Monday, December 23, 2024

చార్మినార్ వద్ద విద్యా దినోత్సవ సంబరాలు

- Advertisement -
- Advertisement -

చార్మినార్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం చారిత్రక చార్మినార్ చెంతన తెలంగాణ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాతబస్తీలోని పలు ప్రభుత్వ, ఎయిడెడ్, గుర్తింపు పొందిన పాఠశాలలకు చెందిన రెండు వేల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ర్యాలీగా తరలి వచ్చారు. తీరొక్క రంగులతో తీర్చిదిద్దిన బతుకమ్మలు, తెలంగాణ తల్లి వేషధారణ, యోగ్‌చాప్, కోలాటం, నృత్యాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. చార్మినార్ పరిసరాలు సాంస్కృతిక ప్రదర్శలు, తెలంగాణ పాటలతో మారు మ్రోగింది. చార్మినార్ జోన్ ఉప విద్యాశాఖ అధికారి నెహ్రూబాబు ముఖ్యఅతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా నెహ్రూబాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అవతరించిన దశాబ్ధకాలంలో విద్యారంగం గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ఎన్నో విప్లవాత్మకమైన చర్యలు తీసుకుందన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్య, నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం, రాగి జావ వంటి అల్పహారం, గుడ్డు, అరటి పండ్ల వంటి బలవర్ధకమైన ఆహార పదార్థాలను పంపిణీ చేసి విద్యార్థుల శారీరిక, మానసిక వికాసానికి కృషి చేస్తుందన్నారు.

రానున్న రోజుల్లో విద్యారంగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలుస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. కాగా బహదూర్‌పురా జోన్ క్యాంప్ క్లర్క్ ముక్తధర్ తెలంగాణ తీన్మార్ పాటలకు అనుగుణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి చేసిన నృత్యం అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జోన్ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పిఈటీలు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News