Saturday, February 1, 2025

విద్యా శాఖకు రూ. 1.28 లక్షల కోట్లకు పైగా కేటాయింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అదనంగా 6500 మంది విద్యార్థులను చేర్చుకోవడానికి ఐదు కొత్త ఐఐటిలో మౌలిక వసతుల విస్తరణ, పది వేల కొత్త వైద్య సీట్లు, కృత్రిమ మేధ (ఎఐ)కి ఇతోధిక ప్రోత్సాహం. 202526 బడ్జెట్‌లో విద్యా రంగం కోసం ప్రభుత్వం చేసిన భారీ ప్రకటనల్లో అవి కూడా ఉన్నాయి. కేంద్ర బడ్జెట్ 202526లో విద్యా మంత్రిత్వశాఖకు రూ. 1.28 లక్షల కోట్లకు పైగా కేటాయించడమైంది. 202425లో సవరించిన అంచనా రూ. 1.14 లక్షల కోట్ల కన్నా ఇది బాగా అధికం. ఉన్నత విద్య విభాగానికి రూ. 50067 కోట్లు మొత్తం కేటాయించగా పాఠశాల విద్య విభాగం రూ. 78572 కోట్లు అందుకున్నది. వరుసగా ఎనిమిదవ కేంద్ర బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాఠశాలలు, ఉన్నత విద్య కోసం భారతీయ భాష పుస్తకాలను డిజిటల్ రూపంలో సమకూర్చేందుకు ప్రభుత్వం ‘భారతీయ భాషా పుస్తక్’ పథకాన్ని ప్రారంభించగలదని కూడా తెలియజేశారు.

ప్రభుత్వం ఐదు ఐఐటిలలో అదనంగా మౌలిక వసతులను సృష్టిస్తుందని, పాట్నా ఐఐటిని విస్తరిస్తుందని ఆమె ప్రకటించారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాట్నా ఐఐటి విస్తరణ ప్రకటన వచ్చింది. ’23 ఐఐటిల్లో మొత్తం విద్యార్థుల సంఖ్యను గడచిన పది సంవత్సరాల్లో 65 వేల నుంచి నూరు శాతం మేర అంటే 1.35 లక్షలకు పెంచడమైంది.2014 తరువాత మొదలైన ఐదు ఐఐటిల్లో అదనంగా 6500 మంది విద్యార్థులకు విద్య నిమిత్తం అదనపు మౌలిక వసతులు సృష్టించనున్నాం. ఐఐటి పాట్నాలో హాస్టల్, ఇతర మౌలిక వసతుల సామర్థాన్ని కూడా విస్తరించనున్నాం’ అని ఆమె తెలియజేశారు. ఐఐటిలకు కేంద్ర బడ్జెట్‌లో రూ. 11349 కోట్లు కేటాయించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనా రూ. 10467 కోట్లు కన్నా ఇది అధికం. వచ్చే ఐదు సంవత్సరాల్లో 75 వేల సీట్లను చేర్చాలన్న లక్షం దిశగా వచ్చే సంవత్సరం నుంచి వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో పది వేల అదనపు సీట్లు కలపనున్నట్లు సీతారామన్ ప్రకటించారు. ‘మా ప్రభుత్వం 130 శాతం పెంపుతో పది సంవత్సరాల్లో దాదాపు 1.1 లక్షల యుజి, పిజి విద్య సీట్లను చేర్చింది. వచ్చే ఐదు సంవత్సరాల్లో 75 వేల సీట్లు చేర్చే లక్షం దిశగా వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో పది వేల అదనపు సీట్లు కలపనున్నాం’ అని ఆమె తెలిపారు. రానున్న ఐదు సంవత్సరాల్లో ఐఐటిల్లోను, ఐఐఎస్‌సిలోను టెక్నాలజీ పరిశోధన నిమిత్తం పది వేల ఫెలోషిప్‌లు కల్పించనున్నట్లు కూడా ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు.

‘ప్రపంచ నైపుణ్యం, భాగస్వామ్యాలతో నైపుణ్యం శిక్షణ కోసం ఐదు నేషనల్ ఎక్సలెన్స్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నాం, యువ మస్తిష్కాల్లో వైజ్ఞానిక భావనను పాదుకొల్పేందుకు వచ్చే ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నాం’ అని ఆమె చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు అన్నిటికీ బ్రాడ్‌బ్యాండ్ అనుసంధానాన్ని కల్పించనున్నట్లు సీతారామన్ తెలియజేశారు. ‘వ్యవసాయం, సుస్థిర నగరాలు, ఆరోగ్య రంగాల్లో కృత్రిమ మేధలో మూడు ఎక్సలెన్స్ కేంద్రాలను ప్రకటించాను. ఇప్పుడు విద్య కోసం ఎఐలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను రూ. 500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నాం’ అని ఆమె విద్యలో ఎఐకి విశేష ప్రోత్సాహం ఇస్తూ తెలిపారు.

కాగా, యుజిసి నుంచి ఎన్‌సిఇఆర్‌టి వరకు విద్యా మంత్రిత్వశాఖ పరిధిలోని చాలా వరకు సంస్థలకు కేటాయింపులు పెరిగాయి. స్వావలంబన దిశగా పురికోల్పేందుకు వరుసగా బడ్జెట్‌లలో కోతలను చూసిన టాప్ బిజినెస్ స్కూల్స్ ఐఐఎంలు కూడా రూ. 251 కోట్ల మేరకు పెంచిన కేటాయింపు అందుకున్నాయి. వాటికి నిరుడు సవరించిన అంచనా కేటాయింపు రూ. 227 కోట్లు మాత్రమే. అయితే. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ (ఐఐఎస్‌ఇఆర్)లకు బడ్జెట్ కేటాయింపు రూ. 137 కోట్ల మేరకు తగ్గింది. అదేవిధంగా ప్రపంచ శ్రేణి సంస్థలకు కేటాయించిన మొత్తాన్ని కూడా 50 శాతం పైగా తగ్గించారు. నిరుడు కేటాయించిన మొత్తం రూ. 1000 కోట్లు కాగా, దీనిని రూ. రూ. 475 కోట్లకు తగ్గించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News