Sunday, December 22, 2024

బెంగళూరు భేటీపై దృష్టి మళ్లించేందుకే ఇడి దాడులు: స్టాలిన్

- Advertisement -
- Advertisement -

చెన్నై: ప్రతిపక్షాల రెండు రోజుల బెంగళూరు సమావేశాల నుంచి దృష్టి మళ్లించడానికే తమిళనాడు మంత్రి కె పొన్ముడిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) జరిపిన దాడుల అసలు ఉద్దేశమని, ఇడి చర్యలను తమ పార్టీ న్యాయపరంగా ఎదుర్కొంటుందని తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ వ్యాఖ్యానించారు. తన రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి దర్యాప్తు సంస్థలను బిజెపి దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు.

బెంగళూరులో జరగనున్న ప్రతిపక్షాల సమావేశానికి బయల్దేరి వెళ్లేముందు సోమవారం స్టాలిన్ విలేకరులతో కొద్దిసేపు మాట్లాడారు. రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవితో కలసి ఇడి కూడా డిఎంకె కోసం ప్రచారం చేయడానికి ఆహ్వానిస్తున్నామని, ఎన్నికల్లో తమ పార్టీకి మరింత సులువవుతుందని స్టాలిన్ వ్యాంగ్యంగా అన్నారు. ఇటువంటి దాడులు రాష్ట్రంలో తమ పార్టీ మరింత బలోపేతం కావడానికి ఉపయోగపడతాయని ఆయన అన్నారు. నెలరోజుల్లో రెండవసారి సమావేశమవుతున్న ప్రతిపక్షాలను చూసి కడుపు మంటతో ఇడిని బిజెపి తన ప్రత్యర్థులపై ఉసిగొలుతోందని ఆయన ఆరోపించారు.

ఉత్తర భారతంలో ప్రతిపక్షాలపై ఇడి వంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగించిన బిజెపి ఇప్పుడు దక్షిణ భారతంపై పడిందని, ఇటువంటి దాడులను తాము పట్టించుకోబోమని ఆయన చెప్పారు. రాష్ట్ర మంత్రి పొన్ముడి ఇడి దాడులను న్యాయపరంగా ఎదుర్కొంటారని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బిజెపికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్టాలిన్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News