మన తెలంగాణ / హైదరాబాద్ : గిరిపుత్రిక కేతావత్ మౌనిక విద్యభ్యాసంతో పాటు సివిల్స్ శిక్షణకు అయ్యే ఖర్చును అఖిలభారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఎఐబిఈఎ) భరిస్తుందని ఎఐబిఈఎ జాతీయ ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం ప్రకటించారు. గుడ్ గవర్నెన్స్‌డే సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరిగిని యూత్ పార్లమెంట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన గిరిపుత్రిక కేతావత్ మౌనిక ప్రసంగించి దేశ ప్రజలందరిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్, కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లోని ఎపి, తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యాలయంలో మంగళవారం జరిగిన బ్యాంకు ఉద్యోగుల సదస్సులో ఎఐబిఈఎ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటాచలం, బిఎస్ రాంబాబులు మౌనికను శాలువా, పూలమాలలతో సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా వెంకటాచలం మాట్లాడుతూ ఒక గిరిజన అమ్మాయి చిన్న గ్రామం నుండి పార్లమెంటు సెంట్రల్ హాలులో ప్రసంగించే స్థాయికి ఎదగడం గొప్ప విషయమని అన్నారు. బాలికల విద్య ప్రాముఖ్యతను విశ్వసిస్తామని, బాలికల విద్య ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తుందని, అసమానతలను తగ్గిస్తుందని అన్నారు. పేద బాలికల విద్యకు, చదువులలో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎఐబిఈఎ దేశవ్యాప్తంగా ఆర్థికంగా సహకరిస్తుందని, అందులో భాగంగానే కేతావత్ మౌనికకు విద్యభ్యాసంతోపాటు సివిల్స్ శిక్షణకు అయ్యే ఖర్చును భరిస్తుందని తెలిపారు.