Friday, November 22, 2024

హాజరు అంతంతే..

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో తెరుచుకున్న విద్యాసంస్థలు
పాఠశాలల్లో తొలి రోజు 21.77 శాతం హాజరు
అత్యధికంగా వరంగల్ జిల్లాలో 34.93 శాతం
అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 13.82 శాతం హాజరు
వేర్వేరుగా స్కూళ్లను సందర్శించిన గవర్నర్, విద్యాశాఖ మంత్రి

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో దాదాపు ఏడాదిన్నర తర్వాత బుధవారం పాఠశాలలు తెరుచుకున్నాయి. కరోనా నేపథ్యంలో విద్యార్థులు మాస్కులు ధరించి పాఠశాలలు, కళాశాలలకు హాజరయ్యారు. మొదటి రోజు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 21.77 శాతం హాజరు నమోదైంది. సర్కారు బడుల్లో 27.45 శాతం హాజరు నమోదు కాగా, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో 18.35 శాతం హాజరు నమోదైంది. కొవిడ్ భయం, వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల తొలి రోజు హాజరు అంతంత మాత్రంగా నమోదైంది. రాష్ట్రంలో అత్యధికంగా వరంగల్ జిల్లాలో 34.93 శాతం హాజరు నమోదు కాగా, అత్యల్పంగా పెదపల్లి జిల్లాలో 13.82 శాతం హాజరు నమోదైంది. పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులు తొలిరోజు కొద్ది సమయం గడిపి మళ్లీ ఇళ్లకు వెళ్లగా, మరికొందరు ఇతర విద్యార్థులతో కలిసి రెండు మూడు గంటల పాటు పాఠశాలల్లోనే గడిపారు. పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రత్యక్ష తరగతులు నిర్వహించాయి. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణం గా పాఠశాలలనపు శుభ్రం చేసి విద్యార్థుల భౌతిక తరగతులకు హాజరయ్యేలా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.గురుకులాలు మినహా పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది.

స్కూళ్లలో పిల్లల సందడి

కరోనా నేపథ్యంలో మూసుకున్న పాఠశాలలు, కళాశాల లు బుధవారం పునఃప్రారంభం కావడంతో స్కూళ్లలో పిల్ల లు సందడి చేశారు. కొవిడ్ నిబంధనల నడుమ రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభం కాగా, మొదటి రోజు మాత్రం నామమాత్రంగానే హాజరు నమోదైంది. చాలా స్కూళ్లలో ఎక్కువగా 9,10 తరగతుల విద్యార్థులే పాఠశాలలకు హాజరు కాగా, మిగతా విద్యార్థులు స్వల్ప సంఖ్యలోనే హాజరయ్యారు.కొన్ని స్కూల్స్ తొలిరోజు ట్రాన్స్‌పోర్ట్‌ను అనుమతించలేదు. పాఠశాలల ప్రారంభం నేపథ్యంలో ముందుగానే స్కూళ్లను శుభ్రం చేసి… భౌతిక తరగతులకు సిద్ధం చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నారు. పలు చోట్ల స్వల్ప సంఖ్యలో విద్యార్థులు పాఠశాలకు చేరుకున్నారు. మాస్కులు ధరిం చి తరగతులకు హాజరయ్యారు. పాఠశాలల్లో అధికారు లు, యాజమాన్యాలు శానిటైజర్లు ఏర్పాటు చేశారు. విద్యార్థుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించి పాఠశాలలోనికి అనుమతించారు.విద్యార్థులు వస్తుంటే చాలా సంతోషంగా ఉందని టీచర్లు, సిబ్బంది పేర్కొన్నారు.జూనియర్ కళాశాలల్లో ప్రత్యక్ష బోధన మాత్రమే ఉంటుందని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.

స్కూళ్లను సందర్శించిన గవర్నర్, విద్యాశాఖ మంత్రి

పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, విద్యాశాఖ పి.సబితా ఇంద్రారెడ్డి వేర్వేరుగా స్కూళ్లను సందర్శించారు. గవర్నర్ రాజ్‌భవన్ పాఠశాలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పాఠశాలల ను అధికారులు శుభ్రం చేయించారని, విద్యార్థులు సంతోషంగా, నిర్భయంగా పాఠశాలకు వచ్చారని అన్నా రు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులు కూడా సంతోషంగా ఉన్నారని అన్నారు. పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలని గవర్నర్ సూచించారు.

కొవిడ్ నిబంధనలు పాటించాలి : సబిత

పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా, విద్యార్థుల తల్లిదండ్రుల నమ్మకాన్ని పెంచేలా ఏర్పాట్లు చేయాలని సూచిం చారు. విజయనగర్ కాలనీలోని ప్రభు త్వ పాఠశాలను మంత్రి సందర్శించి విద్యార్థులతో మాట్లా డారు. ఈ సందర్భంగా త్రాగునీరు, శాని టైజర్, ఇతర వసతులను పరిశీలించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం నిబంధనలు పాటిస్తూ పాఠశాలను ప్రారంభించామని, ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని ఉపాధ్యాయులను కోరారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు కచ్చితంగా చేతులు శుభ్రంగా కడుక్కునేలా చూడాలని పాఠశాలల సిబ్బందికి సూచించారు. డిఇఒలు, ప్రధానోపాధ్యాయు లు గతంలో కన్నా ఎక్కువ జాగ్రత్త గా తీసుకోవాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన సమయంలో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలని మంత్రి కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News