Monday, December 23, 2024

శూన్యసంస్కృతిలో అమెరికా, భారత్!

- Advertisement -
- Advertisement -

అధికార, ధన, మత బలాలతో అధిక సంఖ్యాక అనుబంధ శ్రోతలతో ప్రతీకార శతృత్వ శూన్య సంస్కృతి పెరుగుతుంది. దీన్ని సవాలుగా స్వీకరించాలి. మానవ సమాజాల్లో వ్యక్తుల సామాజిక ప్రవర్తనలు, నిబంధనలు, జ్ఞానం, నమ్మకాలు, కళలు, చట్టాలు, అలవాట్లు, సంప్రదాయాలు, భాష, వంటలు, సామర్థ్యాలే సంస్కృతి. తమకు నచ్చని మాట అన్నారనో, పని చేశారనో, ప్రశ్నించారనో ప్రముఖ వ్యక్తులకు మద్దతు మాని, ఎగతాళి చేయడం, లక్షిత వ్యక్తులను సమాజం, వృత్తి సముదాయం నుండి భౌతికంగా లేదా సామాజిక మాధ్యమాల నుండి గెంటడం, నచ్చనివారికి వేదికలు లేకుండా చేయడం వారిని సాంస్కృతిక జీవితం నుండి వేరు చేయడం, సామాజిక మాధ్యమాల్లో నిషేధిత అంశాలు, వ్యక్తిగత సమాచారం, రహస్య ఫోటోలు, వీడియోలు పెట్టి అవమానాలు, వేధింపులు, బెదిరింపులకు గురిచేయడం, గోప్యతా హక్కు భంగంతో పరువు నష్టం కలిగించడం, ఉపన్యాసాల, కళా ప్రదర్శనల బహిష్కరణ, పేదల, స్త్రీల, పిల్లల, మైనారిటీల తిరస్కరణ శూన్య సంస్కృతి. కీర్తి ప్రతిష్ఠలు, విశ్వసనీయతను దెబ్బతీసే ఉద్దేశపూర్వక గుణాల హత్య, భారత్, అమెరికాల చైనా యాప్‌ల నిషేధం, నిరసన ఉద్యమాల్లో ఆస్తి నష్టానికి శిక్షలు శూన్య సంస్కృతిలో భాగాలే. అమెరికా శ్వేతజాతి, భారత హైందవజాతి శూన్య సంస్కృతి ఆరాధకులు.
సోవియట్ స్టాలిన్ పాలనలో విప్లవ వ్యతిరేక నేరాలకు పాల్పడిన పనివారు, పార్టీ సహచరులు, కుటుంబ సభ్యులను ప్రజలు నిందించి, వేరుచేసేవారు. విద్యార్థులు నేర సహాధ్యాయులపై ఫిర్యాదు చేసేవారు. వాక్ స్వాతంత్య్రం, పౌరస్వేచ్ఛ, ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే హక్కులను హరించే, మతాన్ని గౌరవించే చట్టాలను చేయరాదని రాజ్యాంగ తొలి సవరణలో అమెరికా నిర్ణయించింది. అయినా అమెరికాలో శూన్య సంస్కృతి విజృంభించింది. తొలుత ఒక ఘటనతో మరో దానికి సంబంధం లేని శూన్య సంస్కృతి ఉండేది. 1991లో అమెరికాలో నటీమణులను, నల్లవారిని బహిష్కరించేవారు. నల్లవారికి సాంస్కృతిక బహిష్కరణ కొత్తకాదు. దానితో మనుగడ నైపుణ్యత నేర్చుకున్నారు. శూన్యసంస్కృతి భావజాల సామాజిక విభజనను పెంచుతుంది. భావజాల వ్యత్యాసాల ఎత్తుగడ బలపడుతుంది. రాజకీయంగా ఎదుర్కొనలేనప్పుడు సాంస్కృతిక భాగస్వామ్యాన్ని తిరస్కరించాలి. కాలిఫోర్నియా యూనివర్శిటి భాషా శాస్త్ర అధ్యక్షురాలు అన్నే చారిటి హర్డ్లీ అన్నారు. చాలా మందిని సాంస్కృతికంగా బహిష్కరించారు. ఇరాక్ పై దాడిలో, వామపక్ష భావాల లండన్ వాయిద్య బృందం బుష్‌ను విమర్శించింది. యుద్ధోన్మాద మితవాదులు చంపుతామని వీరిని బెదిరించారు. బ్లాక్ లిస్టులో పెట్టించారు. వీరు తమ ప్రదర్శనల టికెట్లు అమ్మలేకపోయారు. చివరికి ఆ బృంద నాయకురాలు నటాలీ మైన్స్ బుష్‌కు క్షమాపణ చెప్పారు. అమెరికా హాస్య నటుడు, రాజకీయ విశ్లేషకుడు, టివి వ్యాఖ్యాత బిల్ మాహెర్ అవమానాలు, బెదిరింపులకు గురయ్యారు. 2019 నుండి అమెరికాలో శూన్య సంస్కృతి పెరిగింది. మతంతో బలపడింది. మతఛాందసాన్ని ఎత్తిచూపినవారి సాంస్కృతిక బహిష్కరణ పెరిగింది. ఐదేళ్ళ నుండి ఇది ప్రపంచమంతా విజృంభించింది. దీనికి మితవాద రాజకీయాలు ఆజ్యం పోస్తున్నాయి. వివాదాస్పద వ్యక్తుల అణచివేత, ప్రత్యర్థుల వేదికలు మాయం చేసే రాజకీయ క్రియాశీలత, ఇళ్ళ మీద దాడి, నిరసన ప్రదర్శనలు పెరిగాయి. అంతర్జాల, చరవాణి సంభాషణల నిఘా, నటుల చలనచిత్రాల బహిష్కరణ, రచయితల పుస్తకాల నిషేధం, ఒప్పందాల రద్దుకు, పదవుల రాజీనామాకు వత్తిళ్ళు పెంచడం వగైరా దుశ్చర్యలు స్వీయ హత్యలకు దారితీస్తున్నాయి.
అమెరికా బార్ అసోసియేషన్ మాధ్యమాలు, వ్యక్తిగత గోప్యత, పరువు నష్టాల కమిటి అధ్యక్షుడు డేవిడ్ ఫర్లొ శూన్య సంస్కృతికి పాల్పడేవారికి సమాచారం అందించే వెబ్‌సైట్లను గుర్తించారు. అవి నిజం అందించవని వివరించారు. ఇది సాంస్కృతిక బహిష్కరణ. పోటీదారుల నియంత్రణ దీని లక్ష్యం. తమ జీవితాలను అశ్రద్ధ చేయడంతో కొందరు జీవనోపాధి కోల్పోతారు అని మిచిగాన్ వర్శిటి మాధ్యమాల, లింగ వివక్ష, మహిళా సమస్యల ఆచార్యులు నకుముర అన్నారు. శూన్యసంస్కృతి అభద్రత భావంతో పుడుతుందని న్యూయార్క్ వర్శిటి సామాజిక మానసిక శాస్త్ర, నైతిక నాయకత్వ అంశాల ఆచార్యులు జొనాథన్ హైద్త్ అన్నారు. ఈయనా శూన్యసంస్కృతి బాధితుడే. ఈ పద్ధతి అమెరికా సమాజ కేంద్రీకరణకు ఉపయోగపడిందని మిచిగాన్ స్టేట్ యూనివర్శిటి మాధ్యమాల అధ్యయనాల ఆచార్యుడు కీత్ హామ్టన్ వివరించారు. మంచి పనులు చేసేవారిలో కొన్ని లోపాలు ఉండవచ్చు. అంతమాత్రాన వారిని బాధించరాదని అమెరికా పూర్వ అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్చరించారు. శూన్యసంస్కృతి నిరంకుశత్వం. భిన్నాభిప్రాయులను వృత్తి ప్రవృత్తుల నుండి వేరు చేసి లొంగదీసుకునే, శిక్షించే రాజకీయ ఆయుధం అని పూర్వ అధ్యక్షుడు ట్రంప్ 03.07.20 న విమర్శించారు. భిన్నాభిప్రాయాలపై అసహనాన్ని విమర్శిస్తూ 153 మంది ప్రఖ్యాత వ్యక్తుల ఉత్తరాన్ని హార్పర్స్ మాగజైన్ మాసపత్రిక ప్రచురించింది. అమెరికా సచేతన సంఘటనల టివి ధారావాహికలు శూన్య సంస్కృతిని వెక్కిరించాయి. శూన్య సంస్కృతి విద్యారంగంలో తీవ్ర నష్టం కలిగిస్తుంది. అమెరికా, భారత విద్యారంగాల స్వేచ్ఛ తగ్గుతోంది. ప్రజాస్వామ్య, రాజ్యాంగ వినాశక రారాజు ట్రంప్ మిత్రులైన మితవాద స్వేచ్ఛా వ్యతిరేక ప్రపంచ పాలకులు, మతతాత్విక విద్యాధిపతులు విద్యాసంస్థల్లో శాస్త్రీయతను మట్టుబెట్టి మత ఛాందసాలు ప్రవేశపెట్టారు. అమెరికా పాశ్చాత్య దేశాల 23 సమాజాల్లో మితవాద రాజకీయ శాస్త్రజ్ఞులు శూన్యసంస్కృతిని నివేదించారు. 78 అభివృద్ధిచెందుతున్న సమాజాల్లో వామపక్ష రాజకీయ శాస్త్రజ్ఞులు శూన్యసంస్కృతిని ఖండించారు. వామపక్ష భావజాలాన్ని అణచి వేసే ప్రక్రియలు పెరిగాయి. మేధో శూన్యతను కోరే శూన్య సంస్కృతి మేధో స్వేచ్ఛను హరిస్తుంది. విఫల పాలకులు శూన్య సంస్కృతిని ప్రోత్సహిస్తారు.
భారత్‌లో 2002లో మొదలైన శూన్య సంస్కృతి 2013 నుండి విజృంభించి నేడు శిఖరాగ్రం చేరింది. రాముని, హైందవ భావజాలాన్ని విమర్శిస్తూ మాట్లాడే వారికి, రచనలు చేసిన వారికి తిట్లు, హత్య బెదిరింపులు సాధారణం. అన్ని రంగాల మేధావులను, సామాజిక హితులను బంధించి, బహిష్కరించడం వలన దేశం నష్టపోతుంది. పాలక వర్గ నూతన అనైతిక తాత్విక ధోరణులు బలవంతపు అనుగుణ్యతను సాధించవచ్చు. అయితే శాశ్వత నష్టం కలిగిస్తాయి. దేశ విదేశాల మేధావులు భారత సమాజ నిర్మాతల నిర్బంధాలను నిరసిస్తూ రాష్ట్రపతికి, ప్రధానికి ఉత్తరాలు రాశారు. వీరిపై ప్రతీకార ప్రత్యుత్తరాలు రాయడం సంఘ్ సంస్కృతి ప్రత్యేకత. శూన్య సంస్కృతి వేరు. విమర్శ వేరు. పారదర్శక సమాజంలో మేధో బహుళత్వానికి అవకాశముంటుంది. తప్పులు సరిదిద్దుకొని, భావాలు పంచుకొని, పరస్పర గౌరవంతో సామాజిక ప్రగతి, దేశాభివృద్ధి సాధించవచ్చు. సున్నితంగా ఎత్తిచూపి తర్కబద్ధ చర్చలతో ఒప్పించి చెడును తగ్గించాలి. తిరస్కరణలు, బహిష్కరణలు, శిక్షలు, నిర్బంధాలు, అణచివేతలు సమస్యలను పరిష్కరించకపోగా తిరుగుబాట్లకు కారణమవుతాయి. న్యాయం, స్వేచ్ఛలలో జాత్యహంకారం, ఇస్లామోఫోబియా, మతోన్మాదాల తప్పుడు ఎంపికకు అవకాశం ఉండరాదు. సామాజిక, రాజకీయ వ్యవహారాల ప్రవర్తనల్లో జాగ్రత్త, విచక్షణ వహించాలి. హాస్యం ఎగతాళికి దారితీయరాదు. ఇతరుల ప్రవర్తనలకు అనుచితంగా స్పందించరాదు. పాలకవర్గం ప్రాపంచిక దృక్పథం పెంచుకోవాలి. విమర్శ సుపరిపాలనా సాధనం. గతకాల ఘటనలు తవ్వడం ఘోర తప్పిదం. అత్యంత హానికరం.
ఇతరులను వెలివేసే ముందు మన బాధ్యత, జవాబుదారీతనాలను స్మరించుకోవాలి. అప్పుడే సామాజికన్యాయ విలువల్లో మన స్థానం ధృడపడుతుంది.గతంలో అందరూ తప్పులు చేసినవారే.అమానవత్వ పోటీ అవమానకరం. ఇరువర్గాల ఉన్నతికి అవరోధం. మానవవాద ప్రక్రియ,శూన్యసంస్కృతి-తిరస్కృతి సంస్కృతులను సమీప భవిష్యత్తులోతిలకించగలమా?.

సంగిరెడ్డి హనుమంత రెడ్డి
9490204545

Editorial on Void culture in America and India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News