బాహుబలి గెటప్‌లు వద్దు
ఎఫెక్ట్ ఆరు నెలలు లేదా ఏడాదే
ఇతరత్రా నివారణ పద్ధతులు వీడొద్దు
అంతర్గత కణవ్యవస్థనే రక్షణకవచం
వాషింగ్టన్ : కరోనాకు ఇప్పుడు కీలక అస్త్రంగా నిలిచిన వ్యాక్సిన్ల సామర్థ్యం ఎంతకాలం? వీటి ప్రభావం ఎంతమేరకు పనిచేస్తుంది? వీటిని వేసుకున్న తరువాత కూడా వైరస్ సోకే ప్రమాదం ఉందా? అనే అంశాలు ఇప్పుడు ఇంతవరకూ నిర్థారణ కాని అంశాలుగానే మారాయి. ఈ టీకాలు ఎంతకాలం పనిచేస్తాయనే విషయంపై స్పష్టత రాలేదు. ఇప్పటికీ ఈ అంశంపై పరిశోధనలు సాగుతున్నాయి. మనిషిలోని రోగ నిరోధక శక్తికి అనుగుణంగానే వ్యాక్సిన్లు తమ ప్రభావాన్ని ఎక్కువకాలం చూపగల్గుతాయనే వాదన విన్పిస్తోంది. ఇంతవరకూ నిర్ణీత డోస్‌లు తీసుకున్న వారిని ఎంచుకుని వారిపై టీకా ప్రభావం ఏ విధంగా ఉందనేది కనుగొనడానికి నిపుణులు యత్నిస్తున్నారు. పూర్తిస్థాయి నిర్థారణకు సమయం పడుతుందన్నారు.
ఆరు నెలలా? లేక ఏడాదా?
కరోనా టీకా తీసుకున్న తరువాత కనీసం ఆరు నెలలు కొన్ని కేసులలో కనీసం ఏడాది వరకూ ఇవి సమర్థవంతమైన పనితీరును కనబరుస్తాయని ఇప్పటివరకూ జరిగిన ప్రయోగాలలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కరోనా విరుగుడుకు వ్యాక్సినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. రెండు నెలల డోస్‌లు వేసుకున్న తరువాత కనీసం ఆరు నెలల వరకూ అటువంటి శరీరంలోకి వైరస్ ప్రవేశించే అవకాశం లేదని పరిశోధనలలో తేలింది. అయితే అమెరికా ఉత్పత్తి అయిన మోడెర్నా టీకా తీసుకున్న తరువాత ఆరు నెలలు అంతకు మించి కూడా యాంటిబాడీలు కన్పిస్తున్నాయని యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు డెబోరా ఫుల్లెర్ నిర్థారించారు. అయితే టీకాలు జీవితాంతపు రక్షణ నివ్వకపోవచ్చునని, కాల క్రమంలో ఇవి యాంటీబాడీల ఉత్పత్తిని నిలిపివేస్తాయని, ఈ దశలో వైరస్ తిరిగి వ్యాపించే అవకాశాలు లేకపోలేదని మేరీల్యాండ్ వర్శిటీ నిపుణులు డాక్టర్ కథ్‌లీన్ న్యూజిల్ తెలిపారు.
అయితే మొత్తం మీద ఏడాది పాటు రక్షణ కల్పించి తీరుతాయని పలు శాస్త్రీయ పరిశోధనలలో స్పష్టం అయింది. అయితే కొత్తగా అవతారం ఎత్తుతున్న వేరియంట్ల నుంచి రక్షణగా మూడో డోస్ అవసరం అని పరిశోధకులు తెలిపారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల తయారీలో ఉన్న రక్షణ వ్యవస్థ భిన్నమైనది. తాము ఎంచుకున్న వైరస్ జన్యుక్రమపు స్పైక్ ప్రోటీన్ల నుంచి రక్షణ కల్పించేందుకు వీటిని రూపొందించారు. అయితే తరువాతి దశల్లో వచ్చే వైరస్‌ల్లో స్పైక్ ప్రోటీన్ల నుంచి ఇంతవరకూ ఉన్న వ్యాక్సిన్లు రక్షణ కల్పిస్తాయా? అనేది సందేహాస్పదం అయిందని అమెరికాలోని ఎమెరీ వ్యాక్సిన్ సెంటర్ నిపుణులు మెహెల్ సుధార్ తెలిపారు. అయితే ఇప్పటికే రూపొందిన పలు వ్యాక్సిన్లు కొత్త నమూనా కరోనా వైరస్‌ను కూడా దెబ్బతీస్తున్నాయనే అంశం నిర్థారణ కావడం వైద్యపరంగా ఆశాజనక పరిణామం అయింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లు పొందిన వారి సంఖ్య పెరిగితేనే వైరస్ వ్యాప్తి క్రమేపీ తగ్గుతుంది. ఇతరత్రా వివిధ రకాల కరోనా వైరస్‌లు తలెత్తకుండా ఉండేందుకు వీలేర్పడుతుందని నిపుణులు తెలిపారు.
శరీర వ్యవస్థలో కణాలు కీలకం
ఇప్పుడు తీసుకుంటున్న వ్యాక్సిన్లతో వైరస్ నిరోధక యాంటీబాడీస్ ఏర్పడుతాయి. అయితే శరీరంలో బి టి కణాల వ్యవస్థ బలోపేతంగా ఉంటే కొన్ని సందర్భాలలో యాంటీబాడీస్ బలంతో సంబంధం లేకుండా వైరస్ నుంచి రక్షించుకోవచ్చునని సైంటిస్టులు తేల్చిచెప్పారు. యాంటీబాడీల పరిణామం తాత్కాలికం అయినా శరీరంలో టీ బి కణాలు ఎక్కువ కాలం ఉంటాయి. శరీరంలో ప్రవేశించే ప్రాణాంతక వైరస్ జన్యుకణాలను ఇవి వెంటనే గుర్తించి తగు విధంగా వాటిని తిప్పికొడుతాయని తెలిపారు. పూర్తి స్థాయిలో ఈ కణాలు వాటితో పోరాడలేకపోయినా, తగు విధంగా రక్షణనైతే ఇస్తాయి. అయితే ఈ కణాల ఎంత వరకూ ప్రభావం చూపుతాయనేది తేలాల్సి ఉంది.
వ్యాక్సిన్లు వ్యాక్సిన్లే జాగ్రత్తలు జాగ్రత్తలు
చాలా మంది సాధారణంగా తాము వ్యాక్సిన్ తీసుకున్నందున ఇక పూర్తిశక్తివంతులమయ్యామనే భావనకు గురవుతారు. మాస్క్‌లు లేకుండా తిరగడం, సామూహిక కార్యక్రమాలకు వెళ్లడం వంటివి చేస్తారు. వ్యాక్సిన్ వైరస్ నుంచి రక్షణకు లైసెన్సు ఏమీ కాదని , కనీస రక్షణ చర్యలు పాటిస్తూ ఉన్నట్లు అయితే , మన శరీర అంతర్గత ప్రసరణ వ్యవస్థలోకి జారుకున్న వ్యాక్సిన్లు వాటి ప్రభావాన్ని మరింత సమర్థవంతంగా చూపగల్గుతాయని వైద్య పరిశోధనలలో తేలింది.