Friday, November 1, 2024

‘జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ ప్రభావవంతమైన కార్యక్రమాలు భేష్

- Advertisement -
- Advertisement -

పలు పుస్తకాలను ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ
అటవీ జంతువుల సంరక్షణ దిశగా అటవీ శాఖ చర్యలు

మన తెలంగాణ / హైదరాబాద్ : యువ పరిశోధకులు, శాస్త్రవేత్తల సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ‘జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ ప్రభావవంతమైన కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయమని అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం మాదాపూర్‌లోని ఆవాస హోటల్‌లో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి వర్క్ షాప్ ముగింపు కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమ నిర్వాహకులు ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖకు సాదర స్వాగతం పలికారు. వేదిక పై ఆశీనులైన మంత్రికి పుష్పగుచ్ఛాన్ని అందించి, శాలువాతో సత్కరించారు. జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కవ్వాల్ టైగర్ రిజర్వ్‌కు సంబంధించి తమిళంలో రాసిన పలు పుస్తకాలను మంత్రి సురేఖ ఆవిష్కరించారు.

కాగా మంత్రి సురేఖ చేతుల మీదుగా పలువురికి సర్టిఫికెట్లు, ప్రైజ్ లను నిర్వాహకులు అందించారు. అనంతరం అడ్వాన్సెస్ ఇన్ ఫిష్ సిస్టమాటిక్స్ , మార్ఫోలాజికల్ అండ్ మాలిక్యులర్ అప్రోచెస్ సబ్జెక్ట్ పై మంత్రి సురేఖ ప్రసంగించారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ సంయుక్తంగా రెండు రోజులు పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నజాతీయ వర్క్ షాప్‌లో భాగస్వామిని అయినందుకు గర్వంగా వుందని మంత్రి అన్నారు. ఈ వర్క్ షాప్‌కు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలతో పాటు మరెంతో మంది ఫిష్ సైంటిస్టులు, యువ నిపుణులు హాజరవ్వడం సంతోషాన్నిచ్చిందని మంత్రి తెలిపారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన ఫౌనా ఆఫ్ కవ్వాల్ టైగర్ రిజర్వ్, ఫౌనా ఆఫ్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ పుస్తకాల్లో పేర్కొన్న విషయాలు కవ్వాల్ టైగర్ రిజర్వ్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లతో పాటు తెలంగాణలోని అటవీ జంతువుల సంరక్షణ దిశగా తెలంగాణ అటవీ శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టేందుకు ఊతమిచ్చేవిగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.

ఇక ‘ ప్రెష్ వాటర్ ఫిషెస్ ఆఫ్ రివర్ గోదావరి ’ పుస్తకం అంతరించిపోతున్న మత్స్య జాతులపై అధ్యయనానికి, ఆక్వాకల్చర్ (చేపల సాగు) విధానాలను తెలుసుకోవడానికి, మరో పుస్తకం సాధారణ జనాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా పుస్తక కూర్పులో భాగస్వాములైన జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో పాటు పుస్తక రచయితలందరిని మంత్రి అభినందించారు. ఈ రెండు రోజుల వర్క్ షాప్‌లో చేపల శరీర నిర్మాణం, వాటి స్వరూప స్వభావాలకు సంబంధించి నిపుణులు వెలువరించిన విషయాలు యువ పరిశోధకుల జ్ఞాన తృష్ణను తీర్చి ఉంటాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ జ్ఞాన సంపదతో పరిశోధకులు జీవవైవిధ్య పరిరక్షణకు పాటుపడేలా తమ పరిశోధనలు సాగించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ వర్క్ షాప్‌ను విజయవంతంగా నిర్వహించినందుకుగాను జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరక్టర్‌ను మంత్రి కొండా సురేఖ అభినందించారు. ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News