ఓటర్లను ప్రభావితం చేసే లిక్కర్ పార్టీలపై ఎక్సైజ్ శాఖ నజర్
రిసార్ట్‌లో పెండ్లి, ఫ్యామిలీ ఫంక్షన్స్, గెట్ టు గెదర్ నిర్వహించే వారి నుంచి
రూ.100ల బాండ్ పేపర్‌పై ఎక్పైజ్ శాఖ అండర్ టేకింగ్
రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రభావితం చేసే విధంగా పంక్షన్‌లను నిర్వహిస్తే
చర్యలు చేపట్టనున్న ఆబ్కారీ శాఖ
ఈసీ అనుమతి ఉంటేనే రాజకీయ పార్టీలు నిర్వహించే వేడుకలకు ఆబ్కారీ శాఖ గ్రీన్‌సిగ్నల్
మనతెలంగాణ/హైదరాబాద్: వివాహాలు, శుభకార్యాలపై ఎలక్షన్ కోడ్ ప్రభావం చూపుతోంది. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా లిక్కర్ పార్టీలను నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఎక్సైజ్ శాఖ అలర్ట్ అయ్యింది. రిసార్ట్, ఫంక్షన్ హాల్స్, కమ్యూనిటీ హాల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఫంక్షన్ హాల్స్, కన్వెన్షన్ సెంటర్స్, రిసార్ట్‌లో పెండ్లి, ఫ్యామిలీ ఫంక్షన్స్, గెట్ టు గెదర్ నిర్వహించే వారి నుంచి ఎక్సైజ్ అధికారులు రూ.100ల బాండ్ పేపర్‌పై అండర్ టేకింగ్ తీసుకుంటున్నారు. రాజకీయ పార్టీలు, స్థానిక నాయకులు, ఎలక్షన్‌కు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదని అధికారులు వారితో బాండ్ రాయించుకుంటున్నారు. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా పార్టీలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
మందు సరఫరాకు అనుమతి తప్పనిసరి
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లా సహా గ్రేటర్ పరిసర ప్రాంతాల్లో జరిగే శుభకార్యాలలో లిక్కర్ సప్లయ్ స్టేటస్ సింబల్‌గా మారింది. విందులో లిక్కర్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు. ఫంక్షన్ హాల్లోనే బార్ తరహా టేబుల్స్, మందు, వెజ్, నాన్ వెజ్ ఫుడ్ ఏర్పాటు చేస్తారు. టేబుల్స్ వారీగా ఫుల్ బాటిల్స్ అందిస్తుంటారు. ఇందుకోసం స్థానిక ఎక్సైజ్ పోలీసుల అనుమతి తప్పనిసరి. ఈవెంట్స్‌లో లిక్కర్ సప్లయ్ చేయాలనుకుంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈవెంట్ నిర్వహించే వారి పూర్తి వివరాలతో సంబంధిత డాక్యుమెంట్స్‌ను అందించాలి. ప్రస్తుతం ఈ అనుమతి కోసం ఎక్సైజ్ శాఖకు రూ.12వేలు, శివారు ప్రాంతాల్లో రూ.9వేలు చెల్లించి అనుమతి తీసుకోవాలి. దీనికి సంబంధించి సమయం రెండు విడతలుగా ఎక్సైజ్ శాఖ అధికారులు అనుమతి ఇస్తున్నారు. ఈ అనుమతి కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో పార్టీకి రెండింటిలో ఏదో ఒక సమయాన్ని మాత్రమే ఇస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు కంటిన్యూగా కావాలంటే సుమారు రూ.24 వేలను చెల్లించాల్సి ఉంటుంది.
కోడ్ అమల్లోకి రాకముందు అండర్‌టేకింగ్ లేకుండానే…
ఎలక్షన్ కోడ్ అమలులోకి రాకముందు మాములుగా పంక్షన్‌లు చేసుకునే వారికి అండర్ టేకింగ్ లేకపోయినా ఎక్సైజ్ శాఖ అనుమతులు ఇచ్చే వారు. కానీ, కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి నిబంధనలు కఠినతరం చేశారు. రూ.100 బాండ్ పేపర్ అండర్ టేకింగ్ తప్పని సరి చేశారు. అనుమతి కోసం అప్లయ్ చేసుకున్న వారికి ముందస్తు సమాచారం అందిస్తున్నారు. ప్రస్తుతం ఎంగేజ్‌మెంట్స్, ఫ్యామిలీ గెట్ టు గెదర్ సహా లిక్కర్ సప్లయ్ చేసే ప్రతి ఈవెంట్‌కు సంబంధిత వ్యక్తుల నుంచి బాండ్ పేపర్ తీసుకుంటున్నారు. రాజకీయ పార్టీలు, నాయకులు, ఎలక్షన్స్‌కు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదని నిర్వాహకుల నుంచి అండర్ టేకింగ్ తీసుకుంటున్నారు.
ఓటర్లను ఆకర్షించేందుకు మద్యం పార్టీలు
ఓటర్లను ఆకర్షించేందుకు వివిధ పార్టీల అభ్యర్థులు మద్యం పార్టీలు నిర్వహిస్తుంటారు. ఎన్నికల సంఘం దృష్టిలో పడితే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో పుట్టినరోజు, ఆత్మీయ సమ్మేళనాలు, వేడుకల పేరిట వీటిని నిర్వహిస్తున్నారు. రిసార్టులు, ఫంక్షన్‌హాళ్లు, కమ్యూనిటీ భవనాలు, నగర శివార్లలోని ఫాంహౌస్‌లో మద్యం పార్టీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన అనుచరులు, అసంతృప్తులను పిలిపించి చర్చలు జరుపుతున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఈ తరహా వేడుకలు ఓటింగ్‌ను ప్రభావితం చేస్తాయన్న ఉద్దేశంతో తమ అనుమతి తీసుకున్న తరువాతే వాటిని నిర్వహించుకోవాలని ఎలక్షన్ కమిషన్ సూచించిన నేపథ్యంలో అనుమతి తీసుకున్న తరువాత ఇలాంటి వేడుకలను జరుపుకోవాలని ఆబ్కారీ అధికారులు సూచిస్తున్నారు. ఇంట్లో ఫంక్షన్, శుభాకార్యాల కోసం లిక్కర్ పెద్ద మొత్తంలో కొన్నా దానికి కూడా ఆబ్కారీ శాఖ అనుమతి తీసుకోవాల్సిందేనని అధికారులు తెలిపారు.