ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు(88) కన్నుమూశారు.హైదరాబాద్ సిటీలోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజుమున 4.50 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. గతకొంత కాలంగా రామోజీరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు.
నిన్న మధ్యాహ్నం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను నానాక్ రామ్ గడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ రామోజీరావు మరణించారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడిన ఆయనకు ఇటీవల స్టంట్స్ వేశారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు.
రామోజీరావు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న జన్మించారు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. పత్రిక, సినీ రంగంలో చేసిన విశేష కృషిని గుర్తించి.. 2016లో దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ తో భారత ప్రభుత్వం రామోజీరావును సత్కరించింది.