‘Identifying gifted students early in their education will put them on track to greater success, to the benefit of society as a whole’ Paromita Roy (Gifte d Education in India)
పెంపకం తల్లిదండ్రుల బాధ్యత, బోధన ఉపాధ్యాయుల పని అనుకుంటాం. కానీ, చదువుల్లో తమ పిల్లలు అత్యంత ప్రతిభావంతులు కావాలనుకునే ప్రతి తల్లీదండ్రీ అందుకు అవసరమైన సహకారాన్ని పిల్లలకు నిత్యం అందించాల్సి వుంటుంది. తన విద్యార్థులు గొప్పగా ఎదగాలని కోరుకునే ఉపాధ్యాయుడు పిల్లల సామర్థ్యాల అభివృద్ధికి సదా అంకితమవ్వాల్సి వుంటుంది. తల్లిదండ్రుల నుంచి, గురువుల నుంచి పిల్లలు కోరే సహకారంలో మొదటిది తమను అర్థం చేసుకోవడం. రెండోది తమ ప్రత్యేకతలను, చైతన్యాలను గుర్తించడం.
మూడోది తమ ప్రతిభకు తగిన ప్రోత్సాహం, శిక్షణ ఇవ్వడం, ఇప్పించడం. ఒక అమ్మాయి లేదా అబ్బాయి నిజంగానే ప్రతిభావంతురాలు లేదా ప్రతిభావంతుడు అయితే వారి వయసులో ఉన్న ఇతర పిల్లలతో గనక మనం పోల్చిచూస్తే వాళ్లకు చాలా బలమైన భావోద్వేగాలు, ఆసక్తులు, అభిప్రాయాలు ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు, కొన్నిసార్లు ప్రతిభావంతులైన పిల్లలు ఈ బలమైన భావోద్వేగాలను, ఆసక్తులను, అభిప్రాయాలను వ్యక్తీకరించడంలో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటుంటారు. ఉదాహరణకు తమ పాఠ్యపుస్తకంలో పాఠానికి తగిన పటం ( Illustration) ఉండాల్సినంత బాగా లేనప్పుడు కలత చెందుతారు. పాఠశాలలో మిగతా పిల్లలతో స్నేహం మూలంగా ఏర్పడే సమస్యలను గురించి కూడా తెలివైన పిల్లలు ఇతరుల కంటే ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. తరగతి నుండి విషయాలు సరిగ్గా అందనప్పుడూ విచారపడతారు. ఇంటి వాతావరణంలో కావొచ్చు, పాఠశాల వాతావరణంలో కావొచ్చు, తాము ఆశించిన మార్పులు జరగనప్పుడు, సమస్యలకు తగిన పరిష్కారం లభించనప్పుడూ ప్రతిభావంతులైన పిల్లలు తీవ్ర నిరాశకు లోనవుతారు. తమలోని విద్యాతృష్ణ, సృజనాత్మకత, ఆవిష్కరణాభిలాషకు సంబంధించిన ప్రత్యేక ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో తాత్సారాన్ని తెలివైన పిల్లలు అసలు సహించరు.
ఉత్సాహానికి ఉప్పందిస్తూ తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు విధిగా పిల్లల ప్రతిభకు సరిపడా తోడ్పాటునందించడమే నిజమైన పెంపకం, అసలైన శిక్షణ అవుతాయి. మనందరికీ తెలుసును. ఇటీవల అమెరికా- జాన్స్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయంలోని ‘సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ (CTY)’ విభాగం నిర్వహించిన ప్రతిభా పోటీలో నటాషా పెరియనాయగం అనే భారతీయ తమిళ సంతతికి చెందిన పదమూడేండ్ల చిన్నారి ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతురాలుగా రికార్డుకెక్కాంది. ఈ రికార్డు నటాషాకు రెండో పర్యాయం కూడా. ఈమె ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్‌లోని న్యూజెర్సీలోని ఫ్లోరెన్స్ ఎం. గౌడినీర్ మిడిల్ స్కూల్‌లో ఎనమిదో తరగతి చదువుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 76 దేశాల నుండి పాల్గొన్న 15,300 మంది విద్యార్థులతో పోటీ పడి నటాషా ప్రపంచ అత్యంత ప్రతిభావంతురాలు (World Brightest Girl)గా గుర్తింపు సాధించింది.
నటాషా పెరియనాయగం ఖాళీ సమయంలో డ్రాయింగ్‌ను ఇష్టపడుతుందని, ప్రఖ్యాత భాషాతత్త్వ, శాస్త్రవేత్త ఫాంటసీ రచయిత జెఆర్‌ఆర్ టోల్కిన్ మహాశయుడి రచనలు ‘ద హాబిట్, ద లారడ్స్ ఆఫ్ ద రింగ్స్’ తదితర పుస్తకాలు మనసుపెట్టి చదవుతుందని నటాషా తల్లిదండ్రులు చెప్తున్నారు. సిటివై ప్రాజెక్టు కేవలం ఒక్క పరీక్షలో మార్కుల రూపంలో విద్యార్థులు సాధించిన గ్రేడునే మాత్రమే పరిగణనలోకి తీసుకోదు. ఆవిష్కరణాభిరుచిని, అభ్యసనంపైన పిల్ల శ్రద్ధాసక్తులను, అట్లాగే పిన్న వయసులో వారు పోగు చేసుకున్న జ్ఞానాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆవిష్కరణాభిరుచి ప్రతిఫలనం మీదా, సామాజిక ప్రాపంచిక సుసంపన్నమైన అనుభవాల మదింపు మీదా, ఉత్కృష్ట విషయాలను సాధించడానికి ఉపయోగించుకోవాల్సిన గుణాత్మక సామర్థ్యాల మీదా ఉత్తేజకరమైన ఆలోచనలు జోడించి నటాషా ప్రపంచ గుర్తింపును అందుకుంది. ఈ Talent Searchలో మానసిక శాస్త్ర సంబంధమైన SAT, విద్యా విషయాలకు సంబంధించిన ACT అస్సెస్‌మెంట్లలో అద్భుత ప్రతిభను చాటింది.
తెలివైన, ప్రకాశవంతమైన గిఫ్టెడ్ చిల్డ్రెన్‌గా సంబోధించబడుతున్న నటాషా వంటి ప్రతిభావంతులైన పిల్లలను అమెరికాలో తల్లిదండ్రులు, విద్యావేత్తలు, శాసనసభ్యులు ‘వాళ్లు స్వయంగా బాగు పడగలరు (They will be fine on their own)’ అని బలంగా నమ్ముతారు. తమంతట తాముగా అభివృద్ధి చెందడానికి ప్రతిభావంత బాలబాలికలకు కేవలం కఠినమైన హోం వర్క్ కంటే ప్రకాశవంతమైన మనస్సే కీలకమైందని అమెరికన్లు భావిస్తారు. ప్రతిభావంతులైన పిల్లలు ఆయా రంగాల్లో రాణించాలన్నా మెరుగైన ఫలితాలు సాధించాలన్నా మంచి వనరులు, నాణ్యమైన శిక్షణ, భావోద్వేగాలను తీర్చిదిద్ద గలిగే ప్రమాణాత్మక ప్రాంగణాలు అందుబాటులో ఉండాలని అమెరికన్ ‘డిసెరెట్ న్యూస్ ఛానల్’ నిపుణుల ద్వారా ప్రభుత్వాలకు సూచన చేసింది.
అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపాల్లో ప్రతిభావంతులైన బాలల సంరక్షణ గురించి AAGT, MT AGATE, AAEGT వంటి ఎన్నో ప్రత్యేక సంస్థలు ‘ది వరల్డ్ కౌన్సిల్ ఫర్ గిఫ్టెడ్ అండ్ టాలెంటెడ్ చిల్డ్రన్ (డబ్లుసిజిటిసి)’ కు అనుబంధంగా పని చేస్తున్నాయి. బహుళ సంస్కృతి, భిన్న నాగరికతలు, బహుభాషావరణ నేపథ్యం గల మన దేశంలో నలభై కోట్ల పైచిలుకు బాలబాలికల తమ ప్రతిభాన్వేషణ కోసం పటిష్ఠ జాతీయ విధానం ఎంతో అవసరమైంది. ఎన్‌ఎజిసి (National Association for Ifted Children) స్థాపన, జవహర్ నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు, టాలెంట్ సెర్చ్‌లో భాగమే. మన రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న మహాత్మా జ్యోతిరావు ఫూలే సాంఘిక సంక్షేమ గురుకులాలు, ఆదర్శ పాఠశాలలు ప్రకాశవంతుల తయారీలో నిమగ్నమైనాయి. ఇవి చాలినన్ని లేకపోవడం వల్ల దేశ వ్యాప్తంగా దళిత, ఆదివాసీ, అణగారిన, గ్రామీణ ప్రతిభాసమూహాలు మసకబారుతున్నారు.
ప్రతిభావంతులైన పిల్లలు ఉన్నతమైన నైపుణ్యాలు కలిగి ఉన్నప్పటికినీ తదనంతర తరగతుల్లో వారు తమ సహ విద్యార్థులకంటే విద్యాపరంగా క్రమంగా తక్కువ స్థాయికి పడిపోతున్నట్టు ఇటీవలి ఒక గ్రీకు అధ్యయనంలో తేలింది. పోటీతత్త్వం సన్నగిల్లడం, ఆసక్తి నశించడం, కృషి అనే దృక్పథం నుంచి వైదొలగడం మూలాన ప్రతిభావంతులైన పిల్లలు పేలవంగా మారిపోతున్నారు. ఎంత చురుకైనా విద్యార్థులైనా తగిన తర్ఫీదు మార్గదర్శనం దొరక్కపోతే, ఒక్క గ్రీసు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా జరిగేది ప్రతిభా పతనమే. తమలో ఏకోశానా ఎక్కడా చదువు పట్ల అలసత్వం లేకున్నా తక్కువ ఆదాయ వర్గాల ప్రతిభావంతులైన పిల్లలు సైతం సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంతరాల కారణంగా టాలెంట్ సెర్చ్‌లో వెనుకబడుతున్న పరిస్థితి వుంది.
అందుకే ‘Knowledge, as the old saying goes, is power.Without equal access to this power, a society simply can’t hope to thrive. By providing decent education to our talented under privileged children, we will not only be benefiting them, but also to the future of our nation’ అంటోంది రాజస్థాన్ కు చెందిన ‘సితారే ఫౌండేషన్.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే కాదు, ప్రభుత్వాలు సైతం సితారే వ్యాఖ్యను చెవిన పెట్టాల్సుంది. మన రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్ అంబేడ్కర్, క్షిపణి శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం తదితర అపర మేధావులను బాల్యంలో అక్కున చేర్చుకున్నది గురువు ఔదార్యమే. గురు ఔదార్యమే లేకుంటే అంబేడ్కర్, అబ్దుల్ కలాం వంటి మహనీయుల మేధా సంపత్తిని ప్రతిభాపాటవాలను ప్రపంచం చవిచూసేదే కాదు. కాబట్టి బాలబాలికల దృష్టిని విద్య పైకి మళ్లించడంతో పాటు, తరగతి గదిలో ప్రకాశవంతమైన పిల్లలను గుర్తించి ప్రోత్సహించడం, మూర్తిమంతులుగా తీర్చిదిద్దడం కోసం ఉపాధ్యాయులంతా ప్రత్యేక కార్యాచరణ కలిగి ఉండాలి.
సొంతంగా చక్కటి వైవిధ్యభరితమైన విద్యాత్మక కార్యక్రమాలను రూపొందించి నిర్వహించాలి. పిల్లలే దేశానికి పురోగతిని ప్రసాదించగలరు. అసమాన ప్రతిభా షేముషిని తెచ్చిపెట్టగలరనే విషయాన్ని ఎవ్వరమూ విస్మరించరాదు. “కళ, స్వేచ్ఛ, సృజనాత్మకత సమాజాన్ని రాజకీయాల కంటే వేగంగా మార్చగలవు’ అంటాడు ఉక్రేనియన్ ఫిలాంత్రఫిస్టు విక్టర్ పించుక్. కళలో ఆసక్తులనూ అభివ్యక్తి మర్యాదనూ; స్వేచ్ఛలో ఆలోచనలనూ దార్శనికతనూ; సృజనాత్మకతలో అన్వేషణనూ నిగూఢ ప్రతిభను పిల్లల్లో వెలికితీయవచ్చు. కళ, స్వేచ్ఛ, సృజనాత్మకత ఈ త్రికోణమితిలో ఏదో ఒక తావున మెరుస్తూ వాల్ట్ విట్మన్ పండితుడన్నట్టు ‘ నేను పెద్ద వాడిని. నాలో చాలా మంది ఉన్నారు’ అంటూ ఒక్కో పిల్లవాడు తాత్త్వికంగా ఎదురుపడుతుంటారు. ఇక్కడే అందరం సమయమిచ్చి బాలోద్దీపనకు చేయూతనివ్వాలి. ఎందుకంటే ఒకరిద్దరుకాదు, వేల కొలది నటాషాలున్న జ్ఞానభూమి మనది. ప్రమిద ఉంది. నూనె వుంది. ఒత్తి వెలిగించడమే గురుతర బాధ్యత.
డా. బెల్లియాదయ్య
9848392690