ఖమ్మం: చదువు మాత్రమే ఎవరినైనా ప్రపంచం ముందు నిలబెడుతుందని, ఎలాంటి క్లిష్టతరమైన పరిస్థితులు ఎదురైన భయపడి చదువుకోవటానికి వెనుకంజ వేయవద్దని ఖమ్మం కలెక్టర్ గౌతమ్ అన్నారు. బుధవారం ఖమ్మంలోని టిటిడిసి మీటింగ్ హాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పేదరికానికి భయపడకుండా ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్తున్న కల్లూరు మండలం యజ్ఞనారాయణపురం గ్రామానికి చెందిన అనాథ అయిన నాగళ్ల శివ అనే విద్యార్ధిని ఆయన శాలువాతో సత్కరించారు.
చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరమైన అన్నాచెల్లెలు శివ, ఉమలను వారి అమ్మమ్మ తాతయ్యలు చదివిస్తుండగా వారిద్దరిని కరోనా పొట్టన పెట్టుకున్న విషయం తెలుసుకున్న ఉపాధ్యాయుడు బండి నాగేశ్వరరావు సామినేని ఫౌండేషన్ వారికి ఈ విషయం తెలిపి సాయం కోరారు. అమెరికాలో ఉంటున్న సామినేని రవి వెంటనే స్పందించి వారి చదువు బాధ్యతను తీసుకున్నారు. బిటెక్ పూర్తి చేసిన శివ ఓహెచ్‌ఐవో యూనివర్శిటీలో ఎం.ఎస్. కంప్యూటర్ సైన్సు చేసేందుకు అడ్మిషన్ పొం దాడు. దానికయ్యే ఖర్చును భరించడానికి సామినేని రవి శివకు హామీ ఇచ్చారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ , మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభిలు శివను ఖమ్మంకు ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్ బాధ్యులు బోనాల రామకృష్ణ, బండి నాగేశ్వరరావు, వాసిరెడ్డి అర్జునరావు, సుధాకర్‌లు పాల్గొని శివను అభినందించి రవి సామినేనికి ధన్యవాదాలు తెలిపారు.