Friday, December 27, 2024

టీకా సృష్టికర్త ఎడ్వర్ట్ జెన్నర్

- Advertisement -
- Advertisement -

వివిధ వ్యాధులు సోకకుండా కాపాడుకోవడానికి, రోగ నివారణ కోసం వ్యాక్సిన్లు తీసుకోవడం సర్వసాధారణమైపోయింది. కుక్కకాటు, క్షయ, కలరా, కామెర్లు, మలేరియా, కేన్సర్ల వంటి వ్యాధులకు పూర్వం సరైన మందులు లేవు. ప్రధానంగా మానవాళి మనుగడకు పెను సవాలుగా నిలిచిన మశూచి వ్యాధి ప్రపంచమంతా భయంకరంగా వ్యాపించి ఉండేది. ఇంగ్లండ్‌కు చెందిన ఎడ్వర్డ్ జెన్నర్ స్మాల్ ఫాక్స్ వ్యాధి సోకకుండా ఉండటానికి వ్యాధి నిరోధక ‘వ్యాక్సినేషన్’ మందు కనిపెట్టి మానవాళికి ఎంతోమేలు చేశాడు. వ్యాక్సిన్ అనే పదం ‘వాకా’ నుంచి వచ్చింది. వాకా అంటే ఆవు అని అర్థం. స్మాల్ పాక్స్ (మశూచి) క్రీ.పూ. 3వ శతాబ్దం నుంచి మానవ చరిత్రలో ఈ వ్యాధి ప్రస్తావన కనిపిస్తుంది. 18వ శతాబ్ది నాటికి కాలనైజేషన్ కారణంగా ప్రపంచమంతా విస్తరించింది.

దీని వల్ల కలిగే మరణాలు భారీగా ఉండేవి. మశూచి అంటువ్యాధి. అయితే, దీనికి వ్యాక్సిన్ కనిపెట్టింది మాత్రం 1796వ సంవత్సరంలోనే బ్రిటన్‌కు చెందిన డాక్టర్ ఎడ్వర్డ్ జెన్నర్. ఒక వ్యాధికి అడ్డుకట్ట వేయడానికి తయారు చేసిన తొలి వ్యాక్సిన్ ఇదే. దీని వల్లే మశూచి మరణాల సంఖ్య గణనీయంగా తగ్గాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో 1980 నాటికి మశూచి అంతమైనట్లు అప్పటి వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ప్రకటించింది. జెన్నర్ ఒక ఆంగ్ల వైద్యుడు, మశూచి వ్యాక్సినేషన్ మార్గ దర్శకుడు, రోగ నిరోధక శాస్త్ర పితామహుడు. ఎడ్వర్డ్ జెన్నర్ 1749 మే 17న గ్లౌసెస్టర్‌షైర్‌లోని బర్కిలీలో జన్మించాడు. 14 సంవత్సరాల వయస్సులో స్థానిక సర్జన్ వద్ద, తరువాత లండన్‌లో శిక్షణ పొందాడు. 1772లో అతను బర్కిలీకి తిరిగి వచ్చాడు. అతని కెరీర్‌లో ఎక్కువ భాగం తన స్థానిక పట్టణంలో వైద్యుడిగా గడిపాడు. 1796లో అతను ఎనిమిదేళ్ల జేమ్స్ ఫిప్స్‌పై ఇప్పుడు ప్రసిద్ధి చెందిన ప్రయోగాన్ని చేశాడు.

జెన్నర్ కౌపాక్స్ స్ఫోటము నుండి తీసిన చీమును బాలుడి చేతిపై ఒక కోతలోకి చొప్పించాడు. తన ప్రయోగాన్ని వివరిస్తూ 1797లో రాయల్ సొసైటీకి ఒక పత్రాన్ని సమర్పించాడు. జెన్నర్ తన 11 నెలల కొడుకుతో సహా ఇతర పిల్లలపై ప్రయోగాలు చేశాడు. 1798లో ఫలితాలు చివరకు ప్రచురించబడ్డాయి. మశూచి 16, 17 శతాబ్దంలో కొన్ని లక్షల మంది చావుకు కారణం అయిన వ్యాధి. ఎడ్వర్డ్ జెన్నర్ డాక్టర్ అయ్యాక గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేయడం ప్రారంభించాడు. మశూచి బాగా ప్రబలుతున్న కాలంలో డైరీ ఫారంలో పనిచేస్తూ కౌపాక్స్ వ్యాధి వచ్చిన రైతులకు మశూచి సోకడం లేదని ఆయన గమనించాడు. పశువుల నుంచి మనుషులకు సంక్రమించే కౌపాక్స్‌తో బాధపడుతున్న ఒక వ్యక్తి అతను పని చేసే డాక్టర్ దగ్గరకు వచ్చాడు. కౌపాక్స్ సోకిన వ్యక్తులు స్మాల్ పాక్స్ బారినపడక పోవడాన్ని ఎడ్వర్డ్ గమనించాడు. ఈ పరిశీలనే స్మాల్‌పాక్స్‌కు వ్యాక్సిన్ తయారు చేసేలా తోడ్పడింది.

మొట్టమొదట వ్యాక్సిన్ తయారు చేసిన పరిశోధకుడిగా చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. ఎడ్వర్ట్ జెన్నర్‌కు ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ అని పేరుంది. తన ఫ్రెండ్ అనుమతితో ఆయన కొడుకు అయిన జేమ్స్ మీద 1796 మే 14 న ఒక ప్రయోగం చేశాడు. కౌపాక్స్ సోకిన వ్యక్తి శరీరం మీద వచ్చే బొబ్బ నుంచి వచ్చే స్రావాన్ని జేమ్స్‌కి రాసేసి కౌపాక్స్ వచ్చేలా చేశాడు. 6 వారాల తర్వాత జేమ్స్ ని మశూచికి గురిచేయగా ఎటువంటి మసూచి లక్షణాలు కనిపించలేదు. ఇదే మశూచి వ్యాక్సిన్ కనుగొనడానికి జరిగిన ప్రయత్నం. వ్యాక్సిన్‌లోని పరిణామాలపై పరిశోధన, సలహాలు ఇవ్వడంలో ఎక్కువ సమయం గడిపాడు. జెన్నర్ అనేక ఇతర రంగాలలో పరిశోధన చేశాడు. శిలాజ సేకరణ, ఉద్యాన వనాలపై కూడా ఆసక్తిని పెంచుకున్నా డు. వ్యాధి నివారణలో మానవాళికి మహోపకారం చేసిన జెన్నర్ 1823 జనవరి 26న మరణించాడు.

రామ కిష్టయ్య సంగన భట్ల
9440595494

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News