మెదక్: పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని మాత ఆలయాన్ని గురువారం మూసివేశారు. భక్తుల దర్శనాల కోసం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఏర్పాటుచేసి పూజలు నిర్వహిస్తున్నారు.
ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఎగువ ప్రాంతంలో వర్షాలు పడడంతో మంజీరా నది పరువళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది. మంజీరా నది ఉధృతికి అమ్మవారి గుడి జలదిగ్బంధన అవుతుంది.
వనదూర్గ ప్రాజెక్టు పొంగిపొర్లతు అమ్మవారి ఆలయం చుట్టూ ఏడుపాయలుగా చిలి భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. అమ్మవారి ఆలయం ముందు గల పాయనుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో ఆలయంలోకి వరద నీరు వచ్చే అవకాశం ఉండటంతో ఆలయ సిబ్బంది ముందస్తుగా రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఏడుపాయలకు వచ్చిన భక్తులు రాజగోపురంలో దర్శనాలు చేసుకుంటున్నారు. ఏడుపాయలలో వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో నీటి పరిసర ప్రాంతాలకు భక్తులు వెళ్లకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.