అన్ని విద్యాసంస్థల్లో విద్యాదినోత్సవం కార్యక్రమాలు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యాదినోత్సవం విజయోత్సవాలు ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్నది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు విద్యా సంస్థల్లో పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయం, అన్ని గురుకుల పాఠశాలలు, వైద్య, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ, ఫారెస్ట్, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్ తదితర అన్ని విద్యాసంస్థల్లో విద్యాదినోత్సవం కార్యక్రమాలు జరగనున్నాయి. గత తొమ్మిదేళ్లలో విద్యారంగంలో రాష్ట్రం సాధించిన విజయాలను తెలియజేస్తారు.
ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న మనఊరు మన బడి పాఠశాలల ప్రారంభోత్సవం నిర్వహిస్తారు. సిద్ధంగా ఉన్న పది వేల గ్రంథాలయాలను, 1600 డిజిటల్ క్లాస్ రూమ్స్‌లను ప్రారంభిస్తారు. పాఠశాలల్లో విద్యార్ధులకు వ్యాసరచన, చిత్రలేఖనం,పాటల పోటీలు,తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రభుత్వ పాఠశాలలను మామిడి తోరణాలతో, పూలతో అందంగా అలంకరించి విజయోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. విద్యారంగంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మన ఊరు మన బడి కార్యక్రమంతో పాటు, 1,001 గురుకులాల స్థాపన, నూతన విశ్వవిద్యాలయాల ఏర్పాటు (హార్టీకల్చర్, ఫారెస్ట్, మహిళ, హెల్త్ యూనివర్సిటీ) తదితర జిల్లాకు ఒకటి చొప్పున ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు, నూతనంగా నర్సింగ్ కాలేజీ, పారామెడికల్ కాలేజీలు, జూనియర్ కాలేజీలు(రెసిడెన్షియల్ తో సహా), డిగ్రీ కాలేజీల (రెసిడెన్షియల్ తో సహా) ఏర్పాటు తదితర వివరాలను వెల్లడిస్తారు.
విద్యా దినోత్సవం సందర్భంగా అన్ని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పుల ప్రాధాన్యతను తెలియజేస్తూ ర్యాలీలు నిర్వహిస్తారు. మంగళవారం పాఠశాలల్లో జాతీయ జెండాను ఎగురవేసి, తొమ్మిదేళ్ల విద్యారంగంలో పాఠశాల ప్రగతి, విద్యారంగంలో సాధించిన విజయాలు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తారు. పాఠశాలల్లో యూనిఫారాలు, ట్యాబ్‌లు, డిజిటల్ క్లాస్ రూమ్‌ల ప్రారంభోత్సవం, అనుబంధ పోషకాహారం కార్యక్రమాలు ఉంటాయి. రాష్ట్రంలోని డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో, సాంస్కృతిక కార్యక్రమాలు, బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బందికి సన్మానం కార్యక్రమాలు ఉంటాయి.