రాజధాని పరిధిలోని మూడు పోలీస్ కమిషనరేట్లలో భారీగా పెరిగిన సైబర్ నేరాలు హైదరాబాద్‌లో 2,868..
సైబరాబాద్‌లో 11,914.. రాచకొండలో 4,458 కేసులు నమోదు బాధితుల్లో అత్యధికులు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే
అత్యాశే నేరస్థులకు పెట్టుబడి డబ్బులు పోయిన గంటలోనే 1930కి ఫోన్ చేస్తే పేమెంట్ గేట్లు మూసివేత
ఈ గోల్డెన్ అవర్‌పై కొరవడిన అవగాహన కొన్ని కేసుల్లో నేరస్థులకు బ్యాంకర్ల సహకారం
మన తెలంగాణ/సిటీ బ్యూరో: ఈ ఏడాది సైబర్ నేరాలు మూడు పోలీస్ కమిషనరేట్లలో భారీగా పె రిగాయి. ఉన్నత విద్యావంతులు, రిటైర్డ్ ఉద్యోగులను టార్గెట్‌గా చేసుకుని సైబర్ నేరస్థులు రెచ్చిపోతున్నారు. వారి బ్యాంక్ ఖాతాల్లోని కోట్లాది రూపాయలను దోచుకుంటున్నారు. పెట్టుబడులు, మనీలాండరింగ్, పార్ట్‌టైం ఉద్యోగాలు, హనీ ట్రాప్ పేరిట అడ్డదారుల్లో కోట్లు కాజేస్తున్నారు. సైబర్ నేరాలు పెరుగుతాయని, వాటి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు హె చ్చరిస్తున్నారు. సైబర్ క్రైం ఫ్యూచర్ క్రైం అని గత కొంత కాలం నుంచి పోలీస్ అధికారులు చెబుతున్నారు, దానిని నిజం చేస్తున్నట్లుగానే సైబర్ నేరా లు భారీగా పెరుగుతున్నాయి. సైబర్ నేరస్థులో ఎ క్కడో ఉండి టెక్నాలజీని వాడుకుని మాయమాట లు చెప్పి వందల కోట్లు దోచుకుంటున్నారు. కొంతమంది నిందితులు దుబాయ్ కేంద్రంగా, మనీలాండరింగ్ పేరుతో ముంబాయి కేంద్రంగా సైబర్ నే రాలు చేస్తున్నారు. ఇలా సైబర్ నేరస్థుల బారిన ప డుతున్న వారిలో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులు ఉంటున్నారు. టెక్నాలజీ పెరగడంతో చాలామంది వద్ద స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి.
వాటిలో బాధితులు ఏదో ఒక సమాచారాన్ని నిత్యం వెతుకుంతుంటారు, దానిని గమనిస్తున్న సైబర్ నేరస్థు లు వారిని సంప్రదించి నిండాముంచుతున్నారు. కొందరు నిం దితులు రిటైర్ ్డ అయిన ప్రభుత్వ ఉ ద్యోగులను టార్గెట్‌గా చేసుకుని భయభ్రాంతులకు గురిచేసి అందిన కాడికి దోచుకుంటున్నారు. వృద్ధు ల పిల్లలను అరెస్టు చేశామని చెప్పి వారి బ్యాంక్ ఖాతాల్లో ఉన్న డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటున్నారు, ఇందులో అందరికీ ఫోన్లు చేయడంలేదు. కేవలం బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు ఉన్నవారికి మాత్రమే సైబర్ నేరస్థులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ఈ ఏడాది హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2,868 కేసులు నమోదు కాగా బాధితులు రూ.3,01,42,73,986 కోట్లు నష్ట పో యారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11,914 కేసులు నమోదు కాగా, రూ.71,28, 56,728, రాచకొండలో 4.458 కేసులు నమోదు చేశారు. సైబర్ నేరాల్లో ఎక్కువగా పెట్టుబడులు, పార్ట్‌టైం ఉద్యోగాల పేరుతో మోసం చేసిన కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. రాచకొండ పోలీస్ క మిషనరేట్ పరిధిలో నేరాలు గత ఏడాది కంటే 42.5శాతం నేరాలు ఎక్కువగా నమో దయ్యాయి. ఇందులో పార్ట్‌టైం ఉద్యోగాల 2,125 కేసులు, ఫిషింగ్ కేసులు 996 నమోదయ్యాయి. మూడు కమిషనరేట్లలోని సైబరాబాద్‌లో ఎక్కువగా సైబర్ నేరాలు ఎక్కువగా నమోద య్యాయి. ఈ కమిషనరేట్ పరిధిలో ఐటి కంపెనీలు ఎక్కువగా ఉండడం, చాలా ప్రాంతాల్లో ఎక్కువ మంది నివాసం ఉండడంతో ఎక్కువగా నేరాలు నమోదవుతున్నాయి.
బ్యాంకర్ల సహకారం…
సైబర్ క్రైంలో వందశాతం డబ్బులు బ్యాంక్ ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ అవుతుంటాయి. ఇలా పెద్ద మొత్తంలో డబ్బులు ఒక బ్యాంక్ ఖాతా నుంచి మరో ఖాతాకు బదిలీ అవుతున్నా కూడా బ్యాంక్ అధికారులు ఇలాంటి అనుమానస్పద బ్యాంక్ ఖాతాలపై దృష్టి సారించడంలేదు. సైబర్ నేరస్థులు న్యూల్ ఖాతాలు ఓపెన్ చేసినా, కరెంట్ బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేసినా బ్యాంకర్లు పట్టించుకోవడంలేదు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరస్థులకు సహకరించిన బ్యాంక్ అధికారులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంక్ అధికారులు సైబర్ నేరస్థులను ఎలాంటి విచారణ చేయకుండానే కరెంట్ ఖాతాలు ఓపెన్ చేశారు. దీంతో సైబర్ నేరస్థులు ఈ బ్యాంక్ ఖాతాల ద్వారా వందల కోట్ల లావాదేవీలను చేశారు. వీటిని గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేసి బ్యాంక్ అధికారులను అరెస్టు చేశారు.
డిటెక్షన్ పెరిగింది…
సైబర్ నేరాలు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఎడాది కేడాది పెరుగుతున్నా, డిటెక్షన్ కూడా పెరుగుతోంది. పోలీసులు సైబర్ నేరస్థులను పట్టుకు నేందుకు ఎప్పటికప్పుడు శిక్షణ తీసుకుంటున్నారు. కొన్ని కేసుల్లో ఇప్పటి వరకు ఎవరూ పట్టుకోని వారిని తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు పట్టుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో జాబ్ ఫ్రాండ్‌లో రూ.10,13,81,582, ట్రేడింగ్‌లో 8,93,77,861, స్మిషింగ్‌లో 1,276 కేసులు నమోదు చేసిన పోలీసులు రూ.90,16,534 తిరిగి ఇప్పించారు. సైబర్ నేరస్థులు విసురుతున్న సవాల్‌ను స్వీకరిస్తున్న పోలీసులు కొత్త టెక్నాలజీని వాడి వారిని పట్టుకుంటున్నారు.
విద్యావంతులే ఎక్కువ…
సైబర్ నేరస్థుల చేతుల్లో మోసపోతున్న వారిలో ఎక్కువ మంది విద్యావంతులే ఉంటున్నారు. ఇందులో ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న వారు ఉంటున్నారు. ఇలాంటి చాలామంది సైబర్ నేరస్థులు చెతుల్లో మోసపోయిన తర్వాత సైబర్ వారియర్లుగా చేరి పలువురికి సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వచ్చేలా చేస్తామని చెప్పడంతో నమ్మి కోట్లాది రూపాయలు పెట్టి మోసపోతున్నారు. అత్యాశకు పోయి వారి వద్ద ఉన్న డబ్బులు కొంత లోన్ తీసుకుని పెట్టుబడిపెడుతున్నారు. ఇలా పెట్టిన తర్వాత సైబర్ నేరస్థులు లాభాల మాట తీయకుండా, పెట్టిన డబ్బులు ఇవ్వమంటే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన సైబర్ నేరాల్లో ఎక్కువ మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉన్నారు. కొందరు సైబర్ నేరుస్థుల చేతుల్లో మోసపోయినా పరువు ప్రతిష్టలకు పోయి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడంలేదు.
డయల్ 1930…
సైబర్ నేరాలు దేశావ్యాప్తంగా పెరుగుతుండడంతో కేంద్ర హోం శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1930ను ఏర్పాటు చేసింది. కాని దీనిపై ఎవరికి తెలియదు, దీనిపై ప్రజలకు విస్కృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. బాధితులు డబ్బులు పోయిన వెంటనే మూడు గంటలలోపు 1930కు ఫోన్ చేసి వివరాలు చెబితే వెంటనే పేమెంట్ గేట్‌వేను మూసి వేస్తారు. దీంతో బాధితుల బ్యాంక్‌ల నుంచి డబ్బులు పోకుండా కాపాడవచ్చు,కానీ చాలామందికి దీని గురించి తెలియకపోవడంతో ఫిర్యాదు చేయడంలేదు. గోల్డెన్ హవర్‌లో ఫిర్యాదు చేస్తే డబ్బులు తిరిగి ఇప్పిస్తామని పోలీసులు చెబుతున్నా చాలామంది విషయం పోలీసులకు చెప్పడంలేదు. దీనిపై సామాజిక మాద్యమాలు, ప్రకటనల రూపంలో విస్కృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది.