల చరిత్రే. అందుకు సాక్షంగా ఎన్నెన్నో ప్రాజెక్టుల శంకుస్థాపన రాళ్లు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూనే వుంటాయి. మన జాతి పరువును గంగలో కలుపుతూనే వుంటాయి. గంగా నది ప్రవహిస్తున్న వారణాసి నియోజక వర్గానికి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ చేసి మరచిన ఒక గొప్ప వాగ్దానం గురించి ఇక్కడ ముచ్చటించుకోడం అవసరం. 130 కోట్ల భారత ప్రజల భవిష్యత్తుకు పూచీ పడుతూ ఏడేళ్లుగా దేశాన్ని అవిఘ్నంగా పాలిస్తున్న మోడీ గత నవంబర్‌లో దేశంలోని రైతాంగానికి చేసిన వాగ్దానానికి సంబంధించిన ముచ్చట ఇది. ఢిల్లీ సరిహద్దుల్లో 2020 నవంబర్ నుంచి 2021 నవంబర్ వరకు రైతులు చెప్పనలవికానంత పటుతరమైన దీక్షతో సాగించిన చరిత్రాత్మకమైన ఉద్యమం గురించి అందరికీ తెలిసిందే. ఆ ఉద్యమంలో దేశంలోని 40 సంఘాలకు చెందిన రైతులు ముందుకు తెచ్చిన ప్రధానమైన డిమాండ్ వ్యవసాయ సంస్కరణల పేరుతో కేంద్రం తీసుకు వచ్చిన మూడు కొత్త చట్టాలను ఉపసంహరించుకోవాలన్నది కాగా, తాము పండించే అన్ని పంటలను న్యాయమైన కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడానికి వీలుగా ఒక చట్టం తీసుకు రావాలన్నది మరో అతి ముఖ్యమైనది. అన్ని పంటలకు కనీస మద్దతు ధరను హామీ ఇవ్వడంతో పాటు పంటల వివిధీకరణ తదితర పలు కీలకాంశాలపై పటిష్ఠమైన చట్టాన్ని తీసుకు రావాలని రైతులు గట్టిగా డిమాండ్ చేశారు. కఠోరమైన వేసవికి, చలి కాలానికి తట్టుకొని, 700 మంది సహచర ఉద్యమకారులను కోల్పోయి రైతులు ఏడాది పాటు ఆందోళన నిర్వహించినా ప్రధాని మోడీ హృదయం కరగలేదు. ప్రస్తుతం తెర లేచిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దూసుకు రావడంతో వున్నట్టుండి ఆ మూడు చట్టాలను ఉపసంహరించుకున్నట్టు గత నవంబర్‌లో ప్రకటించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమేరకు ఉపసంహరణ చట్టం చేశారు. అయితే ఆ పనిని కడుపులో కత్తెర పెట్టుకొనే చేశారు గాని, చిత్తశుద్ధితో కాదు. ఆ సందర్భంగా ఆయన దేశ ప్రజలకు క్షమాపణ కూడా చెప్పుకున్నారు. అప్పుడు మద్దతు ధరల చట్టంపై కమిటీని వేస్తానని రైతాంగానికి వాగ్దానం చేశారు. అది జరిగి రెండు మాసాలు గడిచిపోయినప్పటికీ దాని ఊసైనా లేకపోడంతో రైతులు గత వారం విద్రోహ దినాన్ని పాటించారు. దానితో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శుక్రవారం నాడు ఆదరాబాదరాగా రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. ప్రస్తుత ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిసిపోగానే మద్దతు ధరల చట్టంపై కమిటీ వేస్తామని ఆ ప్రకటనలో తెలియజేశారు. నిజానికి ఈ వాగ్దానంపై ప్రధానికి చిత్తశుద్ధి వుండివుంటే నిన్న మొన్నటి కేంద్ర బడ్జెట్‌లోనే దాని ప్రస్తావన చేసి వుండేవారు. వరి, గోధుమ పంటల సేకరణకు కేటాయింపులను పెంచుతున్నట్టు ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇతర పంటలకు మద్దతు ధరల విషయం బొత్తిగా పట్టించుకోలేదు.

రైతులు కేవలం వరి, గోధుమనే కాకుండా ఇతర అనేక పంటలు పండిస్తూ దేశ అవసరాలను తీరుస్తున్నారు. అంతకు మించి వాణిజ్యపరమైన ఎగుమతులకు కూడా విశేషంగా తోడ్పడుతున్నారు. మిగతా పంటలకు మద్దతు ధర లేకపోడం వల్ల పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాక అనేక సందర్భాల్లో దగా పడుతున్నారు. ఈ మద్దతు ధర చరిత్ర చెప్పుకోడానికి ఎంతైనా వుంది. ఇంత కాలం అది రైతులను మోసపుచ్చుతూనే వచ్చింది. పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయించే విషయమై 2004లో నియమితమైన స్వామి నాథన్ కమిటీ కూలంకషమైన అధ్యయనం చేసి 2006లో నివేదిక సమర్పించింది. అందులో 215 సిఫార్సులు చేసింది. 2007లో ఏర్పాటైన కేంద్ర మంత్రుల కమిటీ ఈ సిఫార్సులపై చర్చించింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు రాజ్యసభకు తెలియజేసింది. 2007 నాటి మంత్రుల కమిటీ తిరస్కరించిన పధ్నాలుగింటిని విడిచిపెట్టి మిగతా 201 సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించిందని కూడా వెల్లడించింది. కాని వాటి వివరాలను చెప్పలేదు. అంటే యుపి, పంజాబ్ రాష్ట్రాలలోని రైతులను ఆశల చిక్కానికి వేలాడదీసి వారి ఓట్లను కొల్లగొట్టే కుట్రే దీని వెనుక కనిపిస్తున్నదని ఎవరికైనా అనిపిస్తే ఆక్షేపించవలసిన పని లేదు. రైతు ఇంటిల్లిపాది కలిపి చేసే శ్రమకు భూమి అద్దెను కూడా కలుపుకొని వచ్చే మొత్తానికి అందులో సగాన్ని కలిసి పంట కనీస మద్దతు ధరను నిర్ణయించాలని స్వామి నాథన్ కమిటీ సిఫార్సు చేసింది. దానిని అమల్లోకి తేవడానికి మన పాలకులు ఏళ్లూపూళ్లూ తీసుకుంటున్నారంటే అన్నదాతగా కీర్తిస్తున్న రైతు పట్ల వారికున్న ప్రేమ ఎంత కుటిలమైనదో అర్థం చేసుకోవచ్చు.

Editorial on political leaders Assurance

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News