Wednesday, April 9, 2025

విలువలు, బాధ్యత పాత్రికేయుల శ్వాస

- Advertisement -
- Advertisement -

‘కట్టుబడికి, పెట్టుబడికి పుట్టిన విష పుత్రికలు’ అంటూ మహాకవి శ్రీశ్రీ ఏనాడో మన పత్రిక ప్రపంచం గూర్చి వ్యాఖ్యానించారు. తర్వాత కాలంలో ఎలక్ట్రానిక్ మీడియా రంగప్రవేశం చేసింది. ఇక డిజిటల్ యుగం కావడంతో సోషల్ మీడియా పూర్తిగా నేడు రాజ్యమేలుతున్నది. లిబరలైజేషన్ నేపథ్యంలో నిబంధనలు సరళతరమై యూ ట్యూబ్ చానళ్లు విస్తృతమై కొన్నిసార్లు వికృతమైన పరిస్థితులు నేడు నెలకొన్నాయి. ఇక రాజకీయ నేపథ్యం లేదా అనుబంధమున్న పత్రికలు, అలాగే చానళ్లు, ఇప్పుడు యూట్యూబ్ చానళ్లు తమ భావజాల వ్యాప్తికి కంకణం కట్టుకున్నాయి. కాని తమ భావజాలాన్ని పక్కనపెట్టి ఇతర పార్టీలను, వారి విధానాలను విమర్శిస్తూ వ్యక్తిగత దూషణలకు దిగడం గమనార్హం.

ఇందులో శ్రుతిమించిన విమర్శలు కుటుంబ వ్యక్తులను లాగడం శోచనీయం. అది ఒకనాడు ఒక చానల్‌తో మొదలై ఇంతింతై వటుడింతై లాగా తెలుగు రాష్ట్రాల్లో విశృంఖలమైంది. నాడు దానిని సమర్థించి పెంచి పోషించిన వారే నేడు అలాంటి చానళ్లు తమ విధానాలను ఎత్తిచూపితే, తమను విమర్శిస్తే అసహనానికి గురై అసెంబ్లీ సాక్షిగా, ప్రజల సాక్షిగా, ప్రజాప్రతినిధుల సాక్షిగా అవాకులు చవాకులు పేలుతున్నారు. ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’ అన్నది నేడు నిజమైంది. నేడు ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పితే బాధ్యత గల పదవులలో ఉన్నవారు వారి బట్టలు విప్పుతాను అనడం కర్ణకఠోరంగా ఉంది. ఇప్పుడు మార్గదర్శకాలు ఉండాలి. నియంత్రణ రేఖ ఉండాలి.

స్వీయ నియంత్రణ పాటించాలి అనడం దయ్యాలు వేదాలు వల్లించడమే అవుతుంది. ‘తమలపాకుతో నువ్వు ఒకటంటే తలుపు చెక్కతో నే రెండంట’ అన్న తీరున నేడు డిజిటల్ చానళ్లు ప్రవర్తిస్తున్నాయి. పెడ ధోరణులకు, విచ్చలవిడితనానికి ముకుతాడు వేయాలనడం తప్పు కాదు కాని తమ దాకా వస్తేనే కళ్లు తెరవడం ఆశ్చర్యకరం. మన రాజకీయ పక్షాలు (కమ్యూనిస్టులు మినహా) విపక్షంలో వ్యతిరేకించిన విధానాలను అధికారానికి రాగానే అమలు పరచడం మామూలే. దీనికి గత ప్రభుత్వ విధానాలే కారణమని సమర్థించుకోవడం మనకు విదితమే. పత్రికలు, చానళ్లు, పాత్రికేయులు తమ భావజాలాన్ని ఎంత గొప్పగా చెప్పుకున్నా ప్రజలు మాత్రం తమ విచక్షణతో వాటిని ఆదరించడమో లేక తిరస్కరించడమో చేస్తారు. ప్రభుత్వ విధానాలను నిర్బంధంగా ఖండించవచ్చు.

కాని రాజకీయ నేతల వ్యక్తిగత జీవితాన్ని బజారు కీడ్చడం అభ్యంతరకరం. వ్యక్తుల ప్రైవేటు బతుకు వారి వారి సొంతం. పబ్లిక్‌లో నిలబడితే ఏమైనా అంటాం కాని దానికి ఒక పరిధి, పరిమితి ఉన్నాయి. విమర్శ విధానానికి సంబంధించినది. పరువు వ్యక్తిగతమైనది. ఈ రెంటికి మధ్య సున్నితమైన గీతను చెరిపివేస్తే అది అరాచకానికి దారి తీస్తుంది. దాన్ని సహించిన, పెంచి పోషించిన అది చివరకు మనల్ని కాటేస్తుంది. మన దేశంలో చట్టాలు వాటి పాత్ర అవి పోషిస్తున్నాయి. ప్రతి దానికి ఒక బోర్డు చూసి దానిని ఆమోదించి లేదా అంగీకరించి ఆ తర్వాతనే ప్రజాక్షేత్రంలోకి విడుదల చేయడం చాలా సమయం తీసుకునే ప్రక్రియ. ఈ పోటీ ప్రపంచంలో ప్రతి చానల్ మిగిలిన చానళ్ల కన్నా ముందుండే ప్రయత్నం చేస్తుంది. పాత్రికేయులు తమ అనుభవాన్ని, వివేకాన్ని, వివేచనను, విచక్షణను రంగరించి వీక్షకులకు సరైన సమాచారం, సరైన రీతిలో అందించాలి.

రాజకీయ నేతలే బూతు సంస్కృతి నేర్పితే సామాన్యుడు తాను సహజంగా గ్రామీణ ప్రాంతంలో వాడే భాషను ఎక్కడైనా యథేచ్ఛగా వాడతాడు. భాషకు సున్నితత్వం ఉంది. దానిని గౌరవప్రదంగా వాడాలి. పత్రికల్లో లేదా చానల్లో మొరటుగా ఉండకూడదు. ఒకప్పుడు ‘పీకడం’ అనే పదం వాడటానికి పత్రికా సంపాదకులు సంకోచించేవారు. ఇప్పుడు ఆ పదం సర్వసాధారణం అయిపోయింది. ప్రతి పదవికి, వృత్తికి సామాజిక విలువలు, సామాజిక బాధ్యత ఉంటాయి. అవి గుర్తెరిగి పని చేస్తేనే ఆ పదవికి శోభ లేదా వన్నె చేకూరుతాయి. లక్ష్మణ రేఖలు నియంత్రించలేవు. ప్రతిదీ చట్టం వరకు పోకూడదు. ఎవరికి వారే నియంత్రించుకోవాలి. నేటి పోటీ ప్రపంచంలో పాత్రికేయులకు ఇది పెద్ద సవాలు.
శ్రీశ్రీ కుమార్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News