Friday, December 27, 2024

సంపాదకీయం: కొవిడ్ కాటేసిన చదువులు!

- Advertisement -
- Advertisement -

Communal clashes during Ram Navami procession సకల అసౌకర్యాల బందిఖానా బాల్యం. తలిదండ్రులో, ఇతర సన్నిహితులో చేయూత ఇచ్చి, మంచిచెడ్డలు చూసుకుంటే తప్ప తమంత తాముగా తమ కాళ్ల మీద నిలబడే పరిస్థితి బొత్తిగా వుండనిది బాలలకే. వారి తర్వాత కాళ్లూ చేతులూ వుడిగిపోయి మంచాన పట్టే వృద్ధులు అటువంటి దయనీయతను ఎదుర్కొంటారు. 2020 మార్చిలో విరుచుకుపడి, ఏడాదిన్నర, రెండేళ్ల పాటు ప్రపంచాన్ని కకావికలు చేసిన కరోనా మొదటి, రెండవ దశల్లో లక్షలాది మంది అకాల మరణానికి గురయ్యారు. కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 55 లక్షలని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవ సంఖ్య ఇంతకంటే ఎక్కువే వుండే అవకాశముంది. భారతదేశంలోనే 5 లక్షల మందికి పైగా చనిపోయి వుంటారని అధికారిక సమాచారం. వాస్తవ గణాంకాల ప్రకారం వీరి సంఖ్య 15 లక్షల పైమాటేనని వార్తలు వెల్లడించాయి.

కష్టపడి సంపాదించి ఇంటిని పోషించే ప్రధాన పోషకులు కొవిడ్ మృత్యువాత పడినప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి, ముఖ్యంగా అందులోని పసిబిడ్డల భవిష్యత్తేమిటి? అనేది హృదయ విదారకమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం కోసం చాలా కృషి జరిగింది, కాని కరోనా లాక్‌డౌన్ సంక్షోభంలో తలిదండ్రులు ఉపాధులు, ఉద్యోగాలు కోల్పోగా, బడిమానేసిన బాలల సంఖ్య ఎంత వుంటుంది అనే దానిపై ఇంత వరకు ఎటువంటి శోధన జరగలేదు. సోమవారం నాడు సుప్రీంకోర్టు ఈ విషయంపై దృష్టి పెట్టింది. కరోనా కాలంలో తలిదండ్రులు ఉద్యోగాలు, ఉపాధులు కోల్పో గా తప్పనిసరి పరిస్థితుల్లో బడి మానేసి బాల కార్మికులుగా మారిపోయిన వారికి సంబంధించిన సమాచారం లేదని, వారినెవరూ పట్టించుకోలేదని న్యాయమూర్తి ఎల్ నాగేశ్వర రావు సారథ్యంలోని ధర్మాసనం దృష్టికి సుప్రీంకోర్టుకు సహాయకారిగా పని చేస్తున్న న్యాయవాది గౌరవ అగర్వాల్ తీసుకు వచ్చారు.

కొవిడ్ వల్ల సంపాదనపరులైన తల్లినో, తండ్రినో కోల్పోయి అనాథలైన బాలల విషయంలోనే శోధన జరిగిందని, చదువులు మానేసిన పిల్లలపై దృష్టి పెట్టలేదని ధర్మాసనం అంగీకరించింది. బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్ వల్ల తలిదండ్రులు చనిపోయిన పిల్లలపైనే దృష్టి పెడుతున్నాయి గాని, చదువులు కోల్పోయిన బాలల గురించి పట్టించుకోడం లేదని గౌరవ అగర్వాల్ చెప్పారు. విద్య బాలల ప్రాథమిక హక్కని, కరోనా వల్ల పలకా, బలపానికి దూరమైన పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని న్యాయమూర్తి నాగేశ్వర రావు అభిప్రాయపడ్డారు. 2020 మార్చి నుంచి 2021 అక్టోబర్ వరకు సాగిన ముమ్మరమైన కొవిడ్ కాలంలో దేశంలో 19 లక్షల మంది పిల్లలు అనాథలయ్యారని ఒక సమాచారం తెలియజేస్తున్నది. అయితే బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ నిర్వహిస్తున్న బాల స్వరాజ్ వెబ్‌సైట్ వీరి సంఖ్య 1.53 లక్షలేనని అతి తక్కువగా చూపింది.

లాన్సెట్ పత్రిక అధ్యయనం ప్రకారం 18 ఏళ్ల లోపు వయసు గల 52 లక్షల మంది బాలలు పోషించే తండ్రినో, తల్లినో కోల్పోయారు. కొవిడ్ రెండవ దశలో అత్యధిక సంఖ్యలో పిల్లలు అనాథలయ్యారని లాన్సెట్ తెలియజేసింది. తలిదండ్రులు ఉద్యోగాలు, ఉపాధులు కోల్పోయిన కారణంగా బడి మానేసి బలవంతపు పనిపాట్లలో చేరిన పిల్లల లెక్కింపు ఇంకా కొనసాగుతున్నదని తెలుస్తోంది. ఒక అంచనా ప్రకారం దేశ వ్యాప్తంగా 2 కోట్ల మంది బాలలు కొవిడ్ కాలంలో చదువులకు స్వస్తి చెప్పారు. స్మార్ట్ ఫోన్ల ద్వారా ఆన్‌లైన్ బోధన అవకాశాలను కల్పించినప్పటికీ పట్టణ నిరుపేదల పిల్లలకు, గ్రామీణ బాలలకు అది అందుబాటులో లేకపోడం వల్ల దారిద్య్రరేఖ దిగువనున్న కుటుంబాల పిల్లలకు స్మార్ట్‌ఫోనే గగనం కావడం కారణంగా ఆ సౌకర్యం వారికి ఉపయోగపడలేదు. దేశ రాజధాని ఢిల్లీలోనే 20 లక్షల మంది బాలలు కొవిడ్ వల్ల చదువుకు దూరమయ్యారని అఖిల భారత తలిదండ్రుల సంఘం అధ్యక్షులు అశోక్ అగర్వాల్ చెబుతున్నారు. పేదల పిల్లలను ఆదుకోడంలోనూ, వారికి తగిన చదువులు చెప్పించడంలోనూ స్వచ్ఛంద సంస్థలు పోషిస్తున్న పాత్ర అసాధారణమైనది.

అయితే భారతీయత పట్ల కేంద్రంలోని బిజెపి పాలకుల మక్కువ మితిమీరిపోడం వల్ల స్వచ్ఛంద సంస్థలపై అది ఉక్కు పాదం మోపింది. ఈ కారణంగా మదర్ థెరెస్సా సంస్థకు విదేశీ విరాళాలపై నిషేధం విరుచుకుపడింది. పర్యవసానంగా చాలా మంది పేద పిల్లలు ఉచిత ఆశ్రయానికి, విద్యకు దూరమయ్యారు. కొవిడ్ లాక్‌డౌన్ల కాలంలో దేశంలోని 15 లక్షల పాఠశాలలు మూతపడ్డాయి. ప్రాథమిక, సెకండరీ స్థాయి పాఠశాలల్లో నమోదైన 24 కోట్ల 70 లక్షల మంది బాలల చదువులు దీని వల్ల దెబ్బ తిన్నాయి. బాల్యాన్ని బాగు చేసుకోలేని దేశం ముందడుగు వేయడం కల్ల. సుప్రీంకోర్టు చూపించిన చొరవ వల్లనైనా కొవిడ్ సంక్షోభంలో బడులకు దూరమైన బడుగు పిల్లలు మళ్లీ తరగతుల్లో చేరుతారని ఆశిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News