తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వ్యూహాత్మకంగా అడుగులు వేసే కాకలు తీరిన రాజకీయవేత్త మాత్రమే కాదు, ఆయనలో ఒక విద్యావేత్త దాగి వున్నాడు. ఆయన ఏ విషయంపైనైనా తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా ఉపన్యసించి, అందరినీ మెప్పించ గల గొప్ప వక్త. వేల పుస్తకాలు చదివి, మస్తిష్కంలో పదిలపరచుకున్న మహా మేధావి. వందల, వేల పద్యాలను కంఠస్థం చేసి, సందర్భానుసారంగా వాటిని ఉపన్యాసాలలో వాడుకోగల కుశాగ్రబుద్ధి. అన్నింటికీ మించి గొప్ప విద్యా ప్రేమికుడు. చిన్నప్పటి నుంచి గురువులంటే అమితమైన గౌరవం. ఆ గౌరవాన్ని ఈనాటికీ కొనసాగిస్తున్న ఆదర్శమూర్తి కెసిఆర్.
ఆయనకు తెలుగు భాష అంటే అపారమైన మక్కువ మాత్రమే కాక, తెలుగు భాషపై మంచి పట్టున్న వ్యక్తి. ఆ కారణంగానే 2017 డిసెంబర్‌లో ఐదు రోజుల పాటు హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో తెలంగాణ భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతుల వైభవాన్ని తెలియజేస్తూ ప్రపంచ తెలుగు మహా సభలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించారు. ఆయన చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారు. తెలంగాణలో ఆనాడున్న పాఠశాలల పరిస్థితి, సర్కారు బడుల్లోని సాధకబాధకాలు అన్నీ కెసిఆర్‌కు బాగా తెలుసు. పెచ్చులూడిన శిథిలమైన భవనాలు, విరిగిపోయిన బల్లలు, వర్షం పడితే నీళ్ళుకారే గదులు తెలంగాణ పల్లెల్లో ఆనాడు సర్వసాధారణం. చెట్ల కిందనే తరగతులు నిర్వహించడం ఆనాటి పాఠశాలలో పరిపాటి. అపరిశుభ్ర వాతావరణంలో పిల్లలు చదువుకునేవారు. టాయిలెట్ల గురించి ఆలోచనే వుండేది కాదు. ప్రభుత్వ పాఠశాలలో ఉండాల్సిన సదుపాయాల గురించి ఆ విధంగా ఆయనకు మంచి అవగాహన వుంది. మన దేశంలో విద్యలోనూ, వైద్యంలోనూ ఎంతో నాణ్యత పెరగాల్సిన అవసరం వుందని, ఆయన భావిస్తారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టగానే ఈ రెండు రంగాల అభివృద్ధిపై ఆయన దృష్టి సారించారు.
ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలోనే 2004 సెప్టెంబర్ 17వ తేదిన గంభీరావుపేటలో ఉపన్యసిస్తూ తెలంగాణ వచ్చాక కె.జి. టు పి.జి విద్యా సంస్థను అక్కడి నుంచే ప్రారంభిస్తామని చెప్పారు.ఆ వాగ్దానాన్ని గుర్తు పెట్టుకున్న కెసిఆర్ ఆ గంభీరావుపేటలోనే కె.జి. టు పి.జి. విద్యనందించడానికి సకల సదుపాయాలతో క్యాంపస్‌ను నిర్మించారు. తెలంగాణ బిడ్డలంతా తనలాగే చదువుకుని, విద్యావేత్తలు కావాలన్నది మన ముఖ్యమంత్రి ఆశయం. కుటుంబ ఆర్థిక పరిస్థితులతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డా ఏ కొరతా లేకుండా చదువుకోవాలన్నది ఆయన ఆకాంక్ష.
అందుకు తగిన విధంగా విద్యార్థులంతా పలకతో వచ్చి, పి.జి. పట్టాతో ఇంటికి వెళ్ళే విధంగా అధునాతన హంగులతో ఒకేచోట క్యాంపస్‌ను నిర్మించారు. దీనికి మన ఊరు మన బడి పథకంలో భాగంగా ఐటి, మున్సిపల్ శాఖా మంత్రి కెటిఆర్, విద్యాశాఖా మంత్రి సబిత ఇంద్రారెడ్డి తదితరులు గురువారం ప్రారంభోత్సవం చేశారు. ఈ క్యాంపస్‌లో అన్ని హంగులతో కె.జి. టు పి.జి. ఆధునిక విద్యను అందించడంతో పాటు, డిజిటల్ లైబ్రరీ, క్రీడా మైదానం, అన్ని వసతులతో సువిశాలమైన డైనింగ్ హాల్ వున్నాయి. ఒకేసారి వెయ్యి మంది విద్యార్థులు భోజనం చేసేలా డైనింగ్ హాల్‌ను రూపొందించారు.
ఒక్కొక్క విద్యార్థి చదువు కోసం సంవత్సరానికి రూ. 1.25 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. భారత దేశంలోని 28 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలోనూ లేని విధంగా ఈ క్యాంపస్‌లో సదుపాయాలను ఏర్పాటు చేశారు. రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 7,300 ఖర్చుతో ఈ తరహా 26 వేల పాఠశాలలను మూడు విడతలలో నిర్మించబోతున్నది. తొలి విడతలో తొమ్మిది వేల పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు. సర్కారు బడులలో కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులు చదువుకోడానికి సకల సదుపాయాలు వుండాలన్నది కెసిఆర్ ఆశయం. కేవలం ఆర్థిక స్తోమత లేదన్న కారణం చేత తెలంగాణ బిడ్డలు చదువులకు దూరం కాకూడదన్నది ఆయన కోరిక. ఇందుకుగాను అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ మౌలిక వసతుల కల్పనకు పథక రచన చేశారు. భవనాలకు రంగులు వేయడం, కిచెన్ షెడ్లు, అదనపు తరగతి గదులను, కాంపౌండ్ వాల్స్ నిర్మించడం, మంచి ఫర్నిచర్, టాయిలెట్ల వంటి మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు, డిజిటల్ తరగతి గదులు, మంచి గాలి, వెలుతురు వచ్చే విధంగా ఏర్పాటు చేయడంతో పాటు, పచ్చని పరిసరాలను, పరిశుభ్రమైన తాగునీటిని, ఉన్నత పాఠాశాలల్లో డైనింగ్ హాల్స్, ఖర్చులేని విద్యుత్తు కోసం సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం మన ఊరు మన బడి పథకంలో భాగం.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం కాని, తెలుగుదేశం ప్రభుత్వం కాని కనీసం ఆలోచనైనా చేయని ఈ పథకాన్ని కెసిఆర్ అమలు చేసి చూపిస్తున్నారు. అడుగడుగునా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి పథకం విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు. సర్కార్ బడుల్లో బోధనా ప్రమాణాలు పెరగడం మూలంగాను, కెసిఆర్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో అందజేస్తున్న నాణ్యమైన ఆహారం, మంచి నీరు, టాయిలెట్లు మొదలైన వసతుల మూలంగానూ, గత కొన్నేళ్ళుగా ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం గణనీయంగా పెరిగిన విషయాన్ని గమనించవచ్చు. అరకొర వసతులతో, నామమాత్రం ఉపాధ్యాయులతో ప్రభుత్వ పాఠశాలు నడిచే రోజులు తెలంగాణలో అతి త్వరలో కనుమరుగు కానున్నాయి. అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు దీటుగా తెలంగాణలో ఆర్థిక పరిస్థితులతో నిమిత్తం లేకుండా విద్యార్థులంతా కె.జి. నుంచి పి.జి. వరకు ఉచితంగా నాణ్యమైన విద్యను అభ్యసించే తరుణం ఆసన్నమైంది.
కోలేటి దామోదర్
(చైర్మన్, తెలంగాణ రాష్ట్ర
పోలీస్ గృహ నిర్మాణ
సంస్థ లిమిటెడ్)